గిరిజనేతరుల చేతుల్లో 1.52 లక్షల ఎకరాల అటవీ భూమి

అడవితో సంబంధం లేని గిరిజనేతరులు అటవీ భూముల్ని పెద్ద మొత్తంలో ఆక్రమించుకున్నారు. సాగు పేరుతో కొందరు, భూముల విలువ పెరుగుతుండటంతో మరికొందరు ఆ భూముల్ని తమ అధీనంలో..

Updated : 28 May 2022 06:56 IST

ఆక్రమణదారులు 46,871 మంది.. 

6 జిల్లాల్లోనే లక్ష ఎకరాల మేర  అటవీ భూమి కబ్జా

ఈనాడు, హైదరాబాద్‌: అడవితో సంబంధం లేని గిరిజనేతరులు అటవీ భూముల్ని పెద్ద మొత్తంలో ఆక్రమించుకున్నారు. సాగు పేరుతో కొందరు, భూముల విలువ పెరుగుతుండటంతో మరికొందరు ఆ భూముల్ని తమ అధీనంలో ఉంచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,871 మంది గిరిజనేతరులు 1.52 లక్షల ఎకరాల అటవీ భూమిని గుప్పెట్లో పెట్టుకున్నట్లు ఆ శాఖ గుర్తించింది. సగటున వీరిలో ఒక్కొక్కరి చేతిలో 3.24 ఎకరాల అటవీ భూమి ఉన్నట్లు తేల్చింది. 

1425 గ్రామాల్లో..

అటవీ భూములకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 1425 గ్రామాల్లో ఆక్రమణలు జరిగినట్లు జిల్లాలవారీగా ఆ శాఖ క్రోడీకరించింది. ఇందులో అత్యధికం ఆసిఫాబాద్‌ (169), కొత్తగూడెం (131), ఆదిలాబాద్‌ (126) జిల్లాల్లో ఉన్నాయి. ఆక్రమణలకు గురైన అటవీ భూముల్లో దాదాపు లక్ష ఎకరాలు ఆరు జిల్లాల్లోనే ఉండడం గమనార్హం. కొన్నిచోట్ల అధికారులు ప్రయోగాత్మకంగా స్వాధీనం చేసుకుని చుట్టూ కందకాలు తవ్వారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్రలోభాలకు తలొగ్గడం తదితర కారణాలతోనే ఈ స్థాయిలో ఆక్రమణదారులు పాగా వేయగలిగారనే విమర్శలు ఉన్నాయి. 

పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో..

అటవీ ఆక్రమణల్ని అరికట్టే విషయంపై అటవీశాఖ ఇటీవల చర్చించింది. పోలీసు, రెవెన్యూ శాఖల సహకారం తీసుకోవాలని, అటవీ భూముల చుట్టూ కందకాల తవ్వకం వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఆక్రమణలను నిరూపించడానికి నూతన సాంకేతికత పరిజ్ఞానాల్ని వినియోగించేందుకు సిద్ధమవుతోంది.

జిల్లాల వారీగా గిరిజనేతరుల ఆక్రమణలు

ఆసిఫాబాద్‌ 32,132.20 ఎకరాలు, మహబూబాబాద్‌ 18,423.36, ములుగు 15,393.81, కొత్తగూడెం 11,229.98, కామారెడ్డి 10,632.34, భూపాలపల్లి 10,538.94, ఆదిలాబాద్‌ 7,895.81, ఖమ్మం 7,168.95, పెద్దపల్లి 4,713.34, జగిత్యాల 3,992.08, మెదక్‌ 3,435.45, నిజామాబాద్‌ 3,482.18, నాగర్‌కర్నూల్‌ 3,247.14, నల్గొండ 2,479.58, మంచిర్యాల 2,424.23, నిర్మల్‌ 2,023.73, సిద్దిపేట 2,279.23, వనపర్తి 2,130.62, సిరిసిల్ల 1,933.03, మహబూబ్‌నగర్‌ 1,932.80, సంగారెడ్డి 1,763.15, వికారాబాద్‌ 965.43, వరంగల్‌ రూరల్‌ 609.59, భువనగిరి 548.28, రంగారెడ్డి 461.90, సూర్యాపేట 168.93, మేడ్చల్‌మల్కాజిగిరి 104.90, నారాయణపేట 101.65, గద్వాలలో 12.00 ఎకరాలు గిరిజనేతరుల ఆక్రమణల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వరంగల్‌ అర్బన్‌, హైదరాబాద్‌, జనగామ, కరీంనగర్‌ జిల్లాల్లో ఈ సంఖ్య సున్నాగా ఉంది. పోడు వ్యవసాయం చేసుకుంటున్న స్థానిక గిరిజనుల (1,47,664 మంది) అధీనంలో 5,56,430.14 ఎకరాలు, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన గుత్తికోయల (4008 మంది) కబ్జాలో 19,768.14 ఎకరాలు కలిపి మొత్తంగా 7.28 లక్షల ఎకరాల అటవీ భూమి ఆక్రమణల్లో ఉన్నట్లు అటవీశాఖ చెబుతోంది. పోడు భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ఆ ప్రక్రియలో ఎలాంటి కదలిక లేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని