తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా అనిల్‌ కుర్మాచలం

తెలంగాణలోని రెండు ప్రభుత్వరంగ సంస్థలకు ఛైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా తెరాస ప్రవాస విభాగం వ్యవస్థాపక అధ్యక్షుడు

Published : 22 Jun 2022 03:48 IST

రెడ్‌కో ఛైర్మన్‌గా సతీష్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని రెండు ప్రభుత్వరంగ సంస్థలకు ఛైర్మన్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా తెరాస ప్రవాస విభాగం వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కుర్మాచలం, రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్‌కో)  ఛైర్మన్‌గా తెరాస సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్‌ ఏరువ సతీష్‌రెడ్డి నియమితులయ్యారు. వీరిద్దరూ తమ పదవుల్లో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కరీంనగర్‌కు చెందిన అనిల్‌ కుర్మాచలం ఎమ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) పూర్తి చేసిన అనంతరం బ్రిటన్‌కు వెళ్లి ఒక ఐటీ సంస్థలో సలహాదారుగా పనిచేస్తున్నారు. దశాబ్దం క్రితం లండన్‌లో తెరాస ప్రవాస శాఖను ప్రారంభించారు. కల్వకుంట్ల కవిత నేతృత్వంలో వివిధ దేశాల్లో ప్రవాస శాఖలను ఏర్పాటు చేశారు. విదేశాల్లో తెలంగాణ ఉద్యమ విస్తృతి, పండుగలు, కార్యక్రమాల నిర్వహణ ద్వారా గుర్తింపు పొందారు.  తెలంగాణలో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో తెరాస విజయం కోసం ప్రచారం చేశారు. ప్రస్తుతం తెరాస లండన్‌ విభాగం అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ములుగు మండలం దేవగిరిపట్నానికి చెందిన సతీష్‌రెడ్డి బీటెక్‌ పట్టభద్రుడు. తెరాస విద్యార్థి విభాగం నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 2012 నుంచి 2019 వరకు తెరాస యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2020 నుంచి పార్టీ సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్‌గా ఉన్నారు. సోషల్‌ మీడియా విభాగాన్ని క్రియాశీలకంగా నిర్వహిస్తున్నందుకు పలుదఫాలు ప్రశంసలు పొందారు.  నియామక ఉత్తర్వుల జారీ అనంతరం అనిల్‌, సతీష్‌రెడ్డిలు సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు