SI Exam: ప్రాథమిక రాత పరీక్షల ఫలితాలు సెప్టెంబరులో

యూనిఫాం సర్వీసుల ప్రాథమిక రాత పరీక్షల ఫలితాలు సెప్టెంబరులో వెలువడే అవకాశముంది. తొలుత ఎస్సై అభ్యర్థులకు ప్రాథమిక రాత పరీక్షలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆదివారం

Updated : 08 Aug 2022 06:01 IST

ఎస్సై పరీక్షలకు 91.32 శాతం హాజరు
యూనిఫాం సర్వీసుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: యూనిఫాం సర్వీసుల ప్రాథమిక రాత పరీక్షల ఫలితాలు సెప్టెంబరులో వెలువడే అవకాశముంది. తొలుత ఎస్సై అభ్యర్థులకు ప్రాథమిక రాత పరీక్షలను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఆదివారం నిర్వహించింది. 554 పోస్టుల కోసం 2,47,217 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు మరో 35 పట్టణాల్లోని 503 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 2,25,759 మంది (91.32 శాతం) హాజరయ్యారు. ఈనెల 21న కానిస్టేబుళ్ల ఎంపికకు సంబంధించిన పరీక్షకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు 9.54 లక్షల మంది పోటీ పడుతున్నారు. వడపోత కోసం ఉద్దేశించిన ఈ పరీక్షలను ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. 2, 3 రోజుల్లో ఎస్సై పరీక్ష ప్రశ్నపత్రం కీ విడుదల కానుంది. కానిస్టేబుల్‌ అభ్యర్థుల ప్రాథమిక పరీక్షలకు సంబంధించి నెలాఖరులోపు కీ ఇవ్వాలని నియామక మండలి భావిస్తోంది. మూల్యాంకనాన్ని వేగంగా పూర్తిచేసి వచ్చే నెలలోనే వీటి ఫలితాలను వెల్లడించే యోచనలో ఉంది. అక్టోబరులో శారీరక సామర్థ్య పరీక్షలను నిర్వహించే దిశలో కసరత్తు చేస్తోంది. వాటి ఫలితాలను నవంబరు చివర్లో ప్రకటించి జనవరి లేదా ఫిబ్రవరిలో తుది రాత పరీక్షలు జరపాలని తలపోస్తోంది. మార్చిలోగా ఎంపిక ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

పీఈటీ.. పీఎంటీ నిర్వహణపై దృష్టి

పోలీసు కొలువుల ఎంపికలో కీలకమైన మలివిడత ప్రక్రియపై మండలి ఇప్పటినుంచే దృష్టి సారించింది. ప్రాథమిక రాత పరీక్షలో అర్హులైన అభ్యర్థులకు అక్టోబరు రెండో వారం నుంచి ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్‌ (పీఎంటీ), ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌ (పీఈటీ)లాంటి శారీరక సామర్థ్య పరీక్షలను నిర్వహించేందుకు పోలీసు మైదానాలు, ఇతర క్రీడా ప్రాంగణాల ఎంపికపై దృష్టి సారించింది. సుదీర్ఘ ప్రక్రియ అయిన ఈ పరీక్షలే నియామకాల్లో కీలకం. సాధారణంగా రాత పరీక్షలకు ఇతర శాఖల అధికారులూ పర్యవేక్షకులుగా వ్యవహరించే వీలుంటుంది. శారీరక సామర్థ్య పరీక్షలకు మాత్రం పోలీసు అధికారులే పర్యవేక్షకులుగా ఉండాలి. దీంతో ఈ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లలో యంత్రాంగం నిమగ్నమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని