ఉక్కుపాదం ఊసేదీ?

రాష్ట్రంలో మత్తుమందుల విచ్చలవిడి వినియోగాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలంటూ అట్టహాసంగా ప్రతిపాదించిన ప్రత్యేక విభాగం పత్తాలేకుండా పోయింది. రాష్ట్రంలో మత్తుమందులు కనిపించకుండా చేయాలని ఎనిమిది నెలల క్రితమే

Published : 13 Aug 2022 05:39 IST

డ్రగ్స్‌ నియంత్రణపై పత్తాలేని ప్రత్యేక విభాగం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మత్తుమందుల విచ్చలవిడి వినియోగాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలంటూ అట్టహాసంగా ప్రతిపాదించిన ప్రత్యేక విభాగం పత్తాలేకుండా పోయింది. రాష్ట్రంలో మత్తుమందులు కనిపించకుండా చేయాలని ఎనిమిది నెలల క్రితమే ముఖ్యమంత్రి చెప్పినా ఫలితం మాత్రం కనిపించడంలేదు. అసలు ఈ ప్రతిపాదనపై ఎవరూ నోరు మెదపడంలేదు. రాష్ట్రంలో మత్తుమందుల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతూ.. గంజాయి వాడకం గ్రామాలకూ విస్తరించింది. దర్యాప్తు సంస్థలన్నీ కలిపి గత ఏడాది దాదాపు 4వేల కిలోలకుపైగా గంజాయి స్వాధీనం చేసుకోవటం పరిస్థితి తీవ్రతను ప్రతిబింబిస్తోంది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు గత ఏడాది మూడు నెలల వ్యవధిలో ఆఫ్రికా నుంచి దిగుమతి అయిన రూ.120కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ వాడకం గురించిచెప్పడానికి ఈ రెండు ఉదంతాలు చాలు.

పట్టుబడిన దానికి.. పదింతలు మార్కెట్‌లోకి

వాస్తవానికి రాష్ట్రంలో మత్తుమందులు నియంత్రణ ఏ ఒక్క విభాగం చేతుల్లోనూ లేదు. పోలీసులు, ఆబ్కారీతోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్సీబీ), డీఆర్‌ఐ, కస్టమ్స్‌ వంటి విభాగాలు పర్యవేక్షిస్తుంటాయి. కానీ, వీటి మధ్య సరైన సమన్వయం లేదు. ఫలితంగా పట్టుబడుతున్న మత్తుమందులకు పదింతలు మార్కెట్లోకి చొరబడుతున్నాయి. తెలంగాణకు ఈ ముప్పు ఎక్కువగా ఉంది.పంజాబ్‌లోలా పరిస్థితి చేతులు దాటకముందే చక్కదిద్దాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి.. మత్తుమందుల కట్టడికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గత జనవరిలో ఉన్నతస్థాయిలో సమావేశమై ప్రత్యేక విభాగం ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. దీనిలో భాగంగానే మత్తుమందుల నియంత్రణకు హైదరాబాద్‌ కమిషనరేట్‌లో హైదరాబాద్‌ నార్కొటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌, నార్కొటిక్స్‌ ఇన్వెస్టిగేషన్‌ సూపర్‌వైజింగ్‌ వింగ్‌ల పేరుతో రెండు ప్రత్యేక విభాగాలకు రూపమిచ్చారు. రాష్ట్రస్థాయిలో ప్రత్యేక విభాగం ఏర్పాటయితే వీటిని కూడా అందులో కలపాలని భావించారు. కాని ప్రత్యేక విభాగం ప్రస్తావన నేటికీ ఎక్కడా వినిపించడంలేదు. అసలు ఇది కార్యరూపం దాల్చేదీ అనుమానంగానే మారింది. ఈ నేపథ్యంలో పాతపంథాలోనే ఎవరికివారు, ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని