Published : 18 Aug 2022 05:47 IST

ఐఐటీలకు అపూర్వ అండదండలు

పూర్వ విద్యార్థుల నుంచి వెల్లువెత్తుతున్న నిధులు
దృష్టి పెట్టని రాష్ట్ర వర్సిటీలు

ఈనాడు, హైదరాబాద్‌: విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలో ఐఐటీలు సైతం పూర్వ విద్యార్థుల నుంచి విరాళాలను (ఎండోమెంట్‌ నిధిని)సమకూర్చుకునే పనిలో పడ్డాయి. దశాబ్దాల క్రితం చదువు పూర్తి చేసుకొని వివిధ కంపెనీల్లో పెద్ద స్థాయిలో ఉన్న ఒక్కో పూర్వ విద్యార్థి రూ.కోట్లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. అమెరికాలోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం వద్ద 42 బిలియన్‌ డాలర్లు  (రూ.3,36,000 కోట్లు), యేల్‌ విశ్వవిద్యాలయం వద్ద 31 బిలియన్‌ డాలర్ల (రూ.2.48 లక్షల కోట్లు) ఎండోమెంట్‌ నిధి ఉంది. అదే బాటలో మన ఐఐటీలు గత రెండు మూడేళ్లుగా కృషి చేస్తున్నాయి.

ఓయూ ఇంజినీరింగ్‌ కాలేజి ఒక్కటే చురుగ్గా...

రాష్ట్రంలోని వర్సిటీలు పూర్వ విద్యార్థులను ఒక తాటిపైకి తీసుకురావడంలో శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలున్నాయి. ఓయూ ఇంజినీరింగ్‌ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం మాత్రం కొంత క్రియాశీలకంగా పనిచేస్తోంది. ఇటీవల మైనింగ్‌ ఇంజినీరింగ్‌ విభాగం నూతన భవన నిర్మాణానికి పూర్వ విద్యార్థి  రూ.80 లక్షల విరాళాన్ని ప్రకటించారని ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య శ్రీరాం వెంకటేష్‌ తెలిపారు. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాన్ని ప్రారంభించి వచ్చే ఏడాదికి 75 సంవత్సరాలవుతున్న సందర్భంగా దానికి కూడా నూతన భవనాన్ని నిర్మించేందుకు ఆ విభాగం పూర్వ విద్యార్థులు సన్నాహాలు చేస్తున్నారని ఆయన చెప్పారు.  జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సంఘాన్ని ఏర్పాటు చేసినా విరాళాలు నామమాత్రమే.


ఒక తాటిపైకి తెస్తున్నాం

ఆచార్య బీఎస్‌ మూర్తి, సంచాలకుడు, ఐఐటీహెచ్‌

గత మూడేళ్ల నుంచి పూర్వ విద్యార్థులను ఒక తాటిపైకి తెస్తున్నాం.వచ్చే డిసెంబరులో అలుమ్నీ డేను జరపబోతున్నాం. మా ఐఐటీ నుంచి తొలి బ్యాచ్‌ 2012లో బయటకు వెళ్లింది. అంటే ఈ ఏడాదికి వారి చదువు పూర్తయి పదేళ్లు అవుతోంది. అందుకే వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. పరిశోధనలకు, మౌలిక వసతుల కల్పనకు సాయం చేయాలని అడుగుతాం. రూ.5 లక్షలు ఇస్తే దానిపై వచ్చే బ్యాంకు వడ్డీతో ఒక విద్యార్థికి పురస్కారం ఇచ్చే విధానాన్ని రూపొందిస్తున్నాం. పూర్వ విద్యార్థులు తాము పనిచేసే కంపెనీలను ఒప్పించి ఐఐటీలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను స్థాపించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నాం.


ఉదారంగా విరాళాలు

ఐఐటీ-బాంబేకు 2018-19 నుంచి 2020-21 వరకు పూర్వ విద్యార్థుల నుంచి రూ.109 కోట్ల విరాళాలు వచ్చాయి. వార్షికోత్సవం సందర్భంగా 3,300 మంది దాతల నుంచి రూ.350 కోట్ల విరాళాలు పోగయ్యాయి.

రూ.వెయ్యి కోట్ల ఎండోమెంట్‌ నిధిని సేకరించాలని  ఐఐటీ దిల్లీ లక్ష్యంగా పెట్టుకుంది. గత అక్టోబరులో అప్పటి రాష్ట్రపతి  కోవింద్‌ ఐఐటీ-దిల్లీ ఎండోమెంట్‌ ఫండ్‌ను ఆవిష్కరించారు. ఆ సందర్భంగా రూ.250 కోట్లు ఇస్తామని పలువురు పూర్వ విద్యార్థులు హామీ ఇచ్చారు. పూర్వ విద్యార్థి అనంత్‌ యార్ది  స్కూల్‌ ఆఫ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను నెలకొల్పేందుకు రూ.75 కోట్ల విరాళం ఇచ్చారు. మరో పాత విద్యార్థి వివేక్‌ వైద్య రూ.10 కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పటికే రూ.2.25 కోట్లు అందజేశారు.

ఐఐటీ-కాన్పూర్‌లోని స్కూల్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీకి ఇండిగో సహ వ్యవస్థాపకుడు రాకేష్‌ గాంగ్వాల్‌ రూ.100 కోట్ల విరాళం అందించారు.

మూడు నెలల క్రితమే ఐఐటీ-గాంధీనగర్‌కు 2,749 పూర్వ విద్యార్థుల్లో సగం మంది రూ.50 లక్షలను సేకరించి ఇచ్చారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని