Munugode Bypoll: కారు.. కమలం.. హస్తం.. ఎవరికో ‘ఉప’యోగం

రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉపఎన్నికలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. నెల రోజుల ఉత్కంఠకు ఆదివారంతో తెర పడనుంది.

Updated : 06 Nov 2022 06:43 IST

నేడు తేలనున్న మునుగోడు ఫలితం
మూడంచెల భద్రత నడుమ లెక్కింపు
విజయంపై ప్రధాన పార్టీల్లో ధీమా

ఈనాడు, నల్గొండ, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న మునుగోడు ఉపఎన్నికలో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. నెల రోజుల ఉత్కంఠకు ఆదివారంతో తెర పడనుంది. ఉప ఎన్నికలో విజయం సాధిస్తామని ప్రధాన పార్టీలన్నీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క నల్గొండ పట్టణం ఆర్జాలబావిలోని గిడ్డంగుల సంస్థ గోదాముల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

‘ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం మూడంచెల భద్రతను ఏర్పాటు చేశాం. ఓట్ల లెక్కింపు హాలులో కేంద్ర బలగాలు భద్రత నిర్వహిస్తాయి. మిగిలిన రెండంచెల్లో రాష్ట్ర పోలీసులుంటారు’ అని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. నియోజకవర్గంలో 80 సంవత్సరాలు దాటిన 686 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకున్నారన్నారు. ఎలక్ట్రానిక్‌ విధానంలో సర్వీసు ఓట్ల(ఆర్మీకి చెందినవారి)ను ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు అనుమతిస్తామని.. వాటినీ లెక్కిస్తామన్నారు. శనివారం నిర్వహించిన మాక్‌ కౌంటింగ్‌ విజయవంతమైందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు వినయ్‌కృష్ణారెడ్డి ‘ఈనాడు’తో చెప్పారు. లెక్కింపు కేంద్రం వద్ద 500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. మూడు కంపెనీల కేంద్ర బలగాలు కూడా భద్రతా విధుల్లో పాల్గొంటాయన్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమవనున్న లెక్కింపు ప్రక్రియలో తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌, సర్వీసు ఓట్లను లెక్కించిన అనంతరం 8.30 గంటలకు ఈవీఎంలలోని ఓట్లను గణిస్తారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపునకు రెండు టేబుళ్లు.. ఈవీఎంల లెక్కింపునకు మొత్తం 21 టేబుళ్లను ఏర్పాటు చేశారు. మొత్తం 15 రౌండ్లలో (14 పూర్తిగా, 15వ రౌండ్లో నాలుగు టేబుళ్లు) లెక్కించనున్నారు. అనంతరం డ్రా పద్ధతిన అయిదు పోలింగ్‌ బూత్‌లకు సంబంధించిన ఈవీఎంలలోని వీవీస్లిప్‌లను లెక్కించి సరిచూస్తారు. మధ్యాహ్నం 3 గంటలలోపు తుది ఫలితాలు వెల్లడవుతాయని అధికారులు వెల్లడించారు. రౌండ్ల వారీగా ఫలితాలను కౌంటింగ్‌ కేంద్రంలో ఏర్పాటు చేసిన స్క్రీన్‌లపై ప్రదర్శించనున్నారు.

ఎవరి లెక్కల్లో వారు..

పోలింగ్‌ అనంతరం గ్రామాలు, మండలాల వారీగా సమీక్షలు చేసిన అభ్యర్థులు, పార్టీ నాయకులు తమకే అవకాశముంటుందని నమ్ముతున్నారు. సర్వేల ఆధారంగా తెరాస విజయంపై ధీమాతో ఉంది. పోలింగ్‌ సరళిపై ఇప్పటికే బూత్‌ల వారీగా ఉన్న ఏజెంట్లతో వివరాలు తెప్పించుకొని అంశాలన్నింటినీ పార్టీ క్రోడీకరించింది. ఎంపీటీసీ పరిధిలో ఇన్‌ఛార్జులను నియమించడంతో ఆయా ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తదితర అంశాలను సమీక్షించింది. మరోవైపు మధ్యాహ్నం అనంతరం పెరిగిన పోలింగ్‌ శాతాన్ని బట్టి తమకు కచ్చితంగా అవకాశముంటుందని భాజపా ఆశాభావంతో ఉంది. చండూరు, చౌటుప్పల్‌ పురపాలికలతో పాటూ మండల కేంద్రాల్లో తమకు అనుకున్నదానికేంటూ ఎక్కువ ఓట్లు పడ్డాయని పార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు. మహిళలు, సైలెంట్‌ ఓటింగ్‌ తమకు విజయం చేకూరుస్తుందని కాంగ్రెస్‌ శ్రేణులు నమ్ముతున్నాయి. వివిధ వర్గాల్లో పార్టీ అభ్యర్థిపై ఉన్న సానుభూతి కలిసొస్తుందని పార్టీ నాయకులు నమ్ముతున్నారు. మరోవైపు బీఎస్పీ, రోడ్‌రోలర్‌ గుర్తుల అభ్యర్థులు సైతం తాము ప్రభావం చూపుతామని చెబుతున్నారు. అభ్యర్థులు విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

దేశవ్యాపంగా ఏడు చోట్ల..

రాష్ట్రంలోని మునుగోడుతో సహా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఆధమ్‌పుర్‌(హరియాణా), మొకామా, గోపాల్‌గంజ్‌(బిహార్‌), తూర్పు అంధేరి(మహారాష్ట్ర), గోలాగోకర్న్‌నాథ్‌(ఉత్తర్‌ప్రదేశ్‌), ధామ్‌నగర్‌(ఒడిశా)లలో ఎవరు గెలిచారో తేలనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని