సంక్షిప్త వార్తలు(10)

రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని 35 జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశానికి మే 6న పరీక్ష నిర్వహిస్తామని టీఎస్‌ఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి రమణకుమార్‌ సోమవారం తెలిపారు.

Updated : 21 Mar 2023 05:43 IST

మే 6న గురుకుల జూనియర్‌ ప్రవేశ పరీక్ష

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని 35 జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశానికి మే 6న పరీక్ష నిర్వహిస్తామని టీఎస్‌ఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి రమణకుమార్‌ సోమవారం తెలిపారు. పదో తరగతి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు ఈ నెల 31లోపు  www.tsrjdc.cgg.gov.in  వెబ్‌సైట్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


ఎన్టీఆర్‌ శతజయంతి రూ.100 నాణెం విడుదలపై నోటిఫికేషన్‌

ఈనాడు, దిల్లీ: విఖ్యాత సినీనటులు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా వంద రూపాయల నాణెం విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ఆర్థికశాఖ ఆ మేరకు సోమవారం అధికారికంగా గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. 44 మి.మీ. చుట్టుకొలతతో ఉండే ఈ నాణెంలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్‌, 5 శాతం జింక్‌ లోహాలు ఉంటాయని తెలిపింది. ఈ నాణేనికి ఒక వైపు మూడు సింహాలతో కూడిన అశోకచక్రం ఉంటుంది.


ముస్లిం ఉద్యోగులకు రంజాన్‌ వెసులుబాటు

గంట ముందే కార్యాలయాల నుంచి వెళ్లేందుకు అనుమతిస్తూ సర్కారు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులందరికీ సర్కారు వెసులుబాటు కల్పించింది. సాధారణ పనివేళల కంటే గంట ముందుగా కార్యాలయాలు, పాఠశాలల నుంచి వారు వెళ్లడానికి అనుమతించింది. ఈ నెల 23 నుంచి వచ్చే నెల 23 వరకూ ఈ వెసులుబాటు వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్యాలయాలు, బడుల్లో పనిచేసే రెగ్యులర్‌, ఒప్పంద, పొరుగు సేవలు, బోర్డులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని పేర్కొంటూ సీఎస్‌ ఎ.శాంతికుమారి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మినహాయింపుకాలంలో ఒకవేళ అత్యవసర సేవలు అందించాల్సి వస్తే హాజరు కావాలని పేర్కొన్నారు.


పోస్టుమార్టం నివేదికతోనే స్పష్టత

వైద్య విద్యార్థిని ప్రీతి మృతిపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: పోస్టుమార్టం నివేదిక వస్తేనే గత నెలలో వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసు విషయంలో స్పష్టత వస్తుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రంగనాథ్‌ పేర్కొన్నారు. సోమవారం వరంగల్‌ కమిషనరేట్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రీతి మరణంపై మూడు కోణాల్లో దర్యాప్తు చేపట్టామని, ఆధారాలు లభించలేదన్నారు. ‘‘ఆత్మహత్యకు ప్రేరేపించారనే కోణంలో విచారణ చేస్తున్నప్పటికీ స్పష్టత రావడం లేదు. ర్యాగింగ్‌ వల్ల మానసిక వేదనకు గురై మృతి చెందిందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాం. ఇది నిజమైతే నిందితుడికి పదేళ్ల వరకు శిక్ష పడే అవకాశముంది. పోస్టుమార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నాం. ప్రీతి మృతి విషయమై మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు నాతో మాట్లాడారు. ఈ కేసులో మరో ఇద్దరు ప్రమేయం ఉందన్న అనుమానాలున్నాయి. వివరాలు సేకరిస్తున్నాం.  కాకతీయ మెడికల్‌ కళాశాలలో జరిగే ర్యాగింగ్‌పై చర్యలు తీసుకుంటాం’’ అని పోలీస్‌ కమిషనర్‌ అన్నారు.


షూటింగ్‌లో పతకాలు సాధించిన వారికి డీజీపీ సన్మానం

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో జరిగిన వివిధ షూటింగ్‌ పోటీల్లో పతకాలు సాధించిన పోలీసు సిబ్బందిని డీజీపీ అంజనీకుమార్‌ సోమవారం తన కార్యాలయంలో సన్మానించారు. తమిళనాడులోని ఓతివక్కంలో గత జనవరి 9 నుంచి 13 వరకు జరిగిన 23వ అఖిల భారత పోలీసు డ్యూటీ మీట్‌లో జగిత్యాల జిల్లా సాయుధ విభాగానికి చెందిన రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ జి.సైదులు కాంస్య పతకం సాధించారు. గతేడాది డిసెంబరులో కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగిన 31 అఖిల భారత జీవీ మావలంకర్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లోనూ సైదులు వెండి పతకం సాధించగా వరంగల్‌ సుబేదారి పోలీస్‌స్టేషన్‌ మహిళా ఎస్సై వి.సువర్ణ కాంస్య పతకం సాధించారు. అదే నెలలో మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో నిర్వహించిన 65వ జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో తెలంగాణ ప్రత్యేక పోలీసు పటాలం 8వ బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ డి.నారాయణదాసు వెండి పతకం పొందారు. ఈ మేరకు వారందరినీ డీజీపీ సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీ (సంక్షేమం, క్రీడలు) అభిలాష బిస్త్‌, డీఎస్పీ (క్రీడలు) ఆర్వీ రామారావు, టీమ్‌ మేనేజర్‌ పీఎస్‌ఆర్‌ మూర్తి, డీజీపీ కార్యాలయం క్రీడల విభాగం ఎన్‌.రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.


2025 నాటికి క్షయ లేని తెలంగాణ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో 2025 నాటికి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం లక్ష్యంగా రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కార్యాచరణను రూపొందించింది. 2022లో చేపట్టిన కార్యక్రమంలో 90 శాతం లక్ష్యం సాధించినట్లు వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం కొనసాగుతోందని ప్రభుత్వ, ప్రైవేటు రంగం భాగస్వామ్యంతో కార్యాచరణ అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.  రాష్ట్రంలో 2020లో 63059 మంది క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించగా 55,892 మందికి విజయవంతంగా చికిత్స పూర్తయిందని, 2021లో 61,047కు గాను 55,133 మందికి, 2022 జనవరి నుంచి 34,941 మందిని గుర్తించగా 30,092 మందికి చికిత్స పూర్తయినట్లు పేర్కొన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ఉచిత యూడీఎస్‌టీ పరీక్షలతో పాటు  59,677 మందికి నిక్షయ పోషణ యోజన కింద నెలకు రూ.500 చొప్పున అందజేస్తున్నారు.


పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలి: యూఎస్‌పీసీ

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో ఎయిడెడ్‌ జీతాలు, పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌పీసీ) హెచ్చరించింది. ఈ నెల 24న జిల్లా ట్రెజరీ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని, అప్పటికీ బిల్లుల మంజూరులో పురోగతి లేకుంటే 28న హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయి మహాధర్నా చేపట్టాలని యూఎస్‌పీసీ స్టీరింగ్‌ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇచ్చామని కమిటీ సభ్యులు జంగయ్య, చావ రవి, అశోక్‌కుమార్‌, రవీందర్‌, సోమయ్య, లింగారెడ్డి, రోహిత్‌నాయక్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.


ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని వినతి

ఈనాడు, హైదరాబాద్‌: సమగ్ర శిక్ష అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ)లో గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న 20 వేల మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ రాష్ట్రంలోని ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు సోమవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, డీఈఓలకు వినతిపత్రాలు సమర్పించారు. తమకు రూ.5 లక్షల ఆరోగ్య బీమా, రూ.10 లక్షల జీవిత బీమా కల్పించాలని ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు డి.అనురాధ, ప్రధాన కార్యదర్శి పడాల రవీందర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సి.హెచ్‌.దీప్తి తదితరులు ప్రభుత్వాన్ని కోరారు.


బధిరులకు పింఛను ఇవ్వాలని ధర్నా

ఈనాడు, దిల్లీ: బధిరులకు ప్రభుత్వం నెలకు రూ.6 వేల చొప్పున పింఛను ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఫర్‌ డెఫ్‌ నేషనల్‌ కన్వీనర్‌ వల్లభనేని ప్రసాద్‌ ఆధ్వర్యంలో దిల్లీలోని జంతర్‌మంతర్‌లో సోమవారం ధర్నా నిర్వహించారు. అలాగే అన్ని ప్రజాప్రాతినిధ్య వ్యవస్థల్లో తమకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయినా సంక్షేమ పథకాల్లో వికలాంగులకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం అన్యాయమని వాపోయారు.


ఉగాది రోజున ‘సమతామూర్తి’ సందర్శనకు అనుమతి

శంషాబాద్‌, న్యూస్‌టుడే: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఉగాది సందర్భంగా బుధవారం తెరిచి ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు దర్శనానికి అనుమతిస్తామని సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని