భవిష్యత్తులో అత్యధికం సైబర్‌ నేరాలే

భవిష్యత్తులో అత్యధికం సైబర్‌ నేరాలే ఉంటాయని తెలంగాణ సీఐడీ అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ అన్నారు. ఇంటర్‌నెట్‌ వాడే వారంతా ఏదో ఒక సమయంలో సైబర్‌ నేరాల బాధితులు కావడానికి అవకాశాలున్నాయని చెప్పారు.

Published : 28 Mar 2023 04:25 IST

సీఐడీ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌

ఈనాడు, హైదరాబాద్‌: భవిష్యత్తులో అత్యధికం సైబర్‌ నేరాలే ఉంటాయని తెలంగాణ సీఐడీ అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ అన్నారు. ఇంటర్‌నెట్‌ వాడే వారంతా ఏదో ఒక సమయంలో సైబర్‌ నేరాల బాధితులు కావడానికి అవకాశాలున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 30 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జిల స్థాయి న్యాయాధికారులకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించేందుకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మూడు రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ.. సైబర్‌ నేరాలు జరుగుతున్న తీరు, అందులోని లోతుపాతులను దర్యాప్తు సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది, న్యాయాధికారులు తెలుసుకొని ఉండాలన్నారు. ‘‘అనేక మంది అమాయకులు సైబర్‌ నేరాల బారినపడుతున్నారు. ఆన్‌లైన్లో వచ్చే ప్రకటనలను చూసి అవయవాలూ అమ్ముకుంటున్నారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులు మోసపోతున్నారు. నేరగాళ్ల బారినపడి చివరకు వారు కూడా అదే బాట పడుతున్న సందర్భాలూ ఉన్నాయి. ఆన్‌లైన్‌ లావాదేవీల్లో సైబర్‌ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఆయా ఖాతాల పాస్‌వర్డ్‌లను ప్రతి మూడు నెలలకు ఒకసారి మార్చుకోవాలి’’ అని భగవత్‌ సూచించారు.  

ఈ నేరాలపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్రంలో నాలుగు ప్రత్యేక పోలీస్‌స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. సైబర్‌ నేరగాళ్లను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఐ4సి’ తరహాలో తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా ‘టి4సి’ ఏర్పాటు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐడీ మాజీ ఐజీ ఉమాపతి, సైబర్‌ లా నిపుణులు, సాంకేతిక సలహాదారు సాయిసుషాంత్‌ సముద్రాల, సైబర్‌ భద్రత నిపుణులు శ్రీనివాస్‌ భూసారపు, సైబర్‌ నేరాల నిపుణుడు, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ రవికుమార్‌రెడ్డి తదితరులు న్యాయాధికారులకు శిక్షణ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని