E-Epic Download: క్షణాల్లో ఓటరు గుర్తింపు కార్డు పొందొచ్చు!

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ-ఓటరు గుర్తింపు కార్డు(ఈ-ఎపిక్‌)ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. అందుకోసం వెబ్‌సైట్‌లో కీలక మార్పులు చేసింది.

Updated : 17 Oct 2023 08:12 IST

ప్రక్రియను సులభతరం చేసిన ఎన్నికల సంఘం

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ-ఓటరు గుర్తింపు కార్డు(ఈ-ఎపిక్‌)ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. అందుకోసం వెబ్‌సైట్‌లో కీలక మార్పులు చేసింది. ఈ విధానంలో మొబైల్‌ నంబరు నమోదుతో క్షణాల్లో ఈ-ఓటరు గుర్తింపు కార్డును పొందొచ్చని, ఓటుహక్కును వినియోగించేందుకు అది చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం రూపొందించిన ఫాం-8నే ఇందుకోసం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులో మొబైల్‌ నంబరు నమోదుకు ప్రత్యేక కాలమ్‌ అందుబాటులో ఉంది. దాన్ని క్లిక్‌ చేసి నమోదు చేసిన తరవాత దరఖాస్తును సబ్‌మిట్‌ చేయాలి. ఆ తరవాత https://voters.eci.gov.in లో e-epic విభాగంలోకి వెళ్లి నిర్ధారిత ప్రాంతంలో ఓటరు గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేయాలి. వెంటనే ఏ మొబైల్‌ నంబరు నమోదుచేశామో, ఆ ఫోన్‌ను ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదుచేయగానే ఈ-ఓటరు గుర్తింపు కార్డు డౌన్‌లోడ్‌ అవుతుంది. ‘ఆ పత్రం అన్ని ధ్రువపత్రాల మాదిరిగా చెల్లుబాటు అవుతుంది. ఎన్నికల సంఘం పంపే ఓటరు గుర్తింపు కార్డు కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ఈ సదుపాయం గతంలోనూ ఉన్నప్పటికీ, అది ఆమోదం పొందేందుకు అధిక సమయం పట్టేది. నమోదిత వివరాలు సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల అధికారి ఆమోదించిన తరవాత ఆ ప్రక్రియ పూర్తయ్యేది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను సరళతరం చేసింది’ అని ఓ అధికారి ‘ఈనాడు’తో చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని