రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం

హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది.

Updated : 04 May 2024 09:43 IST

కేసు పునర్విచారణకు కోర్టులో పిటిషన్‌ వేయనున్న పోలీసుశాఖ
పోలీసుల నివేదిక అనంతరం రోహిత్‌ తల్లి, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసులో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. దర్యాప్తును కొనసాగించాలని పోలీసుశాఖ నిర్ణయించింది. ఈ వ్యవహారంలో వర్సిటీ వీసీతోపాటు పలువురు నేతలపై దాఖలైన కేసులో ఆధారాల్లేవంటూ తాజాగా హైకోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. ఆ నివేదికపై రోహిత్‌ తల్లి అనుమానాలు వ్యక్తం చేయడం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో పోలీసుశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

వేముల రోహిత్‌ 2016లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, హెచ్‌సీయూ విద్యార్థులు అప్పట్లో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. దేశవ్యాప్తంగా అనేక రాజకీయపార్టీలు స్పందించాయి. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండుసార్లు హైదరాబాద్‌కు వచ్చి వెళ్లారు. ఆత్మహత్యపై అప్పట్లో సైబరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేసి 2023 నవంబరులో తుది నివేదిక రూపొందించారు. ఈ ఏడాది మార్చి 21న దర్యాప్తు అధికారి ఆ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. ఈ అంశంపై తాజాగా మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో ఈ కేసును పునర్విచారించాలని డీజీపీ రవిగుప్తా శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని పోలీసులు అభ్యర్థించనున్నారు. రోహిత్‌ ఆత్మహత్య కేసు విచారణ కొనసాగుతుందని డీజీపీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని