నిబంధనలు ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలపై చర్యలు

తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్‌ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు.

Updated : 04 May 2024 05:24 IST

రూ.లక్ష చొప్పున జరిమానా

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో నిబంధనలను ఉల్లంఘించిన 27 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించింది. ఇంటర్‌ విద్యామండలి ఆదేశాలను విస్మరించి వేసవి సెలవుల్లో కళాశాలలను నిర్వహించడం, ప్రవేశాలు కల్పించినందుకుగాను ఒక్కో కళాశాలపై రూ.లక్ష చొప్పున జరిమానా విధించినట్లు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. శుక్రవారం ఉన్నతవిద్యామండలి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..‘‘సెలవుల్లో తరగతులు నిర్వహించొద్దని, ప్రవేశాలు కల్పించొద్దని ఆదేశాలు ఇచ్చాం. వీటిని ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు జరిపించాం. ఇందులో 27 కార్పొరేట్‌ కళాశాలలు ఆదేశాలను ధిక్కరించినట్లు తేలింది. నిబంధనల మేరకు వారికి జరిమానా విధించాం. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అక్రమాలకు చోటు లేకుండా ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో ఆన్‌లైన్‌ అడ్మిషన్లు చేపడతామని ఆయన తెలిపారు. ఇంటర్‌ ర్యాంకులపై తప్పుడు ప్రచారం చేసుకునే కళాశాలలపై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.

ఎన్నికల అనంతరం వీసీల నియామకం

తెలంగాణ విశ్వవిద్యాలయాల్లోని వీసీల పదవీకాలం ఈ నెల 21తో ముగుస్తుందని, ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం కొత్త వీసీల నియామకం జరుగుతుందని వెంకటేశం తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఉమ్మడి నియామక మండలి దస్త్రం రాష్ట్రపతి కార్యాలయంలో ఉందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని