ఆరు రోజులుగా నక్కి.. ఎరకు చిక్కి

శంషాబాద్‌ విమానాశ్రయ రన్‌వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది.

Published : 04 May 2024 05:26 IST

శంషాబాద్‌ విమానాశ్రయ రన్‌వే మైదానంలోకి గత నెల 27న చొరబడి అందరినీ కంగారుకు గురి చేసిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. దానిని బంధించడానికి అటవీశాఖ అధికారులు అయిదు బోనులు, 20 ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. పలుమార్లు బోను వద్దకు వచ్చిందే తప్ప అందులోకి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ట్రాంక్విలైజర్‌(మత్తుమందు) సాయంతో అదుపులోకి తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. అంతలోనే గురువారం రాత్రి ఓ బోనులో ఎరగా ఉంచిన మేకను వేటాడేందుకు వచ్చి చిక్కుకుంది. దీంతో శుక్రవారం ఉదయం అటవీశాఖ జిల్లా అధికారి విజయానంద్‌రావు పర్యవేక్షణలో చిరుతను హైదరాబాద్‌లోని జూపార్క్‌కు తరలించారు. ఆరు రోజులుగా చిరుత ఎక్కడ నక్కిందో తెలియక ఆందోళనకు గురైన విమానాశ్రయ అధికారులు, శివారు గ్రామస్థులు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. రన్‌వే ప్రహరీ దూకిన క్రమంలో చిరుతకు ఫెన్సింగ్‌, సోలార్‌ విద్యుత్తు తీగలు తగిలి స్వల్ప గాయాలయ్యాయి. నెహ్రూ జంతు ప్రదర్శనశాల వైద్యులు అత్యవసర వైద్యం అందించారు. కోలుకున్న అనంతరం అమ్రాబాద్‌ లేదా నల్లమల అడవుల్లో వదిలేయనున్నారు.

న్యూస్‌టుడే, శంషాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని