40 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) ఛైర్మన్‌ శివశంకర్‌ను రాష్ట్ర గెజిటెడ్‌ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది.

Published : 04 May 2024 05:21 IST

పీఆర్సీ ఛైర్మన్‌కు టీజీవోల ప్రతిపాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.32 వేలు, గరిష్ఠంగా రూ.2,95,460 ఉండాలని వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) ఛైర్మన్‌ శివశంకర్‌ను రాష్ట్ర గెజిటెడ్‌ అధికారుల (టీజీవోల) సంఘం కోరింది. 40% ఫిట్‌మెంట్‌తో కొత్త పీఆర్‌సీ ఇవ్వాలని, వార్షిక గ్రేడ్‌ ఇంక్రిమెంట్‌ను 2.6 నుంచి 3 శాతానికి పెంచాలని అభ్యర్థించింది. టీజీవోల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణ; ఇతర నేతలు జగన్మోహన్‌రావు, రవీందర్‌రావు, శ్యామ్‌, ఉపేందర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, అరుణ్‌కుమార్‌, దీపారెడ్డి, రామకృష్ణ, యాదగిరి, సురేశ్‌, పరుశురాం తదితరులు శివశంకర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి పీఆర్‌సీపై తమ ప్రతిపాదనలు సమర్పించారు. మారుతున్న జీవనశైలి, వ్యయ, ప్రమాణాలకు అనుగుణంగా జీతభత్యాలను నిర్ణయించాలన్నారు. కనీస వేతనం, డీఏ, ఫిట్‌మెంట్‌ను కలిపి పేస్కేల్‌ను నిర్ణయించాలని, స్టాగ్నేషన్‌ ఇంక్రిమెంట్లు 7 మంజూరు చేయాలని, ఇంటిఅద్దె భత్యాన్ని పెంచాలని, ఉద్యోగులకు ఎలాంటి ఖర్చు పరిమితి లేకుండా వైద్యసేవలందించాలని, కనీస పెన్షన్‌ రూ.16 వేలకు పెంచాలని.. తదితర ప్రతిపాదనలను సమర్పించారు.

‘కనీస వేతనం రూ.35 వేలు చేయాలి’

బషీర్‌బాగ్‌, న్యూస్‌టుడే: వేతన సవరణలో నాలుగో తరగతి ఉద్యోగులకు కనీస వేతనం రూ.35 వేలు ఉండేటట్లు చూడాలని పీఆర్సీ ఛైర్మన్‌ శివశంకర్‌కు తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం విజ్ఞప్తి చేసింది. 51 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించాలని కోరింది. తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు గంగాధర్‌ తదితరుల నేతృత్వంలోని ప్రతినిధి బృందం పీఆర్సీ ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ తమ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని