హెచ్‌సీయూ వీసీ, నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవు

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు.

Published : 04 May 2024 05:20 IST

రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసులో హైకోర్టుకు పోలీసుల నివేదిక
ఆయన ఎస్సీ కాదంటూ అందులో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ వర్సిటీ వీసీతోపాటు పలువురు భాజపా నేతలపై నమోదైన కేసులో ఆధారాల్లేవంటూ ఆ నివేదిక తేల్చిచెప్పింది. 2016లో రోహిత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న కారణంగా వీసీ పొదిలి అప్పారావు, భాజపా నేతలు బండారు దత్తాత్రేయ, ఎన్‌.రామచంద్రరావు, ఎన్‌.దివాకర్‌, ఎన్‌.సుశీల్‌కుమార్‌, వై.కృష్ణచైతన్య తదితరులపై నమోదైన అభియోగం రుజువు కాలేదని నివేదికలో తెలిపారు. రోహిత్‌ ఎస్సీ కాదని అందులో పేర్కొన్నారు. తమపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ పొదిలి అప్పారావు, ఎన్‌.రామచంద్రరావు, దివాకర్‌, సుశీల్‌కుమార్‌, కృష్ణచైతన్య తదితరులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఇ.వి.వేణుగోపాల్‌ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పోలీసుల దర్యాప్తులో తమపై ఎలాంటి కేసు లేదని రుజువైనందున ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరారు. దీనిపై ఫిర్యాదుదారు తరఫు సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. రోహిత్‌ ఆత్మహత్య కేసును దర్యాప్తు చేయాల్సిన పోలీసులు ఆయన కులం గురించి దర్యాప్తు చేసి ఎస్సీ కాదని తేల్చారన్నారు. ఎస్సీ కాదని ధ్రువీకరించాల్సింది కలెక్టర్‌ అని, కలెక్టర్‌ ఉత్తర్వులు ఇవ్వకుండా జిల్లా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రోహిత్‌ ఎస్సీ కాదన్న నిర్ణయానికి వచ్చేశారన్నారు. రోహిత్‌ ఆర్థిక, కుటుంబ పరిస్థితుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారన్నారు. వాస్తవానికి వసతి గృహంలో వేధింపులు, ఫెలోషిప్‌ ఇవ్వకపోవడం, అవమానించడం తదితర కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. పోలీసుల నివేదికపై అభ్యంతరాలున్నాయని, కేసును కొట్టివేయరాదని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లపై కేసు లేదని పోలీసులు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడంలేదన్నారు. నివేదికపై అభ్యంతరాలుంటే కింది కోర్టులో చెప్పవచ్చని, లేదంటే చట్టప్రకారం సవాల్‌ చేసుకోవచ్చని తెలిపారు. పోలీసుల నివేదిక నేపథ్యంలో భాజపా నేతల పిటిషన్లపై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.


విద్యార్థుల నిరసన

గచ్చిబౌలి న్యూస్‌టుడే: రోహిత్‌ మరణంపై  పోలీసులు సమర్పించిన నివేదికను నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం పలు విద్యార్థి సంఘాలు హెచ్‌సీయూ ప్రాంగణంలో ఆందోళనకు దిగాయి. స్టూడెంట్స్‌ యూనియన్‌, ఏఐఓబీసీఏ, ఏఐఎస్‌ఏ, ఏఎస్‌ఏ, బీఎస్‌ఎఫ్‌, డీఎస్‌యూ, ఎంఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, టీఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. మెయిన్‌ గేట్‌ బయట బైఠాయించి పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు అతిక్‌ మాట్లాడుతూ.. రోహిత్‌ది ‘ఇన్‌స్టిట్యూషనల్‌ మర్డర్‌’ అని, అతని ఆత్మహత్యకు కారణమైన వారిని తప్పించే విధంగా పోలీసులు నివేదిక సమర్పించడం శోచనీయమన్నారు. ఏఎస్‌ఏ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ.. దళిత విద్యార్థి మృతికి కారణమైన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రోహిత్‌ మృతికి కారకులను శిక్షించేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. అన్ని సంఘాలతో చర్చించి పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని