సులభతర వాణిజ్య విధానంలో మరిన్ని సంస్కరణలు

సులభతర వాణిజ్య విధానం(ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు.

Published : 04 May 2024 05:24 IST

జులై నెలాఖరులోగా పూర్తి చేయాలి
సీఎస్‌ శాంతికుమారి ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: సులభతర వాణిజ్య విధానం(ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌-ఈఓడీబీ)లో అత్యుత్తమ సేవలు కొనసాగించాలని, ఇందుకోసం మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి ఆదేశించారు. ఈఓడీబీ ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం గతంలో సాధించిన విజయాలను పునరావృతం చేయాలని, ఈ ఏడాది కూడా అత్యున్నత హోదాను నిలుపుకొనేందుకు కృషి చేయాలని సీఎస్‌ అధికారులను కోరారు. ఈఓడీబీ పరిధిలోని వివిధ శాఖలు చేపట్టిన పలు సంస్కరణలపై ఉన్నతాధికారులతో శుక్రవారం సచివాలయంలో సీఎస్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. జులై నెలాఖరులోగా అన్ని సంస్కరణలను పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. సంస్కరణల అమలుకు చేపట్టాల్సిన చట్టపరమైన సవరణల కోసం అవసరమైన సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు. సమావేశంలో పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఈ ఏడాది చేపట్టాల్సిన సంస్కరణల గురించి శాఖలకు అవగాహన కల్పించారు. ‘‘ఈ సంవత్సరం మొత్తం 287 సంస్కరణలు చేపట్టాల్సి ఉండగా, వాటిలో 39 కొత్తగా చేర్చినవి ఉన్నాయి. ఇప్పటి వరకు 60 సవరించగా.. మిగిలిన 188పై చర్యలు చేపట్టాల్సి ఉంది. సర్వీస్‌ డెలివరీ మెకానిజంను మరింత మెరుగుపరచడానికి వినియోగదారుల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్‌బ్యాక్‌ను పొందాలి’’ అని శాంతికుమారి చెప్పారు. సమీక్షలో ఆయా శాఖల అధికారులు జయేశ్‌ రంజన్‌, రాణి కుముదిని, వాణి ప్రసాద్‌, నవీన్‌ మిత్తల్‌, జితేందర్‌, దానకిశోర్‌, డీజీ నాగిరెడ్డి, సందీప్‌కుమార్‌ సుల్తానియా, బుద్ధప్రకాశ్‌ జ్యోతి, సుదర్శన్‌రెడ్డి, దివ్య, అనితా రామచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని