వామనరావు దంపతుల హత్య కేసు.. సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Updated : 04 May 2024 05:37 IST

సుప్రీంకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు, దిల్లీ: తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని హైవేలో 2021 ఫిబ్రవరి 17న జరిగిన న్యాయవాదులు గట్టు వామనరావు దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐ లేదా సీఐడీకి అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ హత్యకేసులో నిందితులు తనను బెదిరిస్తున్నందున వేగంగా విచారణ జరిపి దోషులను శిక్షించేందుకు వీలుగా దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ వామనరావు తండ్రి గట్టు కిషన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టిలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తమకు కేసును సీబీఐకి కానీ, సీఐడీకి కానీ అప్పగించడానికి అభ్యంతరం లేదని, దానిపై న్యాయస్థానమే నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనానికి తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ సుందరేష్‌ స్పందిస్తూ.. ఈకేసులో నిందితుల తరఫున ఎవరైనా హాజరయ్యారా? అని ప్రశ్నించారు. లేదని న్యాయవాదులు చెప్పడంతో.. వారి వాదనలు కూడా విన్న అనంతరం దీనిపై నిర్ణయం వెలువరిస్తామని చెప్పారు. అందువల్ల ఈకేసులో వారిని కూడా పార్టీ చేయాలని పిటిషనర్‌కు సూచిస్తూ నోటీసులు జారీ చేశారు. ఇందుకు ఆరు వారాల్లోపు స్పందించాలని నిందితులను ఆదేశించారు. నిందితులు ప్రస్తుతం జైల్లో ఉన్నారా? అని న్యాయమూర్తులు అడగ్గా.. అందరూ బెయిల్‌పై బయటే ఉన్నట్లు న్యాయవాది మేనకాగురుస్వామి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. నిందితులు చనిపోయిన వ్యక్తి తండ్రిని బెదిరిస్తున్నారని, అందుకే దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కేసు దాఖలు చేసినట్లు ఆమె న్యాయమూర్తులకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని