Revanth Reddy: నలుమూలలకూ మెట్రో

హైదరాబాద్‌ మహానగర పరిధిలో ఎక్కువ ప్రాంతాలకు ఉపయోగపడేలా అత్యధిక సంఖ్యలో ప్రయాణికులకు సేవలందించేలా మెట్రోరైలు మార్గాలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెట్రోరైలు ఎండీని ఆదేశించారు.

Updated : 03 Jan 2024 09:00 IST

తక్కువ వ్యయంతో హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతాలన్నింటికీ విస్తరణ
గత ప్రభుత్వం ప్రతిపాదించిన ‘రాయదుర్గం-విమానాశ్రయ’ మార్గ నిర్మాణం నిలిపివేత
సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి  
కొత్త ప్రతిపాదనలకు ఆమోదం
డీపీఆర్‌, ట్రాఫిక్‌ అధ్యయనాలకు ఆదేశాలు
ఈనాడు - హైదరాబాద్‌

హైదరాబాద్‌ మహానగర పరిధిలో ఎక్కువ ప్రాంతాలకు ఉపయోగపడేలా అత్యధిక సంఖ్యలో ప్రయాణికులకు సేవలందించేలా మెట్రోరైలు మార్గాలను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మెట్రోరైలు ఎండీని ఆదేశించారు. కొత్త ఎలైన్‌మెంట్‌ వల్ల తక్కువ దూరంతో అత్యధిక ప్రయాణ ప్రయోజనం జరిగేలా.. నిర్మాణ వ్యయం తక్కువయ్యేలా చూడాలన్నారు. ప్రస్తుత మెట్రో కారిడార్లకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు మెట్రోరైలు విస్తరణ చేపట్టి నగరం నలుదిశలా అభివృద్ధి జరిగేలా చూడాలన్నారు. గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం-విమానాశ్రయ మార్గ నిర్మాణాన్ని నిలిపివేయాలన్నారు. ఈ మార్గానికి బదులుగా విమానాశ్రయ మెట్రోను ఎంజీబీఎస్‌ వయా ఓల్డ్‌ సిటీ తోపాటు ఎల్బీనగర్‌ నుంచి కూడా కనెక్ట్‌ చేయాలన్నారు. హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ కమిషనర్‌తో సమన్వయం చేసుకుంటూ కొత్త ప్రతిపాదనలు తయారుచేయాలన్నారు. మెట్రో రెండో దశ కొత్త ప్రతిపాదనలపై డీపీఆర్‌, ట్రాఫిక్‌ అధ్యయనం త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారు. మత, చారిత్రక కట్టడాలపై ఎలాంటి ప్రభావం పడకుండా కొత్త లైన్ల నిర్మాణం కోసం రోడ్ల విస్తరణ జరగాలన్నారు. కొత్తగా ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌, మియాపూర్‌-పటాన్‌చెరు, రాయదుర్గం- ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, ఎంజీబీఎస్‌- విమానాశ్రయ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌ మెట్రోరైలు రెండో, మూడోదశ విస్తరణపై సీఎం మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ఇచ్చిన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ను పరిశీలించారు.

రోడ్ల విస్తరణపై ఆదేశాలు

మైట్రోరైలు నిర్మాణం కోసం దారుల్‌ షిఫా కూడలి  నుంచి షాలిబండ వరకు రోడ్డును విస్తరించాలన్న హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ప్రతిపాదనలపై పాతబస్తీ ప్రజాప్రతినిధులతో సంప్రదించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దీనివల్ల పాతనగరం ఇతర ప్రాంతాలతో సమానంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. మెట్రోరైలు నిర్మాణ ప్రణాళికలో భాగంగా పాతనగరంలో వారసత్వ, మతపరమైన నిర్మాణాలు 103 ఉన్నాయని తేలిందని.. వీటికి నష్టం జరుగకుండా చూడాలన్నారు. ఈ ప్రక్రియలో అవసరమైతే తానే స్వయంగా క్షేత్రస్థాయిలో పాల్గొంటానని.. పాతనగర ప్రజాప్రతినిధుల సహకారం తీసుకుంటానని చెప్పారు.

ఆ ప్రతిపాదన రద్దు

గత ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు రూ.6,250 కోట్లతో చేపట్టాలనుకున్న 31 కిలోమీటర్ల మార్గ నిర్మాణాన్ని ప్రస్తుతానికి నిలిపివేయాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. ఈ మార్గంలో ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా అవుటర్‌ రింగ్‌ రోడ్డు ఉందన్నారు. ఈ మార్గానికి బదులుగా విమానాశ్రయ మెట్రోను ఎంజీబీఎస్‌ వయా ఓల్డ్‌ సిటీ తోపాటు ఎల్బీనగర్‌ నుంచీ కనెక్ట్‌ చేయాలన్నారు. నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు గల 5 కిలోమీటర్ల మేర దూరాన్ని కూడా కలుపుతూ ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు.  విమానాశ్రయ మెట్రోకు సంబంధించి మార్చిన ఎలైన్‌మెంట్‌ ప్రకారం వయా ఓల్డ్‌ సిటీ, ఎల్బీనగర్‌కు సంబంధించిన ట్రాఫిక్‌ అధ్యయనం చేయడంతోపాటు డీపీఆర్‌ త్వరగా సిద్ధం చేయాలన్నారు. లక్ష్మిగూడ-జల్‌పల్లి -మామిడిపల్లి మార్గంలో నిర్మాణం జరపాలని.. ఎటువంటి ఆటంకాలు లేకుండా రోడ్డు మధ్యలో నిర్మాణంతో వ్యయం తగ్గుతుందని తెలిపారు. రవాణా ఆధారిత అభివృద్ధి (ట్రాన్సిట్‌ ఓరియెంటెడ్‌ డెవలప్‌మెంట్‌) కోసం నిర్మాణమార్గం వెంట అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని చెప్పారు.

నగరాభివృద్ధికి బృహత్‌ ప్రణాళిక

వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ నగర అవసరాలను తీర్చడానికి సమగ్ర మాస్టర్‌ ప్లాన్‌(బృహత్‌ ప్రణాళిక) సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. ఓఆర్‌ఆర్‌ చుట్టూ  ప్రాంతాలను గ్రోత్‌హబ్‌గా మార్చడానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. శ్రీశైలం హైవేపై ఎయిర్‌పోర్టు ప్రాంతం నుంచి కందుకూరు వరకు మెట్రోరైలు అనుసంధానం జరగాలని చెప్పారు.  ఫార్మాసిటీ కోసం ఈ ప్రాంతంలో భూములను సేకరించినందున మెట్రో విస్తరణ అవసరమని పేర్కొన్నారు. జేబీఎస్‌ మెట్రో స్టేషన్‌ నుంచి శామీర్‌పేట వరకు, కండ్లకోయ/మేడ్చల్‌ వరకు మెట్రోరైలు మూడో దశ విస్తరణ జరగాలని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌, సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రి, కార్యదర్శి షానవాజ్‌ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.


వీటికి ఆమోదం

  • మియాపూర్‌-చందానగర్‌-బీహెచ్‌ఈఎల్‌-పటాన్‌చెరు (14 కిలోమీటర్లు)
  • ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా-చాంద్రాయణగుట్ట-మైలార్‌దేవ్‌పల్లి-పీ7 రోడ్డు -ఎయిర్‌పోర్టు (23 కిలోమీటర్లు)
  • నాగోల్‌-ఎల్బీనగర్‌-ఒవైసీ ఆసుపత్రి-చాంద్రాయణగుట్ట-మైలార్‌దేవ్‌పల్లి-ఆరాంఘర్‌-హైకోర్టు నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతం (రాజేంద్రనగర్‌) (19 కిలోమీటర్లు)
  • రిడార్‌ 3లో భాగంగా రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వరకు (వయా బయోడైవర్సిటీ జంక్షన్‌, ట్రిపుల్‌ఐటీ జంక్షన్‌, ఐఎస్‌బీ రోడ్డు) (12 కిలోమీటర్లు)
  • ఎల్బీనగర్‌-వనస్థలిపురం-హయత్‌నగర్‌   (8 కిలోమీటర్లు) ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు.
  • వీటితోపాటు 40 కిలోమేటర్ల మేర మూసీ రివర్‌ ఫ్రంట్‌ ఈస్ట్‌-వెస్ట్‌ కారిడార్‌ను మెట్రో రైలు ప్రాజెక్టులో చేర్చాలని, తారామతి నుంచి నార్సింగి వయా నాగోల్‌, ఎంజీబీఎస్‌ చేపట్టాలని సూచించారు. వీటన్నింటికీ సంబంధించిన ప్రణాళికలు త్వరగా సిద్ధంచేసి కేంద్ర నగరాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ మంత్రికి ముసాయిదాను పంపించాలని సీఎం ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని