Hyderabad Metro: పాతబస్తీ మెట్రోకు 8న శంకుస్థాపన

హైదరాబాద్‌ పాతబస్తీకి ఎట్టకేలకు మెట్రోరైలు సౌకర్యం కలగనుంది. ఈ ప్రాంతంలో మెట్రోలైను నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 8న శంకుస్థాపన చేయనున్నారు.

Updated : 05 Mar 2024 07:36 IST

రూ.2 వేల కోట్ల అంచనా వ్యయం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు

ఈనాడు - సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి: హైదరాబాద్‌ పాతబస్తీకి ఎట్టకేలకు మెట్రోరైలు సౌకర్యం కలగనుంది. ఈ ప్రాంతంలో మెట్రోలైను నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 8న శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల పొడవునా ఈ రైలుమార్గాన్ని నిర్మిస్తారు. దీనికి రూ.2,000 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్‌ నుంచి జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ మీదుగా పాతబస్తీకి ప్రయాణం చేయొచ్చు. పనులను వేగంగా పూర్తిచేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఎల్బీనగర్‌-మియాపూర్‌, నాగోలు-రాయదుర్గం, జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ల మధ్య 69.2 కి.మీ. మేర కొన్నేళ్లుగా మెట్రోరైళ్లు నడుస్తున్నాయి. మొదటి దశ ప్రాజెక్టును ఎల్‌ అండ్‌ టీ మెట్రోరైలు సంస్థ దాదాపు రూ.16 వేల కోట్లతో చేపట్టింది. అప్పట్లోనే పాతబస్తీకి మెట్రో సౌకర్యం కల్పించడానికీ ప్రయత్నాలు జరిగాయి. సర్వే కూడా చేశారు. ఈ లైను నిర్మాణంతో వేలాది ప్రైవేటు ఆస్తులను సేకరించడంతో పాటు కొన్ని చారిత్రక కట్టడాలను తొలగించాల్సి వస్తుందని అప్పట్లో భావించారు. దీనిపై పాతబస్తీలోని కొన్ని పార్టీలతో పాటు స్థానికుల నుంచీ నిరసన వ్యక్తం కావడంతో ప్రాజెక్టును చేపట్టకుండా నిలిపివేశారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత మెట్రో విస్తరణ, మూసీ సుందరీకరణపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా పాతబస్తీకి మెట్రోరైలు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్‌ మెట్రోరైలు అధికారులు రూపొందించిన ప్రణాళికను సీఎం ఆమోదించారు.

కొత్త లైను ఇలా..

కొత్త లైను ఎంజీబీఎస్‌ నుంచి దారుషిఫా, పురానీ హవేలీ, ఏత్‌బార్‌ చౌక్‌, అలిజాకోట్ల, మీర్‌మొమిన్‌ దాయరా, హరిబౌలి, శాలిబండ, షంషీర్‌గంజ్‌, అలియాబాద్‌ మీదుగా ఫలక్‌నుమా వరకు ఏర్పాటు కానుంది. 5.5 కి.మీ. మేర మార్గంలో 4 స్టేషన్లను (సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, ఫలక్‌నుమా) ఏర్పాటు చేయనున్నారు. ఇవి చారిత్రక కట్టడాలకు 500 మీటర్ల దూరంలో ఉంటాయి. మెట్రోతో దాదాపు 1,100 కట్టడాలను తొలగించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో 100 అడుగులు, స్టేషన్లు ఉన్న ప్రాంతంలో 120 అడుగుల మేర రోడ్డును విస్తరించాల్సి ఉంటుంది. రోడ్డు విస్తరణతో కలిపి ప్రాజెక్టుకు రూ.2,000 కోట్ల వ్యయమవుతుందని అధికారులు ప్రకటించారు. రైల్వేలైను నిర్మాణంలో ప్రార్థనాలయాలు, చారిత్రక కట్టడాలకు ఇబ్బంది కలగకుండా ఇంజినీరింగ్‌ ప్రణాళికలో తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి అనుగుణంగానే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎంజీబీఎస్‌-ఫలక్‌నుమా లైను నిర్మాణ ప్రాజెక్టును హైదరాబాద్‌ ఎల్‌ అండ్‌ టీ మెట్రోకే ఇస్తారా.. టెండర్లను పిలిచి మరో నిర్మాణసంస్థకు అప్పగిస్తారా అన్నది ఇంకా తేలలేదు. ముందుగా రూ.500 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తే భూసేకరణ పనులు చేపట్టే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట వరకు మరో 1.5 కి.మీ. పొడవునా మెట్రోరైలు నిర్మాణ పనులను విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మూడో దశలో నాగోలు-ఎల్బీనగర్‌-చాంద్రాయణగుట్ట-మైలార్‌దేవ్‌పల్లి-పీ7 రోడ్డు మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయానికి మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు. దీనికి చాంద్రాయణగుట్ట వద్ద నిర్మించే స్టేషన్‌ జంక్షన్‌ ఇంటర్‌ ఛేంజ్‌గా ఉంటుందని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని