భారాస పాలనలో రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ మాఫియా

రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజా మద్దతు ధరకు కొనుగోలు చేయడమనేది తమ ప్రభుత్వ గ్యారంటీ అని పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

Published : 16 Apr 2024 05:49 IST

ఇప్పుడు ఉక్కుపాదంతో అణచివేస్తున్నాం
రైతుల నుంచి ప్రతి గింజా మద్దతు ధరకు కొంటామనేది మా ప్రభుత్వ గ్యారంటీ
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: రైతుల నుంచి ప్రతి ధాన్యపు గింజా మద్దతు ధరకు కొనుగోలు చేయడమనేది తమ ప్రభుత్వ గ్యారంటీ అని పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. భారాస ప్రభుత్వ పాలనలో ప్రతి జిల్లాలో రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ మాఫియా తయారైందని, దానిని ఇప్పుడు ఉక్కుపాదంతో అణచివేస్తున్నామని ఆయన వెల్లడించారు. నాటి సర్కార్‌ పౌరసరఫరాల శాఖను అస్తవ్యస్తం చేసి రూ.58 వేల కోట్ల అప్పులు పెడితే ఇప్పుడు ఆ బాకీలను రూ.5 వేల కోట్లకు తగ్గించామన్నారు. ధాన్యం కొనుగోలు, ఈ శాఖ కార్యకలాపాలపై సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. రూ.22 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని భారాస ప్రభుత్వం రైస్‌ మిల్లర్ల దగ్గర వదిలేసిందని.. నిల్వ చేయడానికి రైస్‌ మిల్లర్లు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని ఆయన చెప్పారు.

తరుగు పేరుతో రైతులకు అన్యాయం చేస్తే కఠిన చర్యలు

తరుగు పేరుతో ధాన్యాన్ని అక్రమంగా తీసుకుంటూ ఎవరైనా రైతులకు అన్యాయం చేస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్‌ స్పష్టం చేశారు. ‘‘గోదాముల నిల్వ సామర్థ్యాన్ని పెద్ద ఎత్తున పెంచబోతున్నాం. కొన్నేళ్లుగా టార్పాలిన్లు, తూకం యంత్రాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండా ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. ఈసారి అవన్నీ కల్పించి అధిక కేంద్రాలు తెరిచాం. రాష్ట్రం ఏర్పడిన తరవాత గతంలో ఎప్పుడూ ఏప్రిల్‌ ఒకటి తరవాతే కేంద్రాలు తెరిచేవారు. ఈసారి కేంద్రం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని మార్చి 23నే ప్రారంభించాం. ధాన్యం కొనుగోలుపై భారాస, భాజపా నేతలు చేస్తున్న ఆరోపణలలో వాస్తవాలు లేవు.

6,919 కేంద్రాలు ప్రారంభించాం

ఇప్పటికే 6,919 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. ఈ సమయానికి గత ఏడాది 335 కేంద్రాలనే తెరిచారు.  ఆదివారం వరకు మొత్తం 2,69,699 టన్నుల ధాన్యం కొన్నాం. సిద్దిపేటజిల్లాలో గత ఏడాది ఈ సమయానికి ఒక్క కేంద్రం కూడా ప్రారంభించలేదు. ఈసారి ఇప్పటికే 418 ఏర్పాటు చేశాం. బ్యాంకులు సకాలంలో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించేందుకు చర్యలు తీసుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లోనే ఐదు హామీలను అమలు చేయలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం  అమలుచేసింది. కోడ్‌ ముగిసిన తరవాత మిగిలినవీ నెరవేరుస్తాం. ధాన్యాన్ని తక్కువ ధరకు వేలంలో అమ్ముతున్నామని భారాస నేతలు చేసిన ఆరోపణలో నిజం లేదు. గత ప్రభుత్వం కొన్న ధాన్యాన్ని నాడు క్వింటా రూ.1,702కు అమ్మితే అదే ధాన్యంలో మిగిలిన నిల్వలకు ఈ ప్రభుత్వంలో వచ్చిన సగటు క్వింటా ధర రూ.2,222. సన్న ధాన్యాన్నీ భారాస ప్రభుత్వం అదే ధరకు విక్రయిస్తే మేం రూ.2,400కి అమ్మాం. గత ప్రభుత్వంలో సన్న, దొడ్డు తేడా లేకుండా వేలం వేయడంతో ఈ శాఖకు భారీ నష్టం వచ్చింది. ఈ ఏడాది బియ్యం అమ్మకాలపై రూ.1,100 కోట్ల అదనపు ఆదాయం సాధించాం. ప్రస్తుత ఎన్నికల్లో ఇండియా కూటమి 272 స్థానాల కన్నా ఎక్కువ గెలుస్తుంది. రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రిగా జూన్‌ 9న ప్రమాణం చేస్తారు’’ అని మంత్రి ఉత్తమ్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని