దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. భారాస తరఫున  ఎమ్మెల్యేగా గెలుపొంది.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయనపై తాము మార్చి 14న ఫిర్యాదు చేసినా అసెంబ్లీ స్పీకర్‌ చర్యలు తీసుకోలేదంటూ భారాస ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించింది.

Published : 16 Apr 2024 05:50 IST

ఈసీ, స్పీకర్‌ కార్యాలయానికి కూడా..
అనర్హత వేటు వేయాలంటూ భారాస ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పిటిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. భారాస తరఫున  ఎమ్మెల్యేగా గెలుపొంది.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయనపై తాము మార్చి 14న ఫిర్యాదు చేసినా అసెంబ్లీ స్పీకర్‌ చర్యలు తీసుకోలేదంటూ భారాస ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించింది. దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ.. స్పీకర్‌ తమ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని నాగేందర్‌కు కనీసం నోటీసులు జారీ చేయలేదన్నారు. స్పీకర్‌ను కలవడానికి కూడా ఎమ్మెల్యేలకు అనుమతి ఇవ్వలేదని, చివరికి రిజిస్టర్డ్‌ పోస్టులో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. దానం నాగేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరినందున పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఆయనపై అనర్హత వేటు వేయాల్సి ఉందన్నారు. అనర్హతకు సంబంధించి నిర్దిష్ట గడువులోగా స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటూ సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పిందన్నారు. ఈ మేరకు స్పీకర్‌కు కూడా నోటీసులు జారీ చేయవచ్చనగా.. అడ్వొకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్‌ కార్యాలయానికి నోటీసులు ఇస్తే సరిపోతుందని, స్పీకర్‌కు ప్రత్యేకంగా ఇవ్వడం సరికాదని, ఆ స్థానానికి గౌరవం ఇవ్వాలని పేర్కొన్నారు. ఫిర్యాదుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్‌పై ఒత్తిడి తీసుకురావడమూ తగదన్నారు. గత ప్రభుత్వ హయాంలోనూ 2019లో పార్టీ ఫిరాయింపులపై ఇచ్చిన ఫిర్యాదులను 2023 దాకా తేల్చలేదన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నాగేందర్‌తోపాటు న్యాయశాఖ కార్యదర్శి, స్పీకర్‌ కార్యాలయం, ఎన్నికల సంఘానికి కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని