క్రిమినల్‌ కేసులు శాఖాపరమైన విచారణకు భిన్నం

క్రిమినల్‌ కేసుల విచారణ శాఖాపరమైన కేసులకు భిన్నంగా ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. శాఖాపరమైన విచారణలో రూపొందించిన నివేదికల ఆధారంగా క్రిమినల్‌ కేసుల విచారణ చేపట్టరాదని తెలిపింది.

Published : 23 Apr 2024 03:55 IST

ఓయూ నిధుల దుర్వినియోగంపై శిక్ష రద్దు
30 ఏళ్ల నాటి కేసులో హైకోర్టు తీర్పు

ఈనాడు, హైదరాబాద్‌: క్రిమినల్‌ కేసుల విచారణ శాఖాపరమైన కేసులకు భిన్నంగా ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. శాఖాపరమైన విచారణలో రూపొందించిన నివేదికల ఆధారంగా క్రిమినల్‌ కేసుల విచారణ చేపట్టరాదని తెలిపింది. వీటి ఆధారంగా నిందితుల నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలనడం సరికాదంది. నేరాన్ని రుజువు చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్‌పైనే ఉంటుందని పేర్కొంది. సాక్ష్యం లేకుండా నిందితులకు కింది కోర్టు శిక్ష వేయడాన్ని తప్పుబట్టింది. ఉస్మానియా యూనివర్సిటీలో నిధుల దుర్వినియోగానికి సంబంధించి 30 ఏళ్ల కిందట నమోదైన కేసులో ఆరుగురు నిందితులకు ఏసీబీ కోర్టు విధించిన ఏడాది శిక్షను రద్దు చేస్తూ వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఓయూలో ఓవర్‌ టైమ్‌, ప్రింటింగ్‌ స్టేషనరీ, ప్రెస్‌ ఎక్విప్‌మెంట్‌ లావాదేవీల్లో రూ.1.59 కోట్ల దుర్వినియోగం జరిగిందంటూ ఉస్మానియా రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేయగా, ఏసీబీ 1994లో కేసు నమోదు చేసింది. మొత్తం 11 మంది నిందితుల్లో నలుగురు విచారణ దశలోనే మృతి చెందారు. ఏడాది శిక్ష విధిస్తూ 2007లో ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మాజీ సీనియర్‌ అసిస్టెంట్‌ సయ్యద్‌ అన్వర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వి.సత్యనారాయణ, హరినారాయణ, సి.బాలమల్లేశ్వరరావు, చంద్రశేఖర్‌, కె.ఎల్‌.రామారావులు హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. విచారించిన జస్టిస్‌ కె.సురేందర్‌ ఇటీవల తీర్పు వెలువరించారు. నిందితులు చెక్కులను నగదుగా డ్రా చేసుకున్నట్లు ఏ ఒక్క బ్యాంకు అధికారినీ సాక్షిగా ప్రాసిక్యూషన్‌ పరిశీలించలేదన్నారు. ఆధారాలు లేకుండానే ప్రధాన నిందితుడిని ప్రభావితం చేశారనడం సరికాదంటూ ఆరుగురు నిందితుల అప్పీళ్లను అనుమతించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని