Updated : 17 Nov 2021 18:22 IST

Viral: పారాసెయిలింగ్‌ చేస్తుండగా తెగిపోయిన తాడు.. సముద్రంలో పడిపోయిన దంపతులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొందరికి నీళ్లంటేనే భయం.. అలాంటిది సముద్రంపై పారాచూట్‌ సాయంతో గాల్లోకి ఎగరడం అంటే భయంతో కూడిన సాహసమే. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒకవేళ సముద్రంలో పడిపోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతూనే ఉంటారు. మరి అలాంటిది గాల్లో ఉండగా.. పారాసెయిలింగ్‌ తాడు తెగిపోయి వారు సముద్రంలో పడిపోతే.. ప్రాణాలు ఉంటాయో, గాల్లో కలిసిపోతాయోనని వారు పడే భయాందోళన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి పరిస్థితే ఎదురైంది ఓ జంటకు.

గుజరాత్‌కు చెందిన అజిత్‌ కథడ్‌ (30), సరళా కథడ్‌ (31) దంపతులు హాలిడే ట్రిప్‌ కోసం ఆదివారం దయూలోని నంగావ్‌ బీచ్‌కు వెళ్లారు. అక్కడ పారాసెయిలింగ్‌ చేయాలని ఆశపడ్డారు. నిర్వాహకులు పవర్‌ బోటు నుంచి వారిని పారాచూట్‌లో పైకెగిరేశారు. అయితే వారు పైకి వెళ్లిన కొద్దిసేపటికే పవర్‌ బోటుకు, పారాచూట్‌కు అనుసంధానంగా ఉన్న తాడు ఒక్కసారిగా తెగిపోయింది. వారు కొద్దిదూరం వెళ్లి సముద్రంలో పడిపోయారు. దీంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. బోటులో ఉన్న అజిత్‌ కథడ్‌ సోదరుడు రాకేశ్‌ భయంతో అరవడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నీటిలో దూకి వారిని రక్షించారు. లైఫ్‌ జాకెట్లు వేసుకోవడంతో వారు నీటిలో మునిగిపోలేదు. వారికి ఎలాంటి గాయాలు కూడా కాలేదు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘నా సోదరుడు గాల్లోకి ఎగురుతుండగా నేను వీడియో తీస్తున్నాను. కానీ తాడు తెగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు’ అని రాకేశ్‌ పేర్కొన్నాడు. తాడు బలహీనంగా ఉందని, తెగిపోతుందేమోనని ఈ ఫీట్‌కు ముందే సిబ్బందిని హెచ్చరించినట్లు ఆయన రిపోర్టర్లతో పేర్కొన్నాడు. కానీ ఏం కాదని వారు తనతో చెప్పినట్లు తెలిపాడు. దీనిపై అజిత్‌ స్పందిస్తూ ‘మా ప్రాణం పోయినంత పనైంది. నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగింది. మా కుటుంబం ఇంకా షాక్‌లోనే ఉంది’ అని పేర్కొన్నాడు.



Read latest Viral videos News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts