పర్యాటక పునరుద్ధరణ ప్రణాళిక

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం. కరోనా మహమ్మారి కారణంగా అత్యంత ప్రతికూల ప్రభావాలకు లోనైన రంగాల్లో పర్యాటకం ఒకటి.  ప్రస్తుతం భారతీయులను దేశీయ పర్యాటకం వైపు ప్రోత్సహిస్తూ దేశంలోని ప్రాకృతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సౌందర్యాన్ని దర్శింపజేసే కృషి జరుగుతోంది.

Published : 27 Sep 2022 01:15 IST

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం. కరోనా మహమ్మారి కారణంగా అత్యంత ప్రతికూల ప్రభావాలకు లోనైన రంగాల్లో పర్యాటకం ఒకటి.  ప్రస్తుతం భారతీయులను దేశీయ పర్యాటకం వైపు ప్రోత్సహిస్తూ దేశంలోని ప్రాకృతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సౌందర్యాన్ని దర్శింపజేసే కృషి జరుగుతోంది.

టీవల హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పర్యాటక మంత్రుల జాతీయ సదస్సు జరిగింది. ఇందులో దేశంలో కరోనా అనంతర పరిస్థితుల్లో పర్యాటక రంగాన్ని పునరుజ్జీవింపజేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, విదేశాల్లో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, ఉపాధి కల్పనను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. పర్యాటక, ఆతిథ్య రంగాలకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పర్యాటక మంత్రులతో సమావేశమై సమగ్రంగా చర్చించేందుకు జరిగిన మొదటి ప్రయత్నమిది. మంత్రులందరూ సమన్వయంతో పని చేస్తూ వివిధ ప్రభుత్వ విభాగాలను, రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రభుత్వ సంస్థలను కలుపుకొని పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి బాటలు వేయాలన్న  ప్రధాని మోదీ ఆలోచనల మేరకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ విస్తృత అంశాలపై సమగ్రంగా చర్చించింది. ఈ సందర్భంగా భారత పర్యాటక రంగ సమగ్రాభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఆలోచనలు, లక్ష్యాలను ‘ధర్మశాల డిక్లరేషన్‌’ రూపంలో అందరిముందు ఉంచేందుకు ఈ వేదిక ద్వారా అవకాశం కలిగింది. నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా డిక్లరేషన్‌ గురించి ప్రస్తావించుకోవడం సముచితం. దేశీయ పర్యాటకంపై దృష్టి సారించడం ద్వారా ప్రపంచ పర్యాటక పునరుద్ధరణలో భారత్‌ పాత్రను గుర్తెరిగి ముందుకెళ్ళడం డిక్లరేషన్‌ ముఖ్య ఉద్దేశం.

అవకాశంగా మలచుకొని...
భారత పర్యాటక రంగానికి ఊపిరులూదేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర రుణసదుపాయ గ్యారంటీ పథకాన్ని రూ.4.5 లక్షల కోట్ల నుంచి అయిదు లక్షల కోట్ల రూపాయలకు పెంచింది. రూ.50వేల కోట్ల పెంపు ద్వారా పర్యాటక, ఆతిథ్యరంగంలో భాగమైన రెస్టారెంట్లు, వివాహ మండపాలు వంటివాటికి లబ్ధి చేకూరుతుంది. పర్యాటక రంగంతో అనుసంధానమైన వారందరికీ ప్రయోజనం కలుగుతుంది. కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అనుకూల అంశాలు ప్రస్ఫుటమయ్యాయి. అందుకు అవసరమైన సమయం కూడా దొరికినట్లయింది. కరోనా సమయంలో కేంద్ర పర్యాటక శాఖ అన్ని భాగస్వామ్య పక్షాలను కలుపుకొంటూ విస్తృత సంప్రదింపులు జరుపుతూ జాతీయ పర్యాటక విధానం-2022 ముసాయిదాకు రూపకల్పన చేసింది. పర్యాటక రంగంలోని పరిశ్రమలకు ప్రోత్సాహాన్నిస్తూ, పర్యాటకానికి మద్దతుగా ఉండే వ్యవస్థలను బలోపేతం చేసుకుంటూ, ఉప విభాగాలను అభివృద్ధి చేసుకుంటూ పర్యాటక రంగ సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా ఈ పాలసీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. మన నాగరిక విలువలకు అనుగుణంగా సుస్థిర, బాధ్యతాయుతమైన, సమగ్ర పర్యాటక రంగ అభివృద్ధి జరగాలన్నది ముసాయిదా లక్ష్యం. జాతీయ హరిత పర్యాటక మిషన్‌ కూడా భారతీయ జీవన విధానాన్ని ప్రతిబింబించడంపైనే దృష్టిసారించనుంది. నేషనల్‌ డిజిటల్‌ టూరిజం మిషన్‌ ద్వారా డిజిటలీకరణ, సృజనాత్మకత, సాంకేతికతలకు పెద్దపీట వేస్తోంది. పర్యాటక, ఆతిథ్య రంగ నైపుణ్య మిషన్‌ ద్వారా యువతలోని నైపుణ్యాలకు సానపట్టడంపై దృష్టిసారించింది. దీంతోపాటు పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా పర్యాటక రంగంలో ప్రైవేటురంగ భాగస్వామ్యం పెంచేందుకు అవసరమైన చర్యలపైనా జాతీయ పర్యాటక విధానం దృష్టి పెడుతుంది. 2002 తరవాత తొలిసారిగా సంపూర్ణ పరివర్తనను ప్రతిబింబించే పర్యాటక విధానాన్ని తీసుకొచ్చే దిశగా ప్రయత్నం జరుగుతోంది. నూతన విధానానికి ఆమోదముద్ర పడితే, నిర్దేశిత లక్ష్యాల అమలు కోసం పర్యాటక శాఖ వినూత్న పద్ధతిలో ముందడుగేయనుంది.

గమ్యస్థానంగా...
భారత్‌ 2022 డిసెంబర్‌ నుంచి 2023 నవంబర్‌ వరకు జీ-20కి అధ్యక్షత వహిస్తున్న సమయంలో- ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా మారాలని యోచిస్తోంది. జీ-20 సదస్సుకు ఆయా దేశాలకు చెందిన కేంద్రీయ బ్యాంకు, ఆర్థిక శాఖల అధికారులు, అవినీతి వ్యతిరేక, వ్యవసాయ, వైద్య, సాంస్కృతిక, పర్యాటక తదితర 15 కార్యబృంద ప్రతినిధులు రానున్నారు. విదేశాంగ, ఇతర విభాగాల మంత్రులు కూడా సమావేశం కానున్నారు. భారత్‌ దాదాపు 200 సమావేశాలకు వేదిక కానుంది. ఈ సమావేశాలకు వేదికగా నిలిచే నగరాల ఎంపిక చోటు చేసుకొంటోంది. సదస్సుల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు, వసతి అందుబాటు, స్వచ్ఛభారత్‌ ర్యాంకింగ్‌ సహా వివిధ అంశాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. కేంద్రం నిర్దేశించుకున్న అంచనాలను అందుకొనే 35 నగరాలను గుర్తించారు. తగిన నిబద్ధత, అంకితభావంతోపాటు ఘన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ప్రణాళికల రూపకల్పన సాగుతోంది. వీసా సంస్కరణలు, సందర్శకుల ప్రయాణాలకు నిబంధనల సరళీకరణ, విమానాశ్రయాల్లో సానుకూల ఇమిగ్రేషన్‌ విధానం మొదలైన అంశాలపై వివిధ మంత్రిత్వ శాఖలతో సమన్వయంతో పనిచేయడంపై పర్యాటక శాఖ దృష్టిసారించింది. కరోనా అనంతరం పర్యాటక, ఆతిథ్య రంగం పుంజుకొంటున్న సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. 2024 జులై నాటికి మూడువేల కోట్ల డాలర్ల విదేశ మారక ద్రవ్య ఆదాయాన్ని పొందడం, కోటిన్నర మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యాలతో అడుగులు పడుతున్నాయి. 2047 నాటికి ప్రపంచ పర్యాటకంలో భారత్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు అవసరమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని చిత్తశుద్ధితో అమలుచేసేలా కృషి కొనసాగుతోంది.


ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ్‌ భారత్‌

దీర్ఘకాలంగా మన పర్యాటక వ్యూహాలు, విధానాలు విదేశ పర్యాటకులను పెద్దసంఖ్యలో ఆకర్షించడంపైనే దృష్టిసారించేవి. ఈ క్రమంలో దేశీయ పర్యాటకం అప్పుడప్పుడు విస్మరణకు గురయ్యేది. 2019 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ- ప్రయాణ ఖర్చులను భరించే స్తోమత ఉన్నవారు, 2022 నాటికి కనీసం 15 పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని సూచించారు. దేశంలో ఒక ప్రాంతానికి చెందినవారు ఇతర ప్రదేశాలను సందర్శించడం ద్వారా అక్కడి సంస్కృతులు, సంప్రదాయాలు, జీవన విధానాలను అర్థం చేసుకున్నప్పుడే ‘ఏక్‌ భారత్‌, శ్రేష్ఠ్‌ భారత్‌’ నినాదానికి సార్థకత చేకూరుతుంది. దేశీయ పర్యాటకంపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా ఆ రంగం అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఎక్కువ సందర్శకులు వచ్చే దేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల్లో ప్రత్యేకంగా పర్యాటక అధికారులను ఏర్పాటు చేసేలా కసరత్తు జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.