జీవన వేతనంతో నవజీవనం

కనీస వేతనంకన్నా బతకడానికి సరిపడా భృతి (జీవన వేతనం) చెల్లించడం ముఖ్యమని కేంద్రం గుర్తిస్తోంది. ఇది భారతీయ కార్మిక లోకానికి నిజంగా శుభవార్త. 2025కల్లా కనీస వేతనం నుంచి జీవన వేతనానికి మారాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రమాణాల రూపకల్పనకు అంతర్జాతీయ కార్మిక సంస్థతో కలిసి పనిచేస్తోంది. దేశంలో పనిచేసే కార్మికుల వేతనాలు ఆహారం, గృహవసతి, ఆరోగ్యం...

Published : 15 Apr 2024 01:33 IST

కనీస వేతనంకన్నా బతకడానికి సరిపడా భృతి (జీవన వేతనం) చెల్లించడం ముఖ్యమని కేంద్రం గుర్తిస్తోంది. ఇది భారతీయ కార్మిక లోకానికి నిజంగా శుభవార్త. 2025కల్లా కనీస వేతనం నుంచి జీవన వేతనానికి మారాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రమాణాల రూపకల్పనకు అంతర్జాతీయ కార్మిక సంస్థతో కలిసి పనిచేస్తోంది.

దేశంలో పనిచేసే కార్మికుల వేతనాలు ఆహారం, గృహవసతి, ఆరోగ్యం, విద్య, దుస్తుల ఖర్చును భరించే స్థాయిలో ఉండాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ‘జీవన వేతనం’ వ్యక్తుల శ్రేయస్సుతోపాటు సమాజం సమ్మిళిత, సుస్థిర అభివృద్ధి సాధించడానికి ఉపకరిస్తుంది. భారతదేశం 1948లో చట్టబద్ధమైన కనీస వేతన విధానాన్ని చేపట్టింది. నిర్ణీత కాలం పనిచేసినందుకు ఉద్యోగి లేదా కార్మికుడికి యజమాని చెల్లించాల్సిన కనీస వేతనమది. దాని స్థానంలో జీవన వేతన విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. అది కార్మికుడి కనీస అవసరాలు తీర్చగలిగే స్థాయిలో ఉండటంతో పాటు ఆర్థికంగా సమసమాజాన్ని ఆవిష్కరించేందుకు తోడ్పడాలని భావిస్తున్నారు.

ఆదాయ అసమానతలు

నేడు వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు కనీస వేతనాలను అమలుచేస్తున్నారు. 2023లో దేశంలో ప్రాథమిక స్థాయి కనీస వేతనం రోజుకు రూ.178. కొన్నేళ్లుగా దాదాపు ఇదే మొత్తం ఉంటోంది. ప్రత్యేక నైపుణ్యాలు లేని సాధారణ కార్మికులకు కనీస వేతన చట్టం కింద నెలకు సగటున రూ.2,250 నుంచి రూ.70,000 వరకు చెల్లించవచ్చు. వాస్తవంలో వారికి చెల్లిస్తున్న నెలవారీ సగటు వేతనం రూ.29,400కు మించడం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన కనీస వేతనాలు ఆదాయ అసమానతలకు కారణమవుతున్నాయి. వేతనాలు, ఆర్థిక ప్రగతి, ద్రవ్యోల్బణాలకు మధ్య పరస్పర సంబంధం ఉంది. వేతనాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. అది వినియోగదారుల కొనుగోలుశక్తిని ప్రభావితం చేస్తుంది. అంటే వేతనాలు ద్రవ్యోల్బణం హెచ్చుతగ్గులకు కారణమవుతాయన్న మాట. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలకు తోడు ప్రభుత్వ, రిజర్వు బ్యాంకు విధానాలు కూడా ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తాయి. వనరుల్లో అందరికీ సముచిత, సమాన వాటా ఇవ్వడం ద్వారా ఆదాయ అసమానతలను నిర్మూలించాలి. అది పౌరులు సుస్థిర జీవనం సాగించడానికి తోడ్పడుతుంది.

ప్రజల ఆదాయ అసమానతలను లెక్కించడానికి ఆర్థికవేత్తలు ‘జినీ సూచీ’ని ఉపయోగిస్తారు. ఈ విధానంలో ‘0’ స్కోరు ప్రజల ఆదాయాల్లో పరిపూర్ణ సమానత్వానికి, ‘1’ అత్యధిక ఆదాయ అసమానతలకు సంకేతాలు. 0.4 స్కోరును ఆదాయాల్లో సాధారణ వ్యత్యాసాలకు ప్రతీకగా భావిస్తారు. స్కోరు 0.5 నుంచి 1 వరకు ఉంటే ఆదాయ అసమానతలు తీవ్రస్థాయిలో ఉన్నట్లు లెక్క. భారత్‌లో 2014-15లో 0.47గా ఉన్న జినీ స్కోరు 2022-23 వచ్చేసరికి 0.40కు తగ్గింది. కార్మిక వలసల కారణంగా ఆదాయాలు పెరిగి అసమానత్వం తగ్గిందని నిపుణుల అంచనా. కనీస వేతనానికి బదులు జీవన వేతనాన్ని వర్తింపజేస్తే ప్రజల ఆదాయ అసమానతలు మరింతగా తగ్గుముఖం పడతాయి. అది దేశ ఆర్థికాభ్యుదయానికి తోడ్పడుతుంది. ప్రపంచమంతటా సరకుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం హెచ్చింది. ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగకపోతే ప్రజల కొనుగోలుశక్తి పడిపోతుంది. జీవన ప్రమాణాలు క్షీణించి సామాజిక, ఆర్థిక అస్థిరత నెలకొంటుంది. అనేక వర్ధమాన దేశాలతో పోలిస్తే భారత్‌లో ద్రవ్యోల్బణం కొంత తక్కువే. అయినప్పటికీ, అది 2013లో 10.02 శాతంగా నమోదై ఆందోళన కలిగించింది. కేంద్రం పటిష్ఠ విధానాలను అనుసరించడంవల్ల 2024 ఫిబ్రవరికల్లా అది 5.09శాతానికి దిగివచ్చింది.

తలసరి ఆదాయం, వినియోగ వ్యయం వ్యక్తుల ఆర్థిక శ్రేయస్సును నిర్ణయిస్తాయి. 2014-15లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పుడు భారతీయుల తలసరి వార్షిక ఆదాయం రూ.86,647. అయితే అది 2022-23లో రూ.1,72,000కు పెరిగింది. 2022-23లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం (ఎంపీసీఈ) గ్రామాల్లో రూ.3,773. అది పట్టణాల్లో రూ.6,459. మొత్తం వినియోగ వ్యయంలో ఆహారంపై వ్యయం 40శాతమైతే, ఆహారేతర వ్యయం 60శాతం. 2011-12లో రూ.1,430గా ఉన్న గ్రామీణ ఎంపీసీఈ 2022-23 వచ్చేసరికి రూ.3,773కు పెరిగినట్లు జాతీయ నమానా సర్వే విశ్లేషించింది. దేశంలో ఉద్యోగాల కల్పనకు కృషి జరుగుతున్నప్పటికీ, నిరుద్యోగ సమస్య ఇప్పటికీ తీవ్రంగానే ఉంది. 2023 జనవరి-మార్చిలో 15 ఏళ్లు పైబడినవారిలో నిరుద్యోగిత 6.8శాతం. అంతకుముందు ఏడాది అది 8.2శాతంగా నమోదైంది. ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనం కుటుంబానికి ఎటూ సరిపోకపోవడంతో జీవన వేతనానికి మారాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అల్ప వేతనాలు దారిద్య్రానికి దారితీస్తాయి. సగటు భారతీయ కుటుంబంలో ఒకరిద్దరు సంపాదిస్తే, వారిపై ఇద్దరు లేదా ముగ్గురు ఆధారపడుతున్నారు. కనీస వేతనంతో వారంతా బతుకుబండి ఈడ్వటం చాలా కష్టమని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) గుర్తించింది.

బహుముఖ కృషితో సాకారం

జీవన వేతనాలను చెల్లించాల్సి వస్తే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడుతుందనే వాదన ఉంది. దాంతో సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడానికి యజమానులు ప్రయత్నిస్తారని, అది నిరుద్యోగిత పెరగడానికి దారితీస్తుందనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. అయితే, సిబ్బంది హుందాగా జీవించడానికి అనువైన వేతనాలు పొందినప్పుడు పేదరికం తగ్గి ఆర్థిక, సామాజిక అభివృద్ధి సుసాధ్యమవుతుందని విశ్లేషకులు, విధానకర్తలు భావిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించినట్లు 2030కల్లా సుస్థిరాభివృద్ధి సాధించడానికి జీవన వేతనం కీలకమవుతుంది. జీవన వేతన విధానాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి బహుముఖ కృషి ఆవశ్యకం. ఆ దిశగా కేంద్రం, రాష్ట్రాలు, వ్యాపార, పారిశ్రామిక సంస్థలు సమన్వయంతో ముందుకుసాగాలి. ప్రస్తుత కనీస వేతన చట్టాలను సవరించాలి. జీవన వేతనాలను చెల్లించే సంస్థలకు తగిన ప్రోత్సాహకాలివ్వాలి. కార్మికుల్లో విద్యా నైపుణ్యాలను పెంచడం ద్వారా వారి ఉద్యోగార్హతలను, ఉత్పాదకతను పెంపొందించాలి. ఇటువంటి కార్యాచరణ సుస్థిరాభివృద్ధి సాధనకు ఎంతగానో కీలకమవుతుంది.


సమస్యలకు మూల కారణం...

భారత్‌లో హుందాగా జీవించడానికి అవసరమైన వేతనాలను నిపుణ సిబ్బంది మాత్రమే ఆర్జించగలుగుతున్నారు. ఇలాంటి జీవన వేతనం లభించనివారు ఎక్కువ ఆదాయం కోసం రెండు మూడు పనులు చేయాల్సి వస్తోంది. పిల్లలకు చదువులు చెప్పించలేకపోవడంతో వారు మధ్యలోనే బడులు మానేయాల్సి వస్తుంది. ఏవైనా అనారోగ్య సమస్యలు వస్తే చికిత్సకు అయ్యే ఖర్చులను భరించలేని దుస్థితిలోకి జారిపోతున్నారు. కనీస వేతనాలతో సరిపెట్టడమే ఇటువంటి సమస్యలకు మూలకారణం. జీవన వేతనం లభించే కార్మికుల నుంచి ఎక్కువ ఉత్పాదకతను ఆశించగలం. అది యజమానులతో పాటు సమాజానికీ ప్రయోజనకరం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.