జగన్‌ జమానా... అప్పుల ఖజానా!

ఒక చేత్తో అప్పులు, మరో చేత్తో పన్నుల వాతలతో ఆంధ్రప్రదేశ్‌లో అయిదేళ్ల పాలనలో జగన్‌ అక్షరాలా ఆర్థిక అరాచకం సృష్టించారు. మూలధన వ్యయాన్ని మరచిపోయిన జగన్‌ ఏలుబడిలో ఏపీలో మౌలిక వసతులు మృగ్యమయ్యాయి. పారిశ్రామికాభివృద్ధి పడకేసింది. ఫలితంగా, ఉపాధి దెబ్బతిని యువత భవిష్యత్తు అంధకారంలోకి జారిపోయింది.

Updated : 07 May 2024 10:21 IST

ఒక చేత్తో అప్పులు, మరో చేత్తో పన్నుల వాతలతో ఆంధ్రప్రదేశ్‌లో అయిదేళ్ల పాలనలో జగన్‌ అక్షరాలా ఆర్థిక అరాచకం సృష్టించారు. మూలధన వ్యయాన్ని మరచిపోయిన జగన్‌ ఏలుబడిలో ఏపీలో మౌలిక వసతులు మృగ్యమయ్యాయి. పారిశ్రామికాభివృద్ధి పడకేసింది. ఫలితంగా, ఉపాధి దెబ్బతిని యువత భవిష్యత్తు అంధకారంలోకి జారిపోయింది. సామాన్యుల బతుకులు నరకప్రాయంగా మారాయి.

ధికారంలో ఉన్న ప్రభుత్వం తన పనితీరును ప్రజలకు తెలియజెప్పి మళ్ళీ గద్దెనెక్కాలని ప్రయత్నిస్తుంది. వచ్చే సోమవారమే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో అక్కడ జగన్‌ సర్కారు విధానాలను సమీక్షించడానికి ఇది సరైన సమయం. జగన్‌ అయిదేళ్ల పాలనలో ఏపీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ముఖ్యంగా అసలైన అభివృద్ధిని వదిలిపెట్టి, అప్పులతో కాలం వెళ్ళదీయాలనుకుంటే రాష్ట్రం ఎలా అధోగతికి చేరుతుందన్నదానికి ఏపీ ఉదాహరణగా నిలుస్తోంది. ప్రజా సంక్షేమానికి తాము అధికంగా కేటాయింపులు చేస్తున్నామని, అదే తమకు ప్రాధాన్య అంశమని జగన్‌ సర్కారు పదేపదే వల్లె వేస్తుంటుంది. అయిదేళ్లలో ప్రజా సంక్షేమం కోసం బడ్జెట్‌ అంచనాల్లో చెప్పిన దానికన్నా తక్కువగానే ఖర్చు చేసింది.

మౌలిక వసతులు మృగ్యం

జగన్‌ ప్రభుత్వ విధానాల్లోని లోపాలే ఆంధ్రప్రదేశ్‌ను అంధకారంలోకి నెట్టేశాయి. ప్రస్తుతం ఏపీ సర్కారు అప్పుల మీదనే రోజులు వెళ్లదీస్తోంది. అవి మితిమీరితే రాష్ట్రం దివాలా స్థితికి చేరుకుంటుంది. కొత్త అప్పులు లేనిదే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లనూ చెల్లించలేని స్థితి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొంది. ఎప్పటికప్పుడు కొత్త అప్పులు పుట్టకపోతే రాష్ట్రం పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుంది. గత అయిదేళ్ల జగన్‌ జమానాలో ఏపీలో పన్నులు, అప్పులు రెండూ విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా ఆస్తిపన్నులు, ప్రజా సేవలకు సంబంధించిన రుసుములు, కరెంటు బిల్లులు వంటివాటిని జగన్‌ అడ్డగోలుగా పెంచారు. గత మూడేళ్లలో ఒక్క ఆస్తిపన్నే దాదాపు 45శాతానికి ఎగబాకింది. దేశవ్యాప్తంగా పెట్రో ఉత్పత్తులపై అత్యధిక వసూళ్లను ఏపీనే రాబడుతోంది. అక్కడ లీటరుకు సగటున రూ.10పైనే జగన్‌ సర్కారు అదనంగా వసూలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాములో అయిదేళ్లలో పెట్రో ఉత్పత్తులపై ఏపీలో రూ.46 వేల కోట్ల పన్నులు వసూలయ్యాయి. జగన్‌ ఏలుబడిలో అవి దాదాపు రూ.70 వేల కోట్లకు చేరాయి. ఏపీ ప్రజలపై జగన్‌ అదనంగా రూ.24 వేల కోట్లు భారం మోపారు. పెట్రో విక్రయాల్లో రోడ్డు అభివృద్ధి సెస్‌ పేరుతో ప్రజల జేబుల నుంచి గుంజుతున్నారు. అయినా, ఏపీలో రహదారులు ఘోరంగా తయారయ్యాయి. ఎక్కడికక్కడ గుంతలు తేలిన రోడ్లపై ప్రయాణమంటేనే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గోతులు తేలిన రహదారులపై ప్రమాదాల బారిన పడి ఎందరో వాహనదారులు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. విచ్చలవిడిగా పన్నులు బాదితే ప్రజల పొదుపు, వినియోగంపై ప్రభావం పడుతుంది. ద్రవ్యోల్బణం విజృంభిస్తుంది. ఒకవైపు ప్రజల నుంచి భారీగా పన్నులు వసూలుచేస్తున్నా, మరోవైపు జగన్‌ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు తెస్తోంది. ఈ రుణాలను మూలధన వ్యయానికి, పెట్టుబడులకు వినియోగిస్తే రాష్ట్రాభివృద్ధి జోరందుకుంటుంది. ఏపీలో దానికి భిన్నమైన పరిస్థితి నెలకొనడంతో రాష్ట్రం అప్పుల ఊబిలోకి జారిపోయింది. 2019-20 సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఏపీ అప్పు రూ.2.61 లక్షల కోట్లు. జగన్‌ జమానాలో రాష్ట్రంపై రుణ భారం భారీగా పెరిగింది. గత అయిదేళ్లలో మూలధన వ్యయం గురించి పూర్తిగా మరచిపోయారు. సమ్మిళిత అభివృద్ధిని అటకెక్కించారు. 2022-23 బడ్జెట్‌ అంచనాల్లో మూలధన వ్యయానికి జగన్‌ సర్కారు రూ.30,679 వేల కోట్లు ప్రతిపాదించింది. అయితే, వాస్తవంలో సుమారు ఏడు వేల కోట్ల రూపాయలే ఖర్చు చేసింది. దాదాపు అయిదు కోట్ల జనాభా కలిగిన రాష్ట్రానికి నెలకు రూ.604 కోట్లు మాత్రమే మూలధన వ్యయానికి ఖర్చు చేశారంటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. జగన్‌ పాలనలో ఏపీలో దాదాపు అన్నిచోట్లా మౌలిక వసతులు మృగ్యమయ్యాయి. రాష్ట్రంలో రోడ్లు, సాగురంగం, తాగునీటి సదుపాయాలను చూస్తే మౌలిక వసతులపై పెట్టుబడులను ముఖ్యమంత్రి ఎంత నిర్లక్ష్యం చేశారో అర్థమవుతుంది. దీనివల్ల ప్రైవేటు పెట్టుబడులు ముఖం చాటేసి, ఉద్యోగ కల్పన దెబ్బతింది. రాష్ట్రంలో చదువుకున్న యువత ఉద్యోగాలు దొరక్క ఇతర ప్రాంతాలకు వలసపోవాల్సి వస్తోంది.

వ్యవస్థలు నిర్వీర్యం

జగన్‌ జమానాలో వ్యవస్థలన్నీ కీలుబొమ్మలుగా మారాయి. అన్నింటిలో రాజకీయ అజెండాలే కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రశ్నించే గళాలను ఎంతమాత్రం సహించే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వేల సంఖ్యలో రిట్‌, కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలవుతున్నాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి కనిపించదు. రాష్ట్రంలో మత్తుపదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతూ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. నేరాలు, జూదాలు వంటివి విపరీతంగా పెరిగాయి. జగన్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ ‘గంజాయి క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియా’గా అపఖ్యాతి మూటగట్టుకుంది. పారిశ్రామిక అభివృద్ధినీ జగన్‌ పూర్తిగా గాలికొదిలేశారు. రాష్ట్రంలో 38 పెద్ద, మెగా పారిశ్రామిక ప్రాజెక్టులు రూ.21 వేల కోట్ల విలువైన ఉత్పత్తిని మొదలుపెట్టాయని, దాదాపు ఇరవై ఒక్క వేల మందికి ఉపాధి దక్కిందని 2022-23 ఏపీ సామాజిక-ఆర్థిక సర్వేలో సర్కారు సెలవిచ్చింది. ఆయా సంస్థల సగటు పెట్టుబడి రూ.554 కోట్లు మాత్రమే. వ్యాపార ప్రపంచంలో ఎనిమిది వేల కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టినవాటిని మెగా ప్రాజెక్టులుగా చెబుతారు. అరకొర పెట్టుబడులు తెచ్చినవాటిని భారీ సంస్థలుగా ప్రచారం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక అరాచకత్వంతో ఏపీని ‘అంధప్రదేశ్‌’గా మార్చేసిన పెడపాలన జగన్‌ది. దాన్ని గుర్తుంచుకొని రేపటి ఎన్నికల్లో విజ్ఞతతో ఓటేయాల్సిన బాధ్యత ప్రజలదే!


భారీగా చెల్లింపుల భారం

జగన్‌ జమానాలో బహిరంగ మార్కెట్‌ రుణం, మొత్తం కార్పొరేషన్‌ అప్పులు, విద్యుత్తు సంస్థల నాన్‌ గ్యారంటీ రుణాలు, పెండింగ్‌ బిల్లులు ఇలా అన్నీ కలిపి రాష్ట్రంపై మొత్తం చెల్లింపుల భారం రూ.10,75,837 కోట్లకు చేరింది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అభివృద్ధి అటకెక్కింది. జగన్‌ దుర్విధానాలు ఏపీకి పెను శాపంగా మారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.