ప్రాణాలను మింగేస్తున్న రహదారులు

ప్రపంచవ్యాప్తంగా రహదారులు ఏటా లక్షల సంఖ్యలో ప్రాణాలను హరిస్తున్నాయి. భారత్‌లోనూ రోడ్లు నిత్యం రక్తమోడుతూ ఎన్నో కుటుంబాల్లో తీరని ఆవేదన నింపుతున్నాయి.

Published : 03 Dec 2022 00:25 IST

ప్రపంచవ్యాప్తంగా రహదారులు ఏటా లక్షల సంఖ్యలో ప్రాణాలను హరిస్తున్నాయి. భారత్‌లోనూ రోడ్లు నిత్యం రక్తమోడుతూ ఎన్నో కుటుంబాల్లో తీరని ఆవేదన నింపుతున్నాయి. దేశానికి వెన్నెముక వంటి యువతే రహదారి ప్రమాదాల్లో అధికంగా మృత్యువాత పడుతోంది.

విశ్వవ్యాప్తంగా ఏటా రోడ్డు ప్రమాదాల్లో 13 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయిదు కోట్ల మంది క్షతగాత్రులవుతున్నారు. వీటిపై ఇటీవల ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్‌ ఆంటొనియో గుటెరస్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవ్యాప్తంగా సగటున 24 సెకన్లకు ఒక వ్యక్తిని రోడ్లు బలితీసుకుంటున్నాయంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత్‌లోనూ రోడ్లపై మృత్యుతాండవం నిత్యం కొనసాగుతూనే ఉంది. ఇండియాలో నిరుడు నాలుగు లక్షలకు పైగా రహదారి ప్రమాదాలు నమోదయ్యాయి. వాటిలో లక్షన్నర మందికి పైగా మృత్యువాత పడ్డారు. దాదాపు నాలుగు లక్షల మంది గాయాలపాలయ్యారు.

ఆదర్శ విధానాలు

రహదారి ప్రమాదాల్లో అధికంగా యువతే ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బాధితుల్లో అధిక శాతం ద్విచక్ర వాహనదారులే. నిరుడు మొత్తం రోడ్డు ప్రమాద మృతుల్లో వీరు 44.5శాతమని జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) లెక్కలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది రోడ్డు ప్రమాదాల్లో 8,186 మంది మృతిచెందారు. 2020తో పోలిస్తే మరణాల సంఖ్య 14 శాతం పెరిగింది. తెలంగాణలో 7,557 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో రోడ్డు ప్రమాద మృతుల్లో 70శాతం 18 నుంచి 45 సంవత్సరాలలోపు వయసు వారే. ఈ విషయాన్ని కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ సైతం పలుమార్లు ప్రస్తావించారు. ప్రభుత్వాలు రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవడం తప్పనిసరని ఆయన వ్యాఖ్యానించారు. 2025 నాటికి రోడ్డు ప్రమాదాలను 50 శాతానికి, 2030 నాటికి పూర్తిగా తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. వాహన చోదకులు రహదారి భద్రత నిబంధనలను తమ వంతుగా తప్పనిసరిగా పాటిస్తేనే ఇది సాధ్యమవుతుందని గడ్కరీ సూచించారు.

రోడ్డు ప్రమాదం జరిగిన గంటలోనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తే ప్రాణాపాయాన్ని నివారించవచ్చు. రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రులకు తీసుకొచ్చేవారు కేసులు, సాక్ష్యాలు అంటూ పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చూస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి. కానీ, ఈ విషయంలో ప్రజల్లో చాలా అపోహలు, భయాలు నెలకొన్నాయి. అందుకే చాలామంది రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసే విషయంలో వెనకడుగు వేస్తున్నారు. దీన్ని నివారించేలా రోడ్డు ప్రమాద బాధితులను తక్షణం సమీప ఆస్పత్రులకు తీసుకొచ్చేవారికి రెండు వేల రూపాయల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని ఝార్ఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకూ బాధితులను ఆదుకొనే బాధ్యతను అప్పగించింది. తమిళనాడు సర్కారు సైతం ప్రమాద స్థలానికి 13 నిమిషాల్లోనే ఆంబులెన్సును పంపి, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స సకాలంలో అందేలా చూస్తోంది. తద్వారా రోడ్డు ప్రమాద మరణాలను దాదాపు 53శాతం తగ్గించగలిగింది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఝార్ఖండ్‌, తమిళనాడు విధానాలను ఆదర్శంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయాలంటే ప్రపంచవ్యాప్తంగా మరింత కృషి జరగాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటొనియో గుటెరస్‌ వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాద మృతుల్లో ప్రతి పది మందిలో తొమ్మిది మంది అల్పాదాయ దేశాలవారేనని ఆయన తెలిపారు. విశ్వవ్యాప్తంగా రోడ్లను సురక్షితంగా మార్చేందుకు ఐక్యరాజ్య సమితి రహదారి భద్రత నిధికి ఆర్థిక సహకారం, సాంకేతిక సాయం అందించేందుకు ప్రపంచ దేశాలు తమవంతు తోడ్పాటును అందించాలని గుటెరస్‌ పిలుపిచ్చారు.

కఠిన చర్యలు తప్పనిసరి

ప్రమాదాలకు ఆస్కారం లేని విధంగా రహదారులను తీర్చిదిద్దడం, వాహన చోదకులంతా సుశిక్షితులై ఉండేలా చర్యలు తీసుకోవడంపై పాలకులు పటిష్ఠంగా దృష్టి సారించాలి. దేశంలో 22 లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని కేంద్ర రహదారి, రవాణా శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. పెద్దయెత్తున డ్రైవింగ్‌ పాఠశాలలు ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరాన్ని ఇవి నొక్కి చెబుతున్నాయి. ఇందుకోసం నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖతో కలిసి వెనకబడిన, గిరిజన ప్రభావిత జిల్లాల్లో డ్రైవింగ్‌ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కేంద్రం ప్రకటించడం హర్షణీయం. అతి వేగంగా, మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించే వారిపై జరిమానాల కొరడా ఝళిపించాలి. ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలతో ముందుకు సాగినప్పుడే రహదారి ప్రమాదాలను నియంత్రించడం సాధ్యమవుతుంది. 

 కృష్ణంరాజు తాళ్ళ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు