Pakistan: దయనీయ స్థితిలో దాయాది

పాకిస్థాన్‌ కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది. మునుపెన్నడూ లేనంత సంక్లిష్ట స్థితికి చేరింది. ఆర్థిక వ్యవస్థ పతనం అంచున వేలాడుతోంది. రాజకీయ అస్థిరత దేశాన్ని మరింత దయనీయ పరిస్థితుల్లోకి నెడుతోంది.

Updated : 24 Feb 2023 11:47 IST

పాకిస్థాన్‌ కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది. మునుపెన్నడూ లేనంత సంక్లిష్ట స్థితికి చేరింది. ఆర్థిక వ్యవస్థ పతనం అంచున వేలాడుతోంది. రాజకీయ అస్థిరత దేశాన్ని మరింత దయనీయ పరిస్థితుల్లోకి నెడుతోంది. దాయాది దేశం ఈ సంక్షోభ సుడిగుండం నుంచి ఇప్పట్లో బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. తాము దివాలా స్థితిలో బతుకుతున్నామంటూ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్య- పాక్‌ రాజకీయ నాయకత్వ బేలతనానికి నిదర్శనంగా నిలుస్తోంది.

పాకిస్థాన్‌ కేంద్ర బ్యాంకు వద్ద విదేశ మారకద్రవ్య నిల్వలు అడుగంటాయి. ఇవి కేవలం మూడు వారాల దిగుమతుల చెల్లింపులకు మాత్రమే సరిపోతాయి. ఫలితంగా కేవలం ఆహారం, ఔషధాల దిగుమతులకు మాత్రమే డాలర్ల చెల్లింపులను అనుమతిస్తున్నారు. ఆ దేశంలోని తయారీ కంపెనీలకు కీలక ముడిసరకుల దిగుమతి చెల్లింపులు కష్టతరంగా మారడంతో కార్యకలాపాలు నిలిపివేశాయి. ఆటొమొబైల్‌, టైర్లు, ఎరువులు, ఉక్కు కంపెనీలు కొన్నాళ్లపాటు కర్మాగారాలను మూసివేయడం, ఉత్పత్తిని తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకున్నాయి. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాక్‌ ఆర్థిక వ్యవస్థను ఈ పరిణామాలు మరింతగా దెబ్బతీయనున్నాయి.

ద్రవ్యోల్బణంపై ఆందోళన

అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) నుంచి ఆర్థిక ప్యాకేజీ కోసం పాకిస్థాన్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 1980 నుంచి ఇటువంటి ప్యాకేజీ కోరడం ఇది పదమూడోసారి. ఆర్థిక వ్యవస్థను మెరుగు పరచుకొనేందుకు మార్చి ఒకటో తేదీలోపు కఠిన చర్యలు తీసుకోకపోతే ఐఎంఎఫ్‌ ప్యాకేజీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఐఎంఎఫ్‌ నిబంధనలు ఊహకు అందని స్థాయిలో ఉన్నాయంటూ పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ వ్యాఖ్యానించడాన్ని చూస్తే- ఈసారి ఆ సంస్థ ఎంత నిక్కచ్చిగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఐఎంఎఫ్‌ కరుణ కోసం వివిధ రకాల పన్నుల పెంపుతో ‘మినీ బడ్జెట్‌’ను పాక్‌ జాతీయ అసెంబ్లీ ఆమోదించింది. తద్వారా దాదాపు నెల వ్యవధిలోనే రెండోసారి ఇంధన ధరలను పెంచినట్లయింది. సిగరెట్లు, ద్విచక్ర వాహనాలు, మొబైల్‌ ఫోన్లు, విమాన టికెట్లు వంటి వాటిపై పన్ను రేట్లు పెరిగాయి. తాజా నిర్ణయాలతో ద్రవ్యోల్బణం భారీగా జోరందుకుంటుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్థాన్‌లో పన్నుల వసూళ్లు చాలా తక్కువ. మొత్తం పన్నుల్లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు కేవలం ఒకశాతం మాత్రమే ఉండటం పరిస్థితి తీవ్రతను వివరిస్తోంది. పాకిస్థాన్‌ ఒక దేశంలా పని చేయాలని, పేదలకు రాయితీలు ఇచ్చినా, సంపన్నులు పన్నులు చెల్లించేలా చేయాలని ఐఎంఎఫ్‌ అధిపతి క్రిస్టిలీనా జార్జీవా ఇటీవల హితవు పలకడం గమనార్హం. దేశ జీడీపీలో సుమారు 20 శాతందాకా వ్యవసాయం నుంచే లభిస్తోంది. కానీ, ఆ రంగానికి ప్రత్యక్ష పన్నుల నుంచి మినహాయింపు ఉంది. ఇది పాక్‌ రాజకీయాలను శాసించే భూస్వామ్య వర్గానికి మాత్రమే లాభదాయకంగా మారుతోంది. సంపన్నులకు ఇచ్చే రాయితీలు మొత్తం అదనపు పన్నుల్లో 40 శాతానికి సమానంగా ఉన్నాయనే విశ్లేషణలున్నాయి. ఇందులో లబ్ధి పొందేవారిలో సంపన్న పాలకవర్గాలే అధికం. ‘మూడేళ్ల నుంచి రూపాయి కూడా ఆదాయ పన్ను చెల్లించలేదు’ అని నవాజ్‌ షరీఫ్‌ గతంలో దాఖలు చేసిన ఎన్నికల ప్రమాణపత్రంలో ప్రకటించడం- పాక్‌లో అవ్యవస్థకు అద్దం పడుతోంది. ఈసారి మినీ బడ్జెట్‌లోనూ వ్యవసాయ రంగానికి పన్ను మినహాయింపు కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

పన్ను సంస్కరణలు

సుమారు 20 ఏళ్ల నుంచి పట్టణాభివృద్ధితో స్థిరాస్తి రంగం బాగా వృద్ధి చెందింది. ఇందులో పెట్టుబడుల ద్వారా సంపాదించిన సొమ్ము దుబాయి, టొరెంటో, లండన్‌ వంటి ప్రాంతాలకు తరలిపోతోంది. ఈ రంగంలోని మూలధన లాభాలపై అతి స్వల్పంగానే పన్నులు వసూలు వేస్తున్నారు. సైన్యానికి చెందిన ‘డిఫెన్స్‌ హౌసింగ్‌ అథారిటీ’తో కలిసి సైనిక ఉన్నతాధికారులు స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు. దీంతో వారు పదవీ విరమణ చేసే నాటికి అపర కుబేరులుగా అవతరిస్తున్నారు. వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక ఈసారి కూడా స్థిరాస్తి రంగంలో పన్ను సంస్కరణలకు పాలకులు మొగ్గు చూపలేదు. మినీ బడ్జెట్‌లో పెంచిన పన్నులన్నీ పరోక్షంగా పేదల నడ్డివిరిచేవే. గతంలో భౌగోళిక రాజకీయ అవసరాల కోసం అమెరికా ఒత్తిడితో ఐఎంఎఫ్‌ పాక్‌ను ఆదుకొంది. దీనికి తోడు సౌదీఅరేబియా వంటి మిత్రదేశాలు అందించే సహాయంతో కాలం గడిచింది. దీంతో పన్ను సంస్కరణల జోలికి వెళ్లకుండా సంపన్నులను సంతృప్తి పరచుకొంటూ వచ్చారు. ఈసారి ఆర్థిక సహాయం విషయంలో అమెరికా, సౌదీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికైనా పాక్‌ పాలకులు కళ్లు తెరిచి పన్ను సంస్కరణలకు నడుంకడితేనే ఆర్థిక వ్యవస్థ జీవం పోసుకుంటుంది. సైనిక ఉన్నతాధికారులు చిత్తశుద్ధితో మద్దతు ఇస్తేనే ఇది సాధ్యమవుతుంది. లేనిపక్షంలో పాకిస్థాన్‌ భవిష్యత్తులో సైతం మరిన్ని ఆర్థిక సంక్షోభాల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందేనన్నది నిపుణుల మాట!

పి.ఫణికిరణ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.