భూతాపం... నియంత్రణే పరిష్కారం!

‘వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, మహమ్మారులు... వీటిని పరిష్కరించాలంటే మనం ఒకరితో ఒకరు పోరాడుకోవడం కాకుండా, కలిసి పని చేయాలి’- ఇండొనేసియా నుంచి భారతదేశానికి జీ20 అధ్యక్ష బాధ్యతలు బదిలీ జరిగిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలివి.

Published : 02 Jun 2023 00:40 IST

‘వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, మహమ్మారులు... వీటిని పరిష్కరించాలంటే మనం ఒకరితో ఒకరు పోరాడుకోవడం కాకుండా, కలిసి పని చేయాలి’- ఇండొనేసియా నుంచి భారతదేశానికి జీ20 అధ్యక్ష బాధ్యతలు బదిలీ జరిగిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలివి. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులపై చర్చించేందుకు, అన్ని దేశాలూ సంయుక్త కార్యాచరణ చేపట్టేందుకు జీ20 శిఖరాగ్ర సమావేశం సరైన వేదిక.

ప్రస్తుతం వేసవి సెగలు పొగలు కక్కుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనీవినీ ఎరుగని స్థాయికి చేరుకుంటున్నాయి. అంతకుముందు నడివేసవిలోనూ భారీ వర్షాలు కురిశాయి. ప్రపంచవ్యాప్తంగా చూసినా, పాకిస్థాన్‌లో వరదలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయి. ఇలాంటి విపరీత వాతావరణ పరిణామాలు అన్నింటికీ భూతాపమే కారణమన్న విషయం ఇప్పటికే పలు పరిశోధనల్లో స్పష్టమైంది. మానవ కార్యకలాపాల కారణంగా జరుగుతున్న ఈ విధ్వంసాన్ని నివారించాలంటే భూతాపాన్ని నియంత్రణలోకి తీసుకురావడం ఒక్కటే ఏకైక మార్గం. కానీ, అగ్రరాజ్యాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు వేటికవి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి.

ప్రపంచంలోని మొత్తం కర్బన వాయువు (గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌-జీహెచ్‌జీ)లలో జీ20 దేశాలే 75-80శాతం విడుదల చేస్తున్నాయి. వీటిని వీలైనంతమేర సున్నాస్థితికి తీసుకెళ్ళాలన్న లక్ష్యాన్నే ‘నెట్‌ జీరో’గా వ్యవహరిస్తున్నారు. 2050 నాటికల్లా ఈ లక్ష్యాన్ని సాధించాలని అభివృద్ధి చెందిన దేశాలు భారతదేశం మీద ఒత్తిడి తెస్తున్నాయి. భారత్‌ మాత్రం 2070 లక్ష్యానికే కట్టుబడి ఉంది. నిజానికి ప్యారిస్‌ ఒప్పందం ప్రకారం, భూతాపాన్ని పారిశ్రామిక యుగానికి ముందు స్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌కంటే తక్కువ స్థాయికి తీసుకురావాలి. అందుకోసం ఉద్గారాలను 2030 నాటికి ఇప్పుడున్న వాటిలో 45 శాతానికి తగ్గించి, 2050 నాటికి నెట్‌ జీరో లక్ష్యాన్ని సాధించాలి.

అగ్రరాజ్యాలన్నీ భారతదేశం మీదే అధికంగా దృష్టిసారిస్తూ నెట్‌ జీరో లక్ష్యాన్ని సాధించే విషయంలో తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నట్లు విదితమవుతోంది. కర్బన ఉద్గార వాయువులను అత్యధికంగా విడుదల చేస్తున్న జీ20 దేశాలు సమీప భవిష్యత్తులో ఏం చేయాలన్న అంశాన్ని- ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న భారతదేశమే ప్రస్తుత సమావేశాల్లో చర్చకు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ నేతృత్వంలో పలు దేశాల మంత్రులతో సమావేశమయ్యారు. వాటిలో అమెరికా, ఐరోపా సమాఖ్య దేశాల ప్రతినిధులూ పాల్గొన్నారు. భారతదేశం 2050 నాటికి నెట్‌ జీరో లక్ష్యాన్ని సాధించడంపై ప్రధాని మోదీ జీ20 శిఖరాగ్ర సదస్సులో ప్రకటిస్తే, అదొక అద్భుతమైన ప్రకటన అవుతుందన్న అభిప్రాయాన్ని ఆ సమావేశాల్లో అగ్రరాజ్యాల ప్రతినిధులు వ్యక్తం చేశారు. అయితే, భారత్‌ మాత్రం అధికారికంగా అలాంటి ప్రకటన చేసే ఉద్దేశంతో ఉన్నట్లు కనిపించడం లేదు.

ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యంగా జీవనశైలి మార్పులతో పర్యావరణ పరిరక్షణ ఎలా సాధ్యమన్న అంశాన్ని ప్రస్తావించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా హరిత భవనాల నిర్మాణంపై అన్ని దేశాలూ దృష్టి సారించాలని సూచించనున్నారు. తద్వారా విద్యుత్‌ పరికరాల వినియోగం గణనీయంగా తగ్గుతుంది. ఇళ్ల పైకప్పుల మీద సౌర విద్యుత్‌ ఫలకాల ఏర్పాటుతో చాలావరకు బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తిని తగ్గించుకోవచ్చు. ఈ విషయంలో ప్రజలకు ప్రోత్సాహకాలు ఇస్తున్న తీరు, సౌర విద్యుత్తు కేంద్రాల ఏర్పాటు దిశగా భారత్‌ చేపట్టిన చర్యలను ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఈ దిశగా ముందడుగు వేయాలని, తద్వారా నెట్‌ జీరో లక్ష్యానికి చేరువవ్వాలని పిలుపు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును ఉత్పత్తి చేస్తామని భారత్‌ గతంలో హామీ ఇచ్చినా, 125 గిగావాట్లు సాధించింది. ఈ క్రమంలో 2030 నాటికి 500 గిగావాట్ల ఉత్పత్తిని సాధిస్తామని ప్రకటించే అవకాశముంది. అమెరికాలాంటి అగ్రదేశాల్లో పారిశ్రామికీకరణ తదితర కారణాల వల్ల భూతాపం పెరుగుతున్న విషయాన్ని విస్మరించి, పేద దేశాలు బొగ్గుతో ఉత్పత్తి చేసే విద్యుత్తును తగ్గించాలని చెప్పడమూ అసమంజసంగానే భావించాల్సి ఉంటుంది.

 కామేశ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.