జానపద శిఖరం

తెలుగులో జానపద సాహిత్య పరిశోధన అనగానే తొలుత గుర్తుకొచ్చే పేరు ఆచార్య బిరుదురాజు రామరాజు. కవిగా, పరిశోధకులుగా, గ్రంథ పరిష్కర్తగా ఆయన బహుముఖ ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా జానపద గేయాలవిశిష్టతను సమాజానికి తెలియజెప్పడంలో ఆయన కృషి మరచిపోలేనిది.

Published : 16 Apr 2024 00:41 IST

తెలుగులో జానపద సాహిత్య పరిశోధన అనగానే తొలుత గుర్తుకొచ్చే పేరు ఆచార్య బిరుదురాజు రామరాజు. కవిగా, పరిశోధకులుగా, గ్రంథ పరిష్కర్తగా ఆయన బహుముఖ ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా జానపద గేయాలవిశిష్టతను సమాజానికి తెలియజెప్పడంలో ఆయన కృషి మరచిపోలేనిది. ఇది బిరుదురాజు రామరాజు శతజయంతి సంవత్సరం.

రవయ్యో శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్రలో ఆచార్య బిరుదురాజు రామరాజుకు విశిష్ట స్థానం ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు జానపద సాహిత్యంపై ఆయన తొలి సిద్ధాంత గ్రంథం వెలువరించారు. దక్షిణ భారతదేశంలోనే జానపద సాహిత్యంపై పరిశోధన చేసిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అక్షర జ్ఞానంలేని గ్రామీణులు అలవోకగా సృష్టించిన పాటలు, కథలు ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తుంటాయి. దీన్నే జానపద విజ్ఞానం అంటారు. ఇందులో మన ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు, జీవన విధానం వంటివి దాగుంటాయి. సహజ సుగంధాన్ని వెదజల్లే ఊహలు, తేనెలూరే మాటల తియ్యందనాలు జానపద సాహిత్యంలో కనిపిస్తాయి. తెలుగులో జానపద గేయసాహిత్యాన్ని సేకరించి నేదునూరి గంగాధరం వెలుగులోకి తెచ్చారు. ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు, చింతా దీక్షితులు, టేకుమళ్ళ కామేశ్వరరావు తదితరులు తమ వ్యాసాల ద్వారా జానపద సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేశారు. హరి ఆదిశేషువు ‘జానపద గేయ వాఙ్మయ పరిచయం’ రూపంలో పల్లె ప్రజల సాహిత్యాన్ని తొలిసారి పుస్తక రూపంలోకి తెచ్చారు. తద్వారా పరిశోధకులకు స్ఫూర్తి కలిగించారు. అనంతరం విశ్వవిద్యాలయ స్థాయిలో మొట్టమొదట జానపద గేయ సాహిత్యంపై బిరుదురాజు రామరాజు పరిశోధన చేశారు.

వరంగల్‌ జిల్లా దేవనూరు గ్రామంలో నారాయణ రాజు, లక్ష్మీదేవి దంపతులకు 1925 ఏప్రిల్‌ 16న బిరుదురాజు రామరాజు జన్మించారు. తాతముత్తాతలు పండితులు కావడంతో సాహిత్య వాతావరణంలో పెరిగారు. పాఠశాలలో చదివే రోజుల్లో గ్రంథాలయాల్లో పుస్తకాలను ఆసక్తిగా చదివేవారు. క్రమంగా తాళపత్ర గ్రంథ సేకరణ, శాసనాల పఠనంపట్ల ఆసక్తి పెంచుకున్నారు. తెలుగు సాహిత్యంపై మక్కువతో పరిశోధనవైపు అడుగులు వేశారు. పండిత కుటుంబంలో జన్మించినా క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి పామరజనం పాడుకొనే పల్లెపదాలను రామరాజు సేకరించారు. వాటిని అధ్యయనం చేసి ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం మార్గదర్శకత్వంలో ‘తెలుగు జానపద గేయ సాహిత్యం’ అనే సిద్ధాంత గ్రంథాన్ని 1956లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించారు.
రామాయణ, భారత, భాగవత సంబంధ, చారిత్రక గేయాలు, స్త్రీల, పిల్లల పాటలు తదితర పదహారు విభాగాలుగా జానపదుల గేయాలను రామరాజు తన గ్రంథంలో వర్గీకరించారు. వాటి విశిష్టతను చక్కగా వివరించారు. ఇందులో ప్రతి అధ్యాయం తరవాతి కాలంలో ఎన్నో సిద్ధాంత గ్రంథాలకు మార్గదర్శకంగా నిలిచింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులుగా, తెలుగు శాఖాధ్యక్షులుగా, డీన్‌గా రామరాజు సేవలందించారు. తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల్లో ఆయన విశేష కృషి చేశారు. పెద్ద సంఖ్యలో గ్రంథాలు రాశారు. చరిత్రకెక్కని చరితార్థులు, మరుగున పడిన మాణిక్యాలు, తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు, యక్షగాన వాఙ్మయం, తెలంగాణ పల్లె పాటలు, తెలంగాణ పిల్లల పాటలు వంటివి వాటిలో ఉన్నాయి. గ్రంథ పరిష్కరణ, శాసన వాఙ్మయం, తాళపత్ర గ్రంథ సేకరణకు పాటుపడ్డారు. 2010లో బిరుదురాజు రామరాజు కన్నుమూశారు.

ప్రపంచ జానపద విజ్ఞానంపై 170 ఏళ్లకు పైగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. సమాజం ఆధునికం అవుతున్నకొద్దీ జానపద సాహిత్యం క్రమంగా తెరమరుగు అవుతోంది. ప్రస్తుతం మనం ఎంతగా అభివృద్ధి చెందినా, పూర్వీకుల అడుగుజాడలను, వారి జీవన మధురిమను, మనవైన సంస్కృతీ సంప్రదాయాలను మరచిపోకూడదు. ఈ క్రమంలో అనంతమైన జానపద సాహిత్యాన్ని రికార్డు చేసి పుస్తకరూపంలో ముద్రించి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం పరిశోధకులు, విశ్వవిద్యాలయాలు కృషి చేయాలి. ప్రభుత్వాలు సైతం జానపద సాహిత్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. గ్రంథ ముద్రణకు సరైన నిధులు కేటాయించాలి. తెలుగునాట విశ్వవిద్యాలయ స్థాయిలో జానపదానికి ప్రవేశం కల్పించినవారు బిరుదురాజు రామరాజు. ఆయన స్ఫూర్తితో భావి పరిశోధకులు జానపద విజ్ఞానంపై మరింత దృష్టి సారించి దాని వైశిష్ట్యాన్ని రాబోయే తరాలకు తెలియజెప్పాలి.

డాక్టర్‌ సగిలి సుధారాణి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.