కాటేస్తున్న కల్తీ మద్యం

పారిశ్రామిక మద్యం ఉత్పత్తిపై నియంత్రణ అధికారం రాష్ట్రాలదా, కేంద్రానిదా అన్నదానిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు సాగుతున్నాయి. ఈ మద్యం దుర్వినియోగం అవుతున్నందువల్ల భారత్‌లో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పారిశ్రామిక రసాయనాలతో తయారయ్యే కల్తీ మద్యం కట్టడికి కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా కృషి చేయాలి.

Published : 20 Apr 2024 00:52 IST

పారిశ్రామిక మద్యం ఉత్పత్తిపై నియంత్రణ అధికారం రాష్ట్రాలదా, కేంద్రానిదా అన్నదానిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు సాగుతున్నాయి. ఈ మద్యం దుర్వినియోగం అవుతున్నందువల్ల భారత్‌లో ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పారిశ్రామిక రసాయనాలతో తయారయ్యే కల్తీ మద్యం కట్టడికి కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా కృషి చేయాలి.

పారిశ్రామిక మద్యాన్ని ఔషధాలు, క్రిమిసంహారకాలు, రసాయనాలు, జీవ ఇంధనాలు తదితరాల తయారీలో వాడతారు. మత్తు కలిగించే ఈ రసాయనం దుర్వినియోగం కాకుండా బెంజీన్‌, ఎసిటోన్‌ తదితరాలను కలుపుతారు. దానివల్ల రంగు, రుచి మారతాయి. తాగడానికి ఇది ఏమాత్రం పనికిరాదు. కానీ, అక్రమార్కులు పారిశ్రామిక ఇథనాల్‌, మిథనాల్‌ మిశ్రమంతో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. దేశంలో చట్టబద్ధంగా విక్రయించే మద్యం ధరలు ఇటీవలి కాలంలో భారీగా పెరిగాయి. దాంతో పేదలు తక్కువ ధరకు దొరికే కల్తీ మద్యం వైపు మొగ్గుచూపుతున్నారు.

సాధారణంగా మొలాసిస్‌, గోధుమ, బార్లీ, ద్రాక్ష తదితరాలను పులియబెట్టి, మరగబెట్టి మద్యాన్ని తయారుచేస్తారు. దేశంలో చాలా చోట్ల కృత్రిమంగా మద్యాన్ని తయారు చేస్తున్నట్లు నిరుడు ఓ అధ్యయనం తేల్చింది. దీనికి కావాల్సిన పారిశ్రామిక ఇథైల్‌ ఆల్కహాల్‌, విషపూరిత మిథనాల్‌లు గుజరాత్‌ తదితర రాష్ట్రాల నుంచి వస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో తేలింది. కట్టలు తెంచుకుంటున్న కల్తీ మద్యం వల్ల 2016-20 మధ్య కాలంలో దేశీయంగా ఏడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. పారిశ్రామిక మద్యం దుర్వినియోగం, కల్తీ మాఫియా పీచమణచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే దీనికి కారణం. ప్రజారోగ్యాన్ని కబళిస్తున్న ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా నడుం బిగించాలన్న సుప్రీంకోర్టు తాజా సూచన శిరోధార్యం.

భారత్‌లో ప్రభుత్వాల ఆదాయాల్లో పది శాతానికి పైగా ఎక్సైజ్‌ పన్ను ద్వారానే సమకూరుతోందని పరిశీలనలు చెబుతున్నాయి. అందుకే అత్యధిక రాష్ట్రాలు మద్యపాన నిషేధం ఊసెత్తడం లేదు. ఈ విధానాన్ని అమలుచేస్తున్న బిహార్‌, గుజరాత్‌, నాగాలాండ్‌, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌లు ఎదుర్కొంటున్న సవాళ్లెన్నో. సరిహద్దు రాష్ట్రాల నుంచి తరలివచ్చే అక్రమ మద్యాన్ని అక్కడి అధికారులు కట్టడి చేయలేకపోతున్నారు. దాన్ని సేవించిన పేదలు పిట్టల్లా రాలిపోతున్నారు. 2016లో మద్యపానాన్ని నిషేధించిన బిహార్‌కు పొరుగు రాష్ట్రాల నుంచి ఏడాది వ్యవధిలో నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన అక్రమ మద్యం తరలివచ్చినట్లు తేలింది. రెండేళ్ల క్రితం బిహార్‌లోని సారణ్‌ జిల్లాలో కల్తీ మద్యం తాగి 65 మంది మరణించారు. ఈ ఘటన ఆ రాష్ట్ర అసెంబ్లీని కుదిపేసింది. ఈ తరహా మరణాల్లో పంజాబ్‌ది దేశంలోనే రెండో స్థానమని జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) లెక్కలు వెల్లడిస్తున్నాయి. 2020లో కల్తీ మద్యం వల్ల పంజాబ్‌లోని మూడు జిల్లాల్లో 113 మంది మృతి చెందారు. గుజరాత్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఝార్ఖండ్‌, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలోనూ ఇలాంటి మరణాలు అధికమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రెండేళ్ల క్రితం వెల్లడించింది. కల్తీ మద్యం కోరల్లో చిక్కి దేశీయంగా ఏటా వెయ్యి మంది బలవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. బ్రాండెడ్‌ మద్యాన్నీ స్పిరిట్‌తో కల్తీ చేస్తున్న ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో వెలుగు చూశాయి.

ప్రభుత్వ నివేదికల ప్రకారం దేశంలో కల్తీ మద్యానికి బలయ్యే వారంతా పేదలే. ప్రాణాంతక రసాయనాలు కలిసిన మద్యం తాగడం వల్ల కాలేయం, గుండె, జీర్ణకోశం వంటి కీలక అవయవాలు దెబ్బతింటాయి. క్యాన్సర్లు చుట్టుముడతాయి. అటువంటి వారికి వైద్యం చేయించడం కోసం చాలా కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. కల్తీ మద్యానికి అలవాటుపడి ఇంటి పెద్దదిక్కు అర్ధాంతరంగా మరణిస్తుండటంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దాంతో మరో దారి లేక కుటుంబ పోషణ కోసం పిల్లలు చదువులకు స్వస్తి చెప్పి పనిబాట పట్టాల్సి వస్తోంది. ఇటువంటి దుస్థితిని తప్పించాలంటే, కల్తీ మద్యం మాఫియాపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలి. అంతర్రాష్ట్ర తనిఖీ బృందాలను మరింతగా పటిష్ఠం చేయాలి. పారిశ్రామిక మద్యం పక్కదారి పట్టకుండా జిల్లాల స్థాయిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. అక్రమార్కులకు కఠిన శిక్షలు, జరిమానాలు పడేలాగా చట్టాలను పదును తేల్చాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు మద్యం ఆదాయంపై ఆధారపడటాన్ని తగ్గించాలి. మద్యం అలవాటు నుంచి ప్రజలను బయటపడేసేందుకు సమాజంలో విస్తృత అవగాహన కల్పించాలి.

మాడుగుల గోపయ్య

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.