ధ్రువీకరణ పత్రాలకు డిజిటల్‌ భద్రత

నూతన జాతీయ విద్యావిధానం భారతీయ చదువుల రంగంలో విప్లవాత్మక మార్పులకు తెర తీసింది. ఈ క్రమంలో విద్యార్థుల ప్రతిభను గుర్తించడానికి మార్కుల స్థానంలో క్రెడిట్‌ విధానాన్ని, డిజీలాకర్‌ సదుపాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

Published : 04 May 2024 00:09 IST

నూతన జాతీయ విద్యావిధానం భారతీయ చదువుల రంగంలో విప్లవాత్మక మార్పులకు తెర తీసింది. ఈ క్రమంలో విద్యార్థుల ప్రతిభను గుర్తించడానికి మార్కుల స్థానంలో క్రెడిట్‌ విధానాన్ని, డిజీలాకర్‌ సదుపాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

భారతీయ విద్యావ్యవస్థలో మార్కులకు ఎనలేని ప్రాధాన్యముంది. పరీక్షల్లో విద్యార్థులు రాసిన జవాబులకు మార్కులు కేటాయించడం ద్వారా వారిని ఉత్తీర్ణులుగా, అనుత్తీర్ణులుగా నిర్ధారించే విధానం చాలాకాలంగా అమలవుతోంది. నేడు మార్కుల స్థానంలో అకడమిక్‌ క్రెడిట్స్‌ వస్తున్నాయి. ఇప్పుడు విద్యార్థులు సాధించే క్రెడిట్సే వారి ప్రతిభకు కొలమానం. పూర్వ ప్రాథమిక విద్య నుంచి పీహెచ్‌డీ కోర్సుల వరకు వారు సాధించిన క్రెడిట్స్‌ వివరాలను సాంకేతికంగా భద్రపరచడానికి కేంద్ర మాధ్యమిక విద్యామండలి (సీబీఎస్‌ఈ) ‘అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ (డిజీలాకర్‌)’ విధానాన్ని రూపొందించింది. దాని ప్రకారం, పాఠశాల విద్య మొదలు పీహెచ్‌డీ వరకు మొత్తం ఎనిమిది స్థాయుల్లో(లెవెల్స్‌లో) విద్యార్థులకు క్రెడిట్స్‌ కేటాయిస్తారు. పాఠశాల విద్యకు 4 స్థాయులు, అండర్‌ గ్రాడ్యుయేషన్‌కు 6.5 స్థాయులు ఉంటాయి. మాస్టర్‌ డిగ్రీని ఏడో స్థాయిగా, పీహెచ్‌డీని ఎనిమిదో స్థాయిగా పరిగణిస్తారు. ఈ విధానంలో దేశవ్యాప్తంగా ఒకే విధానంలో మార్కులను కేటాయిస్తారు. అమెరికా, ఆస్ట్రేలియాలతో పాటు పలు ఐరోపా, ఆసియా దేశాల్లో ఈ విధానం అమలవుతోంది. దీన్ని అన్ని దేశాల్లోనూ అమలుచేస్తే అంతర్జాతీయ స్థాయిలో ఏకీకృత విధానం ఉన్నట్లవుతుంది. విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు వృత్తి విద్య , నైపుణ్య విద్య, బ్రిడ్జ్‌ కోర్సులు, ఆన్‌లైన్‌ కోర్సులు చదివి క్రెడిట్స్‌ పెంచుకోవచ్చు. భారతీయ సంప్రదాయ నైపుణ్యాలు, సంగీతం, క్రీడలు, కళలను నేర్చుకునే వారికీ క్రెడిట్స్‌ ఇస్తారు. సంప్రదాయ కళలు కనుమరుగవుతున్న నేపథ్యంలో విద్యార్థులు భారతీయ మూలాలను తెలుసుకుని, వాటిని సజీవంగా ఉంచేందుకు ఈ క్రెడిట్స్‌ దోహదపడతాయంటున్నారు. అంతేకాదు, విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాలలో విద్యను అభ్యసించడం ద్వారా అదనపు క్రెడిట్స్‌ సంపాదించుకోవచ్చు. అంతేకాదు, తమకు నచ్చిన కోర్సును ఎంపిక చేసుకున్న విద్యాసంస్థలో అభ్యసించే అవకాశం కలుగుతుంది. కోర్సు నుంచి మధ్యలో నిష్క్రమించి, కొంత విరామం తరవాత మళ్ళీ కొనసాగించే అవకాశమూ ఉంటుంది. ఇప్పటికే అమలవుతున్న ఇంటర్న్‌షిప్‌, ఒలింపియాడ్‌లు, క్విజ్‌ తదితరాలకు సైతం క్రెడిట్స్‌ కేటాయిస్తారు. ఈ విధానంవల్ల విద్యార్థులు తమకు ఆసక్తిలేని కోర్సులను విడిచిపెట్టి, ఇష్టమైన అంశాలను ఎంపికచేసుకోవచ్చు. దాంతో విద్యార్థులు ఒత్తిడికి గురికావడమనేది ఉండదు. తమకు ఇష్టమైన అంశాలనే ఎంపిక చేసుకుంటారు కాబట్టి వాటిని ఆసక్తితో నేర్చుకుని, సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. బట్టీ పట్టి మార్కులు తెచ్చుకోవడానికి బదులు అభ్యసన సామర్థ్యాలను, నైపుణ్యాలను మెరుగుపరచుకుంటారు. కాబట్టి నేర్చుకునే పాఠ్యాంశాలకు, మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలకు మధ్య అంతరం తగ్గుతుంది. కొత్త విధానంలో విద్యార్థులు సాధించిన క్రెడిట్స్‌ను ఆధార్‌తో అనుసంధానించి ‘అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ (డిజీలాకర్‌)’లో భద్రపరుస్తారు. దాంతో వారు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నించడం సులభమవుతుంది. ధ్రువీకరణ పత్రాలు కనిపించకుండా పోయినా, చినిగిపోయినా ఇబ్బంది ఉండదు. ఒకసారి డిజిటల్‌ రూపంలో ధ్రువీకరణ పత్రాలను భద్రపరిస్తే అవి ఎన్నేళ్లయినా అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమకు ఇచ్చిన పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వాటిని పొందవచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యావ్యవస్థ, అధిక జనాభా కలిగిన ఇండియాలో కొత్త విధానాన్ని అమలుచేయడానికి ఎంతో నేర్పు అవసరం. ముఖ్యంగా డిజీలాకర్‌లో విద్యార్థుల వివరాలు, మార్కులు, ధ్రువీకరణ పత్రాలను అత్యంత గోప్యంగా, భద్రంగా కాపాడేందుకు పటిష్ఠ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. క్రెడిట్‌ విధానంలో బోధన, మూల్యాంకనంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి. తల్లిదండ్రులకు సైతం ఈ విధానంపై అవగాహన కలిగించాలి. డిజీలాకర్‌తో అనుసంధానం ఏర్పరచడం కోసం దేశంలోని గ్రామీణ ప్రాంతాలన్నింటికీ అంతర్జాల సదుపాయాన్ని చేరువ చేయాలి. ప్రభుత్వ విద్యాసంస్థలతో అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను అనుసంధానించాలి. ఎన్నో ప్రయోజనాలున్న ఈ క్రెడిట్‌-డిజీలాకర్‌ విధానం ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమష్టి కృషితోనే విజయవంతమవుతుంది.

ప్రొఫెసర్‌ గుజ్జు చెన్నారెడ్డి
(నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యులు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.