ప్రజాస్వామ్యానికి వేరుపురుగు

పిట్టలదొర మాటలకూ జగన్‌మోహన్‌ రెడ్డి ఉపన్యాసాలకూ పెద్ద తేడా ఉండదన్నది ఏపీ ప్రజానీకం ప్రగాఢ విశ్వాసం. అది అబద్ధం కాదని జగన్‌ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ ఉంటారు. రాష్ట్రమంతా ఛీత్కరిస్తున్నా సరే- చేతిలోకి మైకు రాగానే తనను తాను పొగుడుకోవడానికి జగన్‌ ఏమాత్రం మొహమాటపడరు.

Published : 05 May 2024 00:28 IST

పిట్టలదొర మాటలకూ జగన్‌మోహన్‌ రెడ్డి ఉపన్యాసాలకూ పెద్ద తేడా ఉండదన్నది ఏపీ ప్రజానీకం ప్రగాఢ విశ్వాసం. అది అబద్ధం కాదని జగన్‌ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ ఉంటారు. రాష్ట్రమంతా ఛీత్కరిస్తున్నా సరే- చేతిలోకి మైకు రాగానే తనను తాను పొగుడుకోవడానికి జగన్‌ ఏమాత్రం మొహమాటపడరు. గతంలో ఎవరూ చేయని పాలనను చేసి చూపించానని, ఎన్నో విప్లవాలను తీసుకొచ్చానని ఆయన ఈమధ్య రొమ్ము విరుచుకుని సెలవిస్తున్నారు. రాష్ట్రం నడుము విరగ్గొట్టే అప్పుల గుదిబండ బరువును రూ.10.75 లక్షల కోట్లకు చేర్చడం జగన్‌కు తప్ప ఇంకెవరికైనా సాధ్యపడిందా? ఏపీలో పాలుతాగే పసిపిల్లల నుంచి ప్రతిఒక్కరి నెత్తి మీద దాదాపు రెండు లక్షల రూపాయల అప్పు కత్తిని వేలాడదీసిన వీరుడెవ్వరు... వైకాపా అధినేతే కదా! తన తెలివి అంతా ఉపయోగించి కనిపించినదాన్నల్లా తాకట్టుపెట్టేసి రాష్ట్రాన్ని రుణాంధ్రగా తయారుచేసిన జగన్‌తో పోటీపడే సత్తా పాత పాలకులకు ఎక్కడుంది? ఏపీ ఆర్థిక పరిస్థితిని కుక్కలు చింపిన విస్తరిగా చేయడమైతే జగన్‌కు తప్ప మరొకరికి సాధ్యమే కాదు. కాబట్టి గతంలో ఎవరూ చేయని రాక్షస పాలనను వైకాపా అధినాయకుడు చేసి చూపించారన్నది నిజం. అంతకుమించి ఆయన ఆత్మస్తుతిలో వాస్తవాలేమీ లేవు.

‘జగన్‌ ఎలాంటివాడో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకూ తెలుసు’ అన్నది ఏపీ సీఎం సాబ్‌ మాట! అరచేతి పుండుకు అద్దం అవసరం లేదు. రాష్ట్రానికి రాచపుండైన జగన్‌ గురించి పేదలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయిదు రూపాయలకు అన్నంపెట్టిన ‘అన్న’ క్యాంటీన్లపై పగబట్టిన జగన్‌మోహన్‌ రెడ్డి వ్యక్తిత్వం ఎలాంటిదో పేదలకే బాగా తెలుసు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రారంభించిందన్న ఏకైక కారణంతో- రోజుకు రెండున్నర లక్షల మంది కడుపు నింపిన ‘అన్న’ క్యాంటీన్లను పట్టుబట్టి మూసేయించిన ‘మహా మానవతావాది’ జగనన్న! ఆ విధంగా పురాణాల్లో కనపడే రాక్షసులకు సరిజోడుగా నిలిచిన వైకాపా అధినేత వంటి నేతాజాతిరత్నం రాష్ట్ర చరిత్రలో మరొకరు లేనేలేరు. బహుశా భవిష్యత్తులో వేరొకరు రారు. చెత్తపన్నులతో చావచితక్కొట్టడం, కరెంటూ ఆర్టీసీ ఛార్జీల బాదుడుతో జేబులకు అంటకత్తెర వేయడం వంటివి పేదలపై జగన్‌కు ఉన్న ‘ప్రేమ’కు తిరుగులేని నిదర్శనాలు. కడుపు నిండిన తరవాత జలగలన్నా రక్తం పీల్చడం మానేస్తాయేమో కానీ- పన్నుల రూపంలో జనం రక్తమాంసాలను పిండేసే కర్తవ్యాన్ని మాత్రం జగన్‌ సర్కారు ఏనాడూ విస్మరించలేదు. అదనపు పన్నులూ ఛార్జీల రూపేణా అయిదు కోట్ల ఆంధ్రుల నుంచి అయిదేళ్లలో లక్ష కోట్ల రూపాయలకు పైగా లాగేసిన వైకాపాధీశుడి గురించి ఏమి చెప్పాలి? ‘అంతా జగన్మయం... జనమంతా భయం భయం... జనధనమంతా మాయం మాయం’ అంటూ పాటందుకోవాలేమో!

అసలు విప్లవం అంటే ఏమిటి? దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పేదజనం పిడికిలి బిగించడం. ఆర్థిక అసమానతలను తొలగించి సమసమాజాన్ని స్థాపించడం. పిడికిలి బిగించిన చేతులకు బేడీలు వేయించడంలో జగన్‌ యమ దిట్ట.   ఇక అధికార దండం చేతపట్టుకుని పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి, పరిశ్రమలను వెళ్ళగొడితే- రాష్ట్రంలో ఉపాధే ఉండదు. జనానికి ఆదాయాలే లేనప్పుడు ఇక అసమానతలన్న సమస్యే రాదు. సీఎంగా జగన్‌ అదే పని చేశారు.పెద్ద గడ్డపార పట్టుకుని రాష్ట్ర పారిశ్రామిక ఆదాయానికి గండి కొట్టేశారు. అందుకే జనం ఆయనకు పోటీపడి శాపనార్థాలు పెడుతున్నారు. చదువుకున్న పిల్లలను నిరుద్యోగులుగా మిగిల్చేసి ఎన్నో కుటుంబాల కడుపు కొట్టిన కర్కోటకుడని తిట్టుకుంటున్నారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అంటూ ఊరించి సర్కారీ కొలువుల భర్తీని అటకెక్కించి యువత ఉసురుపోసుకున్న  నిరంకుశుడిగా జనం ఆయనను అసహ్యించుకుంటున్నారు. ఏతావతా, జగన్‌ తెచ్చిన విప్లవం ఏంటంటే- వినాశనమే!  అభివృద్ధికి సమాధికట్టి సామాన్య జనం బతుకుల్లో నిప్పులు పోయడమే. అయినా తాడేపల్లి ప్యాలెస్‌ ప్రభువుకు చింతలేదు... ఆయన కొట్టుకునే సొంతడబ్బాలకు  అంతూపొంతూ అసలే లేదు.

‘మీ బిడ్డ... మీ బిడ్డ ప్రభుత్వం...’ అంటూ జగన్‌- కోసిన సొరకాయ కోతలే మళ్ళీ మళ్ళీ కోస్తూ ఉంటారు కదా. అవేమీ ఊకదంపుడు ఉపన్యాసాలు కావని, వాటిలో ఓ లోగుట్టు ఉందని యావత్‌ రాష్ట్రం కోడైకూస్తోంది. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులన్నీ బిడ్డలకే కదా చెందుతాయి... ఆ విధంగా లాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌తో జనం భూములన్నీ జగన్‌ గుప్పిట్లోకి పోతాయని ఊరూవాడా వణికిపోతున్నాయి. ఇప్పటికే విశాఖలో వేల కోట్ల రూపాయల విలువైన భూములన్నీ వైకాపా నేతాశ్రీల పొట్టల్లోకి పోయాయి. ఆ ఒక్క నగరం అనేముంది... ఏపీలో ఏ జిల్లాకు వెళ్ళినా కబ్జాల కబడ్డీలో ఆరితేరిన  జగన్‌ భక్తశిఖామణులెందరో కనపడతారు. అరాచక నిబంధనలు అన్నింటినీ ఒక్కచోటకు చేర్చి వైకాపా సర్కారు తయారుచేసిన లాండ్‌ టైటిలింగ్‌ చట్టంతోనైతే- తమ స్థిరాస్తులన్నీ ‘భూ’చోళ్ల పరమవుతాయని రాష్ట్ర ప్రజానీకం బెంబేెలెత్తిపోతోంది. అయినాసరే- వైకాపా అధినాయకులుంగారు ఏమంటున్నారు? ‘జగన్‌ భూములిచ్చేవాడే కానీ...’ అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. అదే కదా అసలు సమస్య... ఆయన ఎవరి భూములు ఎవరికి ధారాదత్తం చేయాలనుకుంటున్నారో అనేకదా ఇప్పుడు జనవాహిని హడలెత్తిపోతోంది.

‘అబద్ధాలాడను... మోసం చేయను’ అన్నది శ్రీశ్రీశ్రీ జగన్‌మోహన్‌ రెడ్డి దొరవారి నోటివెంట రాలిన మరో ఆణిముత్యం. మద్యనిషేధం చేస్తానని చెప్పి చేయకపోవడం- జగన్‌ పచ్చిమోసాల్లో మొదటిది. కాలకూట విషాన్ని మందుబాటిళ్లలో పెట్టి అమ్మినట్టు- దిక్కుమాలిన బ్రాండ్ల మద్యంతో జనారోగ్యాన్ని సర్వనాశనం చేయడం- దగాకోరుతనమే కాదు, ప్రజాద్రోహం కూడా! ఇక సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేస్తానని చెప్పి పోలవరంతో పాటు మిగిలిన వాటినీ పాడుపెట్టడమైతే- రైతుల బాగోగుల పట్ల  ఏమాత్రం పట్టింపు లేని జగన్‌ అధ్వాన పాలనకు ప్రబల సాక్ష్యం. జగన్‌ పాపాలచిట్టాను ఏకరువు పెడితే కొండవీటి  చాంతడంతవుతుంది.ఇవేమీ జనానికి గుర్తులేవు అనుకుంటారో ఏమో కానీ-  మాయదారి కబుర్లెన్నో చెబుతుంటారు జగన్‌. ఒకపక్క  చేసిన వాగ్దానాలన్నింటినీ కృష్ణా గోదావరుల్లో కలిపేసి- మరోవైపు తాను మాట తప్పే మనిషిని కానని నిర్లజ్జగా బొంకుతుంటారు. ‘పాలకుడికి మంచి మనసు ఉండి మంచి చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఆ పాలకుడు మోసగాడు అయితే మన బతుకులు అంధకారం అవుతాయి’ అన్నది మీరే కదా జగన్‌జీ? గడచిన అయిదేళ్లలో ఈ విషయం రాష్ట్ర ప్రజలకు చాలాబాగా అర్థమైంది. పోలీసులను వెంటేసుకుని అడ్డొచ్చినవారి మక్కెలిరగదీసిందెవరు? దళితులపై అరాచకాలు, మహిళలపై అఘాయిత్యాలకు అంతులేని స్వేచ్ఛ ఇచ్చిందెవరు? రోడ్ల మీది గుంతలను కూడా పూడ్పించకుండా ఎందరో ఆడబిడ్డల సౌభాగ్యాన్ని నేలరాసిందెవరు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు జవాబు ఒక్కటే... అది జగనే అన్నది జనానికి తెలుసు. తమ బతుకుల్లో చీకటి నింపిన అరాచక రాజ్యాన్ని ఓటు అనే బ్రహ్మాస్త్రంతో కూల్చిపారేయడం ఎలాగో ప్రజలకు ఇంకా బాగా తెలుసు!

శైలేష్‌ నిమ్మగడ్డ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.