ఈ-ఓటింగ్‌తో సులభతర ఎన్నికలు

సుమారు 97 కోట్ల మంది ఓటర్లు. 55 లక్షలకుపైగా ఓటింగ్‌ యంత్రాలు. పది లక్షలకుపైగా పోలింగ్‌ కేంద్రాలు. కోటిన్నర మందికిపైగా సిబ్బంది. వేల సంఖ్యలో సభలు. తండోపతండాలుగా జనాల తరలింపు. లక్ష కోట్ల రూపాయల  ఖర్చు. దేశంలో ఇంతటి భారీ వ్యయప్రయాసలతో కూడిన సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ మరింత సులభతరం కావాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 24 May 2024 06:46 IST

సుమారు 97 కోట్ల మంది ఓటర్లు. 55 లక్షలకుపైగా ఓటింగ్‌ యంత్రాలు. పది లక్షలకుపైగా పోలింగ్‌ కేంద్రాలు. కోటిన్నర మందికిపైగా సిబ్బంది. వేల సంఖ్యలో సభలు. తండోపతండాలుగా జనాల తరలింపు. లక్ష కోట్ల రూపాయల  ఖర్చు. దేశంలో ఇంతటి భారీ వ్యయప్రయాసలతో కూడిన సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ మరింత సులభతరం కావాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మన దేశంలో ఎన్నికల ప్రక్రియ ఓ భారీ ప్రహసనం. దాదాపు మూడు నెలలపాటు దేశం మొత్తం ఎన్నికలపైనే దృష్టి పెడుతుంది. కేంద్రంలో, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, మంత్రులు, అధికారులు ఎన్నికల క్రతువు పూర్తిచేసే పనిపైనే ఉంటారు. పోలింగ్‌ నిర్వహణకు ప్రత్యేకంగా ఎన్నికల సంఘం ఉన్నా, క్షేత్రస్థాయిలో బాధ్యతలన్నీ మోసేది ప్రభుత్వ అధికార యంత్రాంగమే. వీటికి తోడు ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులు, భద్రతా బలగాల మోహరింపు. ఎన్నికల నియమావళి పేరిట ప్రభుత్వ కార్యకలాపాలు, అధికారిక కార్యక్రమాలు స్తంభిస్తాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికార యంత్రాంగం వైపునుంచి ఈ స్థాయిలో కసరత్తు జరుగుతున్నా పోలింగ్‌ పూర్తిస్థాయిలో నమోదు కావడం లేదు.

జనజీవనానికి ఆటంకం

మరోవైపు, రాజకీయ పక్షాలు ఎన్నికల ప్రచారం పేరిట గ్రామాలు, పట్టణాలు, నగరాలు, గల్లీలు, కూడళ్లను హోరెత్తించడం... పేదలు, యువత, వృద్ధులు, మహిళలు పనులన్నీ పక్కనపెట్టి ఎన్నికల సంరంభంలో పాలుపంచుకోవడం మామూలే. భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, ఇతరత్రా ప్రచార కార్యక్రమాలతో జనజీవనం స్తంభించిపోతోంది. ఉత్పత్తి కార్యకలాపాలకూ ఆటంకం ఏర్పడుతోంది. పెద్దసంఖ్యలో ఉపయోగించే వాహనాలతో భారీ స్థాయిలో చమురు వినియోగమై వాతావరణంపైనా ప్రభావం పడుతోంది. ప్రచార సామగ్రి కోసం ప్లాస్టిక్‌ పదార్థాల వినియోగం పర్యావరణానికి కీడు వాటిల్లజేస్తోంది. ప్రచారం కోసం వాడే మైకులు, డీజేలతో శబ్ద కాలుష్యమూ పెచ్చరిల్లుతోంది. ర్యాలీల సందర్భంగా ట్రాఫిక్‌ జామ్‌లతో అవస్థలు పెరుగుతున్నాయి. డబ్బులు మంచినీళ్ల మాదిరిగా ఖర్చయిపోతున్నాయి. భారీ సభలు, ర్యాలీలతో దైనందిన జీవితాలకు ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితుల్లో, వాటిలో పాల్గొనే జనసంఖ్యపై పరిమితులు విధించాలి. ప్రచార కార్యక్రమాలకు నిర్దిష్ట వేళల్ని నిర్దేశించాలి. ఆర్థిక వ్యయం, మానవ వనరులు, నిర్వహణ భారం, వ్యవస్థల మోహరింపు తదితర అంశాలెన్నో భారీస్థాయిలో జతచేరితే తప్ప ఎన్నికలు విజయవంతంగా పూర్తికాని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో మెరుగైన ప్రత్యామ్నాయ మార్గాల దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఈ-ఓటింగ్‌ ప్రక్రియను అమలు చేసే దిశగా యోచించాలి. కృత్రిమ మేధ, వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ అందుబాటులోకి వచ్చిన పరిస్థితుల్లో, ఐటీ రంగంలో దిగ్గజం వంటి భారత్‌కు ఇది పెద్ద కష్టమేమీ కాదు. ఈ-ఓటర్‌ కార్డులు జారీ చేయడం ద్వారా ఓటర్లు తామున్న చోటు నుంచే పోలింగ్‌ ప్రక్రియలో పాల్గొని ఓటు వేసే అవకాశం కల్పించాలి. దీనివల్ల యువతకు ఉద్యోగావకాశాల కల్పన సైతం జరుగుతుంది. ప్రచారం పేరిట విద్వేష పూరిత వ్యాఖ్యలు, డబ్బుల పంపిణీ, తాయిలాల పంపకం వంటి అప్రజాస్వామిక కార్యకలాపాలకూ అడ్డుకట్ట వేయవచ్చు.

ప్రత్యామ్నాయాల వైపు...

ఎన్నికల వేళ వ్యవస్థలకు ఆటంకాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవడానికి అధిక ప్రాధాన్యమివ్వాలి. ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని  సాధ్యమైనంత వరకు తక్కువగా వాడుకుంటూ, సాంకేతికతను అధికంగా వినియోగిస్తే ఈ దిశగా ముందడుగు పడుతుంది. డిజిటల్‌ భారత్‌ వైపు వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎన్నికలను సులభరీతిలో నిర్వహించుకోవడం అసాధ్యమేమీ కాదు. సామాన్యులకు సైతం డిజిటల్‌ చెల్లింపులను అలవాటు చేసిన భారత్‌- ఎన్నికల విషయంలోనూ అత్యున్నత సాంకేతికతను అందిపుచ్చుకోవాలనే వాదనలున్నాయి. పార్టీలు, నేతలు సైతం వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా లైవ్‌స్ట్రీమింగ్‌తో సభలు నిర్వహించవచ్చు. ఫేస్‌బుక్‌ తదితర మాధ్యమాల ద్వారా ఓటర్లను నేరుగా ఓట్లు కోరవచ్చు. సామాజిక మాధ్యమాల ద్వారా లక్షిత ఓటర్లతో వయసులవారీగా అనుసంధానమయ్యే అవకాశం మెరుగుపడుతుంది. పట్టణ, నగర ఓటర్ల విషయంలో ఇది మరింత ఉపయుక్తం. మనదేశంలో ఇప్పటికీ రాజకీయ నేతలు జనాలను పోగేసి ప్రసంగాలు చేసే సంప్రదాయ, మూస పద్ధతులే కొనసాగుతున్నాయన్న విమర్శలున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య బహిరంగ చర్చలు నిర్వహించడం ద్వారా తమ వాదనలను బలంగా వినిపిస్తూ, ఎదుటి పక్షం అజెండాను విశ్లేషణాత్మకంగా విమర్శించే ప్రక్రియ కొనసాగుతుంది. మనదేశంలో సైతం నియోజకవర్గాల స్థాయి నుంచే వివిధ పార్టీల అభ్యర్థులు, నేతల మధ్య ఆరోగ్యకర వాతావరణంలో చర్చలు నిర్వహించడం ద్వారా ప్రజలకు చేరువు కావచ్చు. దేశంలో ప్రజాజీవనానికి, ఆర్థిక, పాలన కార్యకలాపాలకు ఆటంకాలు తలెత్తని రీతిలో సాఫీగా ఎన్నికల ప్రక్రియను చేపట్టే ప్రత్యామ్నాయాల దిశగా అడుగులేయాల్సిన తరుణం ఆసన్నమైంది.

శ్రీనివాస్‌ దరెగోని

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.