అందుకే ఈ గింజలు తీసుకోవాలట..!

ప్రసవమయ్యాక బరువు పెరగడం.. జుట్టు ఊడిపోవడం.. ఇలాంటి శారీరక మార్పులు సహజమే. ఈ క్రమంలోనే తమ అందం, అధిక బరువు గురించి ఆందోళన చెందుతూ ఒత్తిడి-ఆందోళనలకు గురవుతుంటారు చాలామంది అతివలు.

Published : 01 Mar 2024 21:37 IST

ప్రసవమయ్యాక బరువు పెరగడం.. జుట్టు ఊడిపోవడం.. ఇలాంటి శారీరక మార్పులు సహజమే. ఈ క్రమంలోనే తమ అందం, అధిక బరువు గురించి ఆందోళన చెందుతూ ఒత్తిడి-ఆందోళనలకు గురవుతుంటారు చాలామంది అతివలు. అయితే వీటన్నిటికీ అలీవ్‌ గింజలతో చెక్ పెట్టచ్చంటున్నారు పోషకాహార నిపుణులు.

ప్రయోజనాలు బోలెడు!

⚛ అందం తగ్గిపోవడం, బరువు పెరగడం, జుట్టు ఎక్కువగా రాలిపోవడం.. వంటి సమస్యలు కొత్తగా తల్లైన మహిళల్లో కామన్‌! మరి, వీటన్నింటి నుంచి బయటపడాలంటే అలీవ్‌ గింజలు చక్కగా దోహదపడతాయి. అలాగే ప్రసవానంతరం తిరిగి కోలుకోవడానికి తీసుకునే పదార్థాల్లో అలీవ్‌కు ప్రత్యేక స్థానం ఉందని నిపుణులు చెబుతున్నారు.

⚛ అంతేకాదు.. కొత్తగా తల్లైన మహిళల్లో పాల ఉత్పత్తిని పెంచడంలోనూ ఈ గింజలు ముందుంటాయి.

⚛ ఐరన్‌, ఫోలికామ్లం, విటమిన్‌ ‘ఎ’, విటమిన్‌ ‘ఇ’, అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు.. వంటి పోషకాలు పుష్కలంగా నిండి ఉన్న ఈ గింజలు రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ దోహదం చేస్తాయి.

⚛ సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాల్లో ఇవీ ఒకటి.

⚛ కొత్తగా తల్లైన మహిళలతో పాటు యుక్తవయసుకు చేరువవుతోన్న అమ్మాయిలు, మెనోపాజ్‌కు చేరువైన మహిళలు, అలొపేషియా (మాడుపై అక్కడక్కడా జుట్టు రాలిపోయి తెల్లటి ప్యాచుల్లా ఏర్పడడం)తో బాధపడే వారు అలీవ్ గింజలను తప్పకుండా తీసుకోవాలి.

⚛ మనసు బాగోలేనప్పుడు, తీపి తినాలన్న కోరిక కలిగినప్పుడు వీటిని తీసుకోవడం మంచిది.

⚛ పిల్లల్లో ఏకాగ్రత, సత్తువను పెంచడానికి అలీవ్ గింజలు ఉపయోగపడతాయి.

⚛ ఈ గింజలను కొబ్బరి-నెయ్యితో తీసుకోవడం లేదంటే పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల ఇందులోని పోషకాలు శరీరానికి చక్కగా అందుతాయి.

⚛ అలీవ్ గింజలు తీసుకోవడం అలవాటు లేని వారు చిటికెడు మాత్రమే తీసుకోవాలి.. ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అది కూడా పాలతో, లడ్డూల్లా చేసుకొని తీసుకోవాలి.

⚛ పిగ్మెంటేషన్‌ని తగ్గించడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి, సంతానోత్పత్తికి, మానసిక ఒత్తిళ్లు-ఆందోళనల్ని దూరం చేయడానికి అలీవ్ గింజలు ఉపయోగపడతాయి.

ఎవరు తీసుకోవచ్చు?

ఎవరైనా తీసుకోవచ్చు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు, యుక్తవయసుకు దగ్గరవుతోన్న అమ్మాయిలు/అబ్బాయిలు, మధ్య వయస్కులు తీసుకోవచ్చంటున్నారు నిపుణులు. అలాగే జుట్టు రాలడం, చర్మం ప్యాచుల్లా మారడం, అలొపేషియా (మాడుపై అక్కడక్కడా జుట్టు రాలిపోయి తెల్లటి ప్యాచుల్లా ఏర్పడడం)తో బాధపడేవారు తీసుకుంటే ఆయా సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఒత్తిడి నుంచి విముక్తి కల్పించేందుకూ ఈ గింజలు దోహదం చేస్తాయి. ఫోలికామ్లం, ఐరన్‌, విటమిన్లు ఎ, ఇ.. వంటి పోషకాలు నిండి ఉన్న ఈ సూపర్‌ ఫుడ్‌ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఎలా తీసుకోవాలి?

అలీవ్ గింజల్ని నెయ్యి, కొబ్బరి, బెల్లం కలిపి లడ్డూల్లా చేసుకొని తీసుకోవచ్చు.. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం సమయంలో తినడం మంచిది. వీటిని పిల్లలకూ అందించచ్చు. రాత్రిపూట చిటికెడు అలీవ్‌ గింజల్ని పాలల్లో వేసి ఏడెనిమిది గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత తీసుకోవడం ఉత్తమం.

ఎంత తీసుకోవాలి?

చిటికెడు అలీవ్‌ గింజల్ని ఇందాక చెప్పినట్లు పాలల్లో నానబెట్టుకోవడం, లడ్డూలు-ఖీర్‌ రూపంలో తీసుకోవడం ఉత్తమం. వీటిని మరీ ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

గమనిక: అలీవ్‌ గింజలు ఆరోగ్యానికి అన్ని విధాలా మంచివే.. అయితే వీటిని చాలా మితంగా తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకొని.. ఇంకా ఈ సూపర్‌ ఫుడ్‌ గురించి మీకేమైనా సందేహాలుంటే మీ వ్యక్తిగత పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్