Container Gardening: ఈ విషయాలు తెలుసుకోండి!

గార్డెనింగ్‌.. ఇప్పుడిది చాలామంది అభిరుచిగా మారిపోయింది. ఇంట్లో ఎక్కువ స్థలం ఉన్న వారు మినీ గార్డెన్‌ను ఏర్పాటుచేసుకుంటే.. తక్కువ స్థలం ఉన్న వారు కుండీల్లో నచ్చిన మొక్కల్ని పెంచేసుకుంటున్నారు. ఇలా కుండీల్లో మొక్కలు పెంచే పద్ధతినే కంటెయినర్‌ గార్డెనింగ్‌ లేదా పాట్‌ గార్డెనింగ్‌ అని పిలుస్తున్నారు.

Published : 10 Apr 2024 12:51 IST

గార్డెనింగ్‌.. ఇప్పుడిది చాలామంది అభిరుచిగా మారిపోయింది. ఇంట్లో ఎక్కువ స్థలం ఉన్న వారు మినీ గార్డెన్‌ను ఏర్పాటుచేసుకుంటే.. తక్కువ స్థలం ఉన్న వారు కుండీల్లో నచ్చిన మొక్కల్ని పెంచేసుకుంటున్నారు. ఇలా కుండీల్లో మొక్కలు పెంచే పద్ధతినే కంటెయినర్‌ గార్డెనింగ్‌ లేదా పాట్‌ గార్డెనింగ్‌ అని పిలుస్తున్నారు. అయితే ఈ గార్డెనింగ్‌ పద్ధతి పాటించే వారు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

సైజును బట్టి..

చిన్న స్థలంలో మొక్కలు పెంచుకోవాలంటే కుండీ తప్పనిసరి. అయితే వీటిలోనూ వేర్వేరు మెటీరియల్స్‌లో తయారుచేసినవి దొరుకుతున్నాయి. మట్టి, టెర్రకోటా, ప్లాస్టిక్‌, పింగాణీ, చెక్క, లోహాలతో చేసిన కుండీలు విభిన్న ఆకృతులు, సైజుల్లో లభిస్తున్నాయి. అయితే వీటిని ఎంచుకునే ముందు మొక్క పెరిగే సైజును దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అంటే కొన్ని మొక్కలు వృక్షంలా పెరగచ్చు.. మరికొన్నింటికి వేర్లు ఎక్కువగా రావచ్చు. ఇలాంటప్పుడు కొన్ని రోజులకే ఆ వేర్లు విస్తరించి కుండీ పగిలిపోయే అవకాశం ఉంటుంది. అందుకే దాన్ని బట్టే కుండీని ఎంచుకోవాలి. అలాగే మనం ఎంచుకునే కుండీకి నీళ్లు బయటికి పోవడానికి రంధ్రం ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.

ఈ మొక్కలు..

కుండీల్లో అన్ని మొక్కలు పెంచుకోవచ్చనుకుంటారు కొందరు. ఈ క్రమంలో అలంకరణ మొక్కలూ పెంచుకునే వారు లేకపోలేదు. అయితే అన్ని రకాల ఆర్నమెంటల్‌ పూల మొక్కలు కుండీల్లో పెంచుకోవడం వీలు కాదంటున్నారు నిపుణులు. ఉదాహరణకు.. Russelia, Thunbergia.. లాంటి మొక్కలు గుబురుగా విస్తరిస్తాయి. ఇలాంటి వాటిని కుండీల్లో పెంచుకుంటే ఇతర మొక్కలకు ఇబ్బంది కలగచ్చు.. అలాగే ఆ ప్రదేశం చిత్తడిగానూ మారచ్చు. అందుకే ఈ తరహా మొక్కల్ని విశాలమైన గార్డెన్‌లో పెంచుకుంటే అక్కడి వాతావరణం కలర్‌ఫుల్‌గా, ఆహ్లాదకరంగా మారుతుంది. ఇక కుండీల్లో పుదీనా, కొత్తిమీర, తులసి, రోజ్‌మేరీ, బోన్సాయ్‌ తరహా కాయగూర-పండ్ల మొక్కలు.. వంటివి పెంచుకోవచ్చు.

మట్టి ముఖ్యం!

సాధారణ గార్డెనింగ్‌లో పెంచుకునే మొక్కలకు భూమి నుంచి కావాల్సిన పోషకాలు అందుతాయి. అదే కంటెయినర్స్/కుండీల్లో పెంచుకునే మొక్కలకు అందులో నింపే మట్టే కీలకం. కాబట్టి ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. కోకోపీట్‌, వర్మీ కంపోస్ట్‌, ఎర్ర మట్టి, నాచు.. వంటివన్నీ కలిపి తయారుచేసిన సహజసిద్ధమైన పాటింగ్‌ మిక్స్‌ మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని కుండీల్లో నింపుకోవడం వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.

ఎప్పుడూ తేమగా!

సాధారణంగా గార్డెనింగ్‌ బెడ్స్‌తో పోల్చితే కుండీల్లో ఉండే మట్టి త్వరగా ఆరిపోతుందంటున్నారు నిపుణులు. అందుకే ఆ మట్టి తేమగా ఉండాలంటే నిర్ణీత వ్యవధుల్లో మొక్కకు నీళ్లు పోయడం తప్పనిసరి. ఒకవేళ మీరు ఆఫీస్‌కి వెళ్లినా, ఊరెళ్లినా మొక్కకు నిరంతరాయంగా తేమ అందాలంటే.. వాటిలో సెల్ఫ్‌ వాటరింగ్‌ టూల్స్‌ ఏర్పాటుచేస్తే సరి.

ఇవి గుర్తుంచుకోండి!

⚛ మొక్కలకు సూర్యరశ్మి తగలడం తప్పనిసరి. అందుకే కుండీల్ని నాలుగైదు గంటలు ఎండ పడే చోట ఏర్పాటుచేసుకోవాలి.

⚛ చీడపీడల బెడద గార్డెన్‌లో పెంచుకునే మొక్కలకే ఉంటుందనుకుంటాం. కానీ కంటెయినర్‌ మొక్కలకూ ఈ ముప్పు పొంచి ఉందంటున్నారు నిపుణులు. అందుకే మొక్కల్ని తరచూ గమనిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.

⚛ కొన్ని రకాల మొక్కలు అధిక వేడిని, మరికొన్ని చల్లటి వాతావరణాన్ని తట్టుకోలేవు. కాబట్టి ఆయా కాలాల్ని బట్టి వాతావరణ ప్రభావం మొక్కలపై పడకుండా.. వాటిని ఇంట్లో ఏర్పాటుచేసుకోవడం లేదంటే వాటిపై ఫ్రాస్ట్‌ క్లాత్‌ కప్పడం.. వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్