ఆరు రుచులూ ఆస్వాదిద్దాం!

అమ్మాయి జీవితంలో ప్రతి విషయంలో ఆచితూచి అడుగేయాల్సిందే! ఎలాంటి స్థితి అయినా చిరునవ్వు, ఆత్మనిబ్బరమే మన ఆయుధాలు. ఉగాది పరమార్థమూ అదే! పరిస్థితి ఏదైనా ఒకేలా తీసుకోవాలనే. పాటించడం మన వంతిక!

Updated : 22 Mar 2023 04:22 IST

అమ్మాయి జీవితంలో ప్రతి విషయంలో ఆచితూచి అడుగేయాల్సిందే! ఎలాంటి స్థితి అయినా చిరునవ్వు, ఆత్మనిబ్బరమే మన ఆయుధాలు. ఉగాది పరమార్థమూ అదే! పరిస్థితి ఏదైనా ఒకేలా తీసుకోవాలనే. పాటించడం మన వంతిక!

ఉగాది అంటే కొత్త సంవత్సరానికి మొదటి రోజు. యుగ అంటే జంట అనే అర్థమూ ఉంది. అది స్త్రీ పురుషుల జంట.. పగలు-రాత్రి.. సుఖం-దుఃఖం.. ఏదైనా కావచ్చు. మొత్తానికి జీవితంలో అన్నీ ఉండాల్సిందే! జీవన ప్రయాణంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా స్వాగతించాలని, ప్రతి దశనూ ఆస్వాదించాలన్నదే ఇందులో ఉన్న అర్థం. మోడుబారిన కొమ్మలు చిగురాకులను తొడుగుతూ.. నిరాశా నిస్పృహలకు చోటివ్వకూడదు.. పోరాటమే లక్ష్యమని సూచిస్తుందీ పండగ. మరి మనమంతా ఆ స్ఫూర్తితో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదామా మరి!

పురాణాల నుంచి నేటి దాకా దారి దీపాలైన మహిళలెందరో! తమనెవరూ ప్రోత్సహించలేదనో, తమకా అవకాశం చిక్కలేదనో ఉత్సాహాన్ని నీరు గార్చుకోకుండా తమకు తామే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని, నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకున్న వనితామణులు ఇంకెందరో! ఎదుర్కొన్న కష్టాలను వర్తమానానికి ఆలంబనగా చేసుకుని భవిష్య సుందర సోపానాలను అందుకోమన్నదే ఉగాది సందేశం. సహనానికి సీతమ్మ, ధైర్యానికి ద్రౌపది అంటూ పురాణ పాత్రల్ని స్మరించుకుంటాం. ఆ స్ఫూర్తితో నవచైతన్యాన్ని నింపుకొంటాం. సరంగులమై కుటుంబనౌకని ఒడుదొడుకులు లేకుండా జాగ్రత్తగా నడిపిస్తాం. పదిలంగా గమ్యం చేరి స్థిమితంగా ఉండటమే మన లక్ష్యం. దాన్నలా కొనసాగిస్తే మన జీవితాలు షడ్రుచులతో సంపూర్ణత్వాన్ని సంతరించుకుని అందాలూ ఆనందాలతో కళకళలాడతాయి.


* తీపి.. కడుపులో పడిన నలుసు, ఒడిలో చేరిన ఆ మధుర క్షణం తల్లికెంతటి తియ్యనిదో! అది జ్ఞాపకాల పేటికలో తేనెల మాధుర్యం పంచుతూ, మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది.

* వగరు.. తన కొంగు కొన విడువని నిన్నటి బుడి బుడి అడుగుల యువరాణి, నేడు మరో ఇంటి సామ్రాజ్ఞి కాబోతుందన్న ఆనందమో.. ఇకపై తన వెంట ఉండబోదన్న దిగులో.. అమ్మ కంట ఆ క్షణం ఏడ్చినా, నవ్వినా వచ్చేవి కన్నీళ్లే.

* ఉప్పు.. ఇంటా బయటా పడుతున్న కష్టం చెమట చుక్కలను చిందిస్తున్నా.. చిరునవ్వులు చిందించటం మన మహిళకే సాధ్యం కదూ!

* కారం.. తల్లి కడుపులో ఉన్నంత భద్రంగా ఏ ఆడపిల్లా బయట ఉండలేదేమో! ఏ క్షణం ఏ విపత్కర పరిస్థితి దాపురిస్తుందోనని బెదిరిపోయే గడ్డు కాలమిది. అయితేనేం.. కారప్పొడి చేతిలో పట్టుకుని ధైర్యంగా సాగుతూ ధీమా వ్యక్తంచేసే ధీరత్వం మన సొంతం.

* చేదు.. గజిబిజి జీవితంలో ఒత్తిడిలాంటి చేదు గుళికలెన్నో. అలాంటి క్షణాల్లో విరక్తులూ వైరాగ్యాలకు లోనవకూడదు. అందరికీ దొరికేది ఒకే జీవితమని గుర్తుంచుకొని సాగాల్సిందే.

* పులుపు.. జీవితమనే పరుగుపందెంలో పుట్టినింటినీ మెట్టినింటినీ కావడిలో వేసుకు పరిగెత్తే క్రమంలో మన కోసం తగిన బహుమతులు ఎదురుచూస్తుంటాయనే తలపులు.. ఆ ఆశా నిరాశల మధ్య ఊగిసలాడే చిత్ర విచిత్ర భావపరంపర పుల్లపుల్లగా గమ్మత్తునిచ్చేదే.


షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిలా విజయాల తీపి, భంగపాటుల చేదు, బాధ్యతల వగరు, కష్టనష్టాల ఉప్పు, ఆరాటపు పులుపు, అవమానాల కారంతో సాగుతుంది జీవితం. మనకెలాంటి స్థితిగతులెదురైనా ఒకేలా ఆహ్వానం పలకాలనీ, స్థితప్రజ్ఞతతో మెదలాలన్నదే ఈ పర్వంలో అంతరార్థం. ఇంటిని నడిపే ధీరలం.. మనం పాటిస్తూ తర్వాతి తరాలకీ ఈ తత్వం అలవాటు చేద్దామా మరి!

- పార్నంది అపర్ణ, విద్యావేత్త

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్