సన్‌ఫ్లవర్ గింజలతో.. కొత్త కళ!
చర్మంపై పేరుకొన్న జిడ్డు, మురికి కారణంగా మొటిమలు రావడం, చర్మం నిర్జీవంగా తయారవడం లాంటివి జరుగుతాయి. వేసవిలో ఇలాంటి సమస్యలు మరింత అధికం. అయితే- ఇలాంటి సమస్యలన్నిటికీ....
చర్మంపై పేరుకొన్న జిడ్డు, మురికి కారణంగా మొటిమలు రావడం, చర్మం నిర్జీవంగా తయారవడం లాంటివి జరుగుతాయి. వేసవిలో ఇలాంటి సమస్యలు మరింత అధికం. అయితే- ఇలాంటి సమస్యలన్నిటికీ పొద్దు తిరుగుడు గింజలతో చెక్ పెట్టచ్చు.
చర్మం శుభ్రపడటానికి..
సన్‌ఫ్లవర్ గింజలతో తయారుచేసిన స్క్రబ్ ఉపయోగించడం ద్వారా చర్మం, చర్మరంధ్రాలు శుభ్రపడి కొత్త కళ సంతరించుకొంటుంది. ఈ ఫలితాన్ని పొందడానికి.. అరకప్పు పొద్దుతిరుగుడు గింజలను తీసుకొని మిక్సీలో వేసి పొడిలా తయారుచేసుకోవాలి. దీనికి కొద్దిగా నీరు కలిపి చిక్కటి మిశ్రమంలా చేసుకొని గాజు సీసాలో వేసి ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలి. ఈ మిశ్రమంతో రోజూ ముఖాన్ని, మెడను రుద్దుకొంటూ ఉంటే.. చర్మం శుభ్రపడటంతో పాటు తగిన పోషణ అంది ఆరోగ్యంగా తయారవుతుంది.
పొడిబారిన చర్మానికి..
పొద్దుతిరుగుడు గింజలను రెండు నుంచి మూడు గంటల పాటు ఎండలో ఉంచాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు మరీ మెత్తగా కాకుండా.. కాస్త గరుకుగా ఉండేలా చూసుకోవాలి. దీన్ని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఇలా తయారుచేసిన పొడిని టీస్పూన్ పరిమాణంలో తీసుకొని.. దీనికి మరో టీస్పూన్ వెన్న తొలగించని పాలు, చిటికెడు పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్త్లె చేసుకొని పావుగంట నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఈ ప్యాక్ ముఖంపై పేరుకొన్న మురికిని తొలగిస్తుంది. చర్మానికి తేమనందించి పొడి చర్మం సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే చర్మఛాయ సైతం మెరుగుపడుతుంది. ఈ ప్యాక్‌ని వారానికోసారి వేసుకోవడం ద్వారా చక్కటి ఫలితం కనిపిస్తుంది.
మిశ్రమ చర్మతత్వం ఉంటే..
మిశ్రమ చర్మతత్వం కలిగిన వారికి చర్మంపై ప్యాచెస్ మాదిరిగా అక్కడక్కడా పొడిగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారికి పొద్దుతిరుగుడు గింజలతో తయారుచేసిన ఫేస్‌ప్యాక్ చక్కగా నప్పుతుంది. దీనికోసం పై పద్ధతిలో మనం తయారుచేసి పెట్టుకొన్న సన్‌ఫ్లవర్ గింజల పొడిని టీస్పూన్ తీసుకోవాలి. దీనికి కొద్దిగా గంధం పొడి, రోజ్‌వాటర్ కలిపి మిశ్రమంగా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్త్లె చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత తడివస్త్రంతో ముఖం తుడుచుకొని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై డ్రై ప్యాచెస్ పోవడంతో పాటు.. చర్మం సైతం అందంగా కనిపిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.