అబద్ధాలు చెబుతున్నారా?

‘మా పాప పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వదు. వాళ్లు మాట్లాడుతుంటే కనీసం వారి వంక కూడా చూడదు’..‘మా బాబు ఎక్కడ నేర్చుకున్నాడో కానీ.. అసభ్యకరమైన పదాలు తరచుగా మాట్లాడుతున్నాడు. మేము అలాంటి పదాలను ఇంట్లో కూడా వాడం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు’....

Published : 16 May 2024 12:49 IST

‘మా పాప పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వదు. వాళ్లు మాట్లాడుతుంటే కనీసం వారి వంక కూడా చూడదు’..
‘మా బాబు ఎక్కడ నేర్చుకున్నాడో కానీ.. అసభ్యకరమైన పదాలు తరచుగా మాట్లాడుతున్నాడు. మేము అలాంటి పదాలను ఇంట్లో కూడా వాడం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు’..
ఈ మధ్య చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి ప్రశ్నలతో తమ వద్దకొస్తున్నట్లు చైల్డ్‌ సైకాలజిస్టులు చెబుతున్నారు. వీటిలో ఎక్కువ శాతం సమస్యలకు తల్లిదండ్రులే స్వయంగా చెక్‌ పెట్టచ్చంటున్నారు.

పట్టించుకోవడం లేదా..?
ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చినప్పుడు పిల్లల్ని పలకరించడం మామూలే. కొంతమంది పిల్లలు వాళ్లు అడిగే కుశల ప్రశ్నలకు ఠక్కున సమాధానాలు ఇస్తుంటారు. కానీ, కొంతమంది ఎంత మాట్లాడినా వారి వంక కూడా చూడరు. ఇంకొంతమంది పిల్లలు ‘మీకెందుకు, నేను చెప్పను’ అన్నట్లు వారిని తీసి పారేసినంత పని చేస్తుంటారు. ఇలాంటి ప్రవర్తన మంచిది కాదంటున్నారు నిపుణులు. మీ పిల్లలు కూడా వచ్చిన అతిథులతో సరిగా మాట్లాడకపోవడం, అనుచిత పదాలు ఉపయోగించడం చేస్తుంటే దానిని మొదటి నుంచే అదుపులో పెట్టాలి. లేకపోతే, వయసు పెరిగే కొద్దీ కొంతమంది పిల్లలు ఈ విషయంలో మొండిగా తయారవుతారు. అప్పుడు వారిని మార్చడం మరింత కష్టమవుతుంది. ఈ క్రమంలో- అతిథులతో ఎలా మాట్లాడాలో చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. మంచిగా ప్రవర్తించినప్పుడు వారిని అభినందించాలి. దాంతో వారిలో కొద్ది కొద్దిగా మార్పు వస్తుంటుంది. ఈ రోజుల్లో పిల్లలు టీవీ కార్యక్రమాలు, యూట్యూబ్‌ వీడియోలకు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. వాటి వల్ల కూడా పిల్లల ప్రవర్తనలో మార్పులు వస్తుంటాయి. కాబట్టి, మీ పిల్లలు చూసే కార్యక్రమాలపై ఓ కన్నేసి ఉంచడం మంచిది.

అబద్ధాలు చెబుతున్నారా?
కొంతమంది పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధాలు చెబుతుంటారు. ఇది తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తుంటుంది. తాము చేసే పనుల గురించి తల్లిదండ్రులకు చెబితే ఎక్కడ తిడతారోనన్న భయం కూడా పిల్లల్లో ఈ అలవాటుకి కారణం అవ్వచ్చు. ఈ సమస్య సాధారణమే అయినప్పటికీ తల్లిదండ్రులు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని తిట్టకుండా దాని వల్ల కలిగే సమస్యల గురించి వివరించాలి. ఇలా చేయడం వల్ల వారు నిజాలు చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వారు చేసే మంచి పనులను ఎప్పటికప్పుడు ప్రశంసిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏది మంచి? ఏది చెడు? అన్న విషయాలు వారికి తెలుస్తుంటాయి. అలాగే అబద్ధాలు చెప్పడం వల్ల వచ్చే నష్టాల గురించి వారికి నిత్యం వివరించాలి. కొంతమంది తల్లిదండ్రులు ఫోన్‌లో, ఇతరులతో మాట్లాడేటప్పుడు పిల్లల ముందే అబద్ధాలు చెబుతుంటారు. దానివల్ల కూడా పిల్లలు తప్పుదారి పట్టే అవకాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్