ఇంటిని ఇలా క్లాసీగా మార్చేద్దాం!

ఇంటిని అలంకరించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి! కొంతమంది తమ ఇల్లు విలాసవంతంగా కనిపించాలనుకుంటే.. మరికొంతమంది ఉన్న వస్తువులతోనే సింపుల్‌గా, క్లాసీగా తీర్చిదిద్దుకోవాలని ఆరాటపడుతుంటారు. మరి, మీరూ అంతేనా? అయితే అందుకోసం పెద్దగా....

Published : 21 Feb 2023 19:46 IST

ఇంటిని అలంకరించడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిరుచి! కొంతమంది తమ ఇల్లు విలాసవంతంగా కనిపించాలనుకుంటే.. మరికొంతమంది ఉన్న వస్తువులతోనే సింపుల్‌గా, క్లాసీగా తీర్చిదిద్దుకోవాలని ఆరాటపడుతుంటారు. మరి, మీరూ అంతేనా? అయితే అందుకోసం పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేకుండానే ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఇంటిని చూడగానే ఆకట్టుకునేలా, క్లాసీగా మార్చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

ఇంటి లుక్‌ని ఇనుమడింపజేయడంలో రంగులది కీలక పాత్ర. అలాగని ఇప్పుడు కొత్తగా రంగులేయమని కాదు.. గోడ రంగుల్ని బట్టి ఫర్నిచర్‌లో చిన్నపాటి మార్పులు చేసుకుంటే సరిపోతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో తెలుపు రంగు గోడలైతే.. గోల్డ్‌ కలర్‌ కర్టెన్లను తగిలించడం, సోఫాపై ఉన్న కుషన్లకు బంగారు వర్ణపు కవర్లను తొడగడం, గోల్డ్‌ కలర్‌ బెడ్‌షీట్స్‌.. వంటివి అమర్చుకోవాలి. లేదంటే ముదురు రంగుల్లో ఉండే ఫ్యాబ్రిక్స్‌కి చోటిచ్చినా సరిపోతుంది.

గోడ ప్లెయిన్‌గా ఉంటే ఇల్లంతా బోసిగా కనిపిస్తుంది. అదే ఓ చక్కటి వాల్‌ ఫ్రేమ్‌ని అమర్చితే దాని అందం రెట్టింపవుతుంది. అలాగని గోడ నిండా చిన్న చిన్న ఫ్రేమ్‌లతో నింపేయడం కాకుండా.. కాస్త పెద్దగా ఉండే వాల్‌ ఆర్ట్‌తో కూడిన ఫ్రేమ్‌ను ఎంచుకుంటే బాగుంటుంది. ఇవి కాకుండా కొలేజ్‌ చేసుకోదగిన వాల్‌ ఆర్ట్‌ ఫ్రేమ్స్, మొజాయిక్ తరహా ఫ్రేమ్స్‌ ప్రస్తుతం మార్కెట్లో సరసమైన ధరల్లోనే దొరుకుతున్నాయి.

లివింగ్‌ రూమ్‌కి టీవీ యూనిట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. అయితే ఇది లేని వారు టీవీ చుట్టూరా ఓ ప్లెయిన్‌ గోల్డెన్‌ ఫ్రేమ్‌ను అమర్చి చూడండి.. అచ్చం టీవీ యూనిట్‌ని తలపిస్తుందనడంలో సందేహం లేదు.

కిటికీ ఎంత పరిమాణంలో ఉంటే అంతే పరిమాణంలో కర్టెన్లను అమర్చడం చాలామందికి అలవాటు. అలాకాకుండా కర్టెన్‌ రాడ్స్‌ని కాస్త ఎక్కువ ఎత్తులో అమర్చి, ఫ్లోర్ లెంత్‌ కర్టెన్లను వేలాడదీస్తే ఆ అందమే వేరు. కావాలంటే ఓసారి ప్రయత్నించి చూడండి.

కర్టెన్లను కట్టిపడేయడానికి ఏదో ఒక దారాన్ని ఉపయోగిస్తుంటాం. అయితే దానికి బదులు బెల్టు, బీడ్స్‌, చేత్తో అల్లినవి.. ఇలా విభిన్నమైన కర్టెన్‌ టైస్‌ బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటికి ఇంట్లో చోటిచ్చేస్తే మరింత ప్రత్యేకంగా, ఆధునికంగా ఇంటిని తీర్చిదిద్దుకోవచ్చు.

మీకు ఓపిక ఉంటే ప్లెయిన్‌గా ఉన్న స్విచ్‌ బోర్డులను కూడా అందంగా తీర్చిదిద్దచ్చు. ఈ క్రమంలో మీ స్విచ్‌ బోర్డు సైజుకు సరిపడా మొజాయిక్ టైల్స్‌ లేదా ప్రింటెడ్‌ టైల్స్‌ని తీసుకొని.. వాటిపై స్విచ్‌ పరిమాణంలో రంధ్రాలు చేసి.. దీన్ని బోర్డుకు అతికించచ్చు.. లేదంటే ప్రింటెడ్‌ షీట్స్‌తో ఇలా చేసినా ప్లెయిన్‌ స్విచ్‌ బోర్డులకు అదనపు హంగులద్దచ్చు.

మెయింటైన్ చేయలేమేమో అని సందేహించకుండా ఫ్లోర్‌పై కార్పెట్స్/మ్యాట్స్ పరిస్తే అవి గది అందాన్ని రెట్టింపు చేస్తాయి. ముఖ్యంగా వీటిని సోఫా వద్ద, మంచానికి ముందు భాగంలో, బాల్కనీలో.. ఇలా అక్కడక్కడా అమర్చుకుంటే చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం వీటిలోనూ ఎన్నో కొత్త వెరైటీలు లభిస్తున్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్