ఎలక్ట్రిక్‌ కెటిల్‌ వాడుతున్నారా?

నీళ్లు వేడి చేసుకోవడానికి ఇప్పుడు చాలామంది ఎలక్ట్రిక్‌ కెటిల్‌ వాడుతున్నారు. అంతేనా.. కోడిగుడ్లు ఉడికించుకోవడానికి, పాస్తా-నూడుల్స్‌.. వంటి వంటకాలు తయారుచేసుకోవడానికీ దీన్ని వాడే వారు లేకపోలేదు. మరి, నిమిషాల్లో ఇన్ని పనులు చేసి...

Published : 03 Jul 2023 20:46 IST

నీళ్లు వేడి చేసుకోవడానికి ఇప్పుడు చాలామంది ఎలక్ట్రిక్‌ కెటిల్‌ వాడుతున్నారు. అంతేనా.. కోడిగుడ్లు ఉడికించుకోవడానికి, పాస్తా-నూడుల్స్‌.. వంటి వంటకాలు తయారుచేసుకోవడానికీ దీన్ని వాడే వారు లేకపోలేదు. మరి, నిమిషాల్లో ఇన్ని పనులు చేసి పెడుతోన్న ఈ కెటిల్‌ వాడకం, శుభ్రం చేసే విషయాల్లో శ్రద్ధ తీసుకోకపోతే మాత్రం అది త్వరగా పాడయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మరి, కెటిల్‌ని వాడే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాన్నెలా శుభ్రపరచాలో తెలుసుకుందాం రండి..

మోతాదుకు మించకుండా..!

కెటిల్‌ పరిమాణాన్ని బట్టే అందులో నీటిని పోసి వేడి చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది మరీ నిండుగా, దాని అవుట్‌లెట్‌ దాకా నీటిని నింపుతుంటారు. దీనివల్ల నీరు మరిగే క్రమంలో అవుట్‌లెట్‌ రంధ్రాల్లోంచి బయటికి దొర్లి.. కెటిల్‌ మెషీన్‌లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఫలితంగా కెటిల్‌ పనితీరు దెబ్బతింటుంది. కాబట్టి మోతాదును బట్టే అందులో నీళ్లు నింపి వేడి చేయాలంటున్నారు నిపుణులు. అలాగే కొన్ని నీళ్లతో, అసలు నీళ్లు లేకుండా కెటిల్‌ని వాడకపోవడమే మేలంటున్నారు.

అందులోనే ఉంచుతున్నారా?

కెటిల్‌ వాడేటప్పుడు చాలామంది చేసే మరో పొరపాటేంటంటే.. నీళ్లు వేడి చేశాక కూడా ఆ నీటిని అందులోనే ఉంచడం.. కావాలనుకున్నప్పుడు కెటిల్‌లో నుంచి గ్లాస్‌ లేదా బాటిల్‌లో నింపుకుంటుంటారు. అయితే దీనివల్ల కెటిల్‌ లోపలి భాగంలో సుద్ద కట్టులాగా తెల్లటి పొర పేరుకుపోతుంది. దీనివల్ల కెటిల్‌ మన్నిక, పనితీరు క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి ఈ విద్యుత్‌ ఉపకరణం ఎక్కువ రోజులు సమర్థంగా పనిచేయాలంటే.. వేడి చేశాక నీటిని గిన్నెలో లేదంటే స్టీల్‌ బాటిల్‌లో నింపుకొని దాని వాడకం పూర్తయ్యాక ఖాళీగా ఉంచుకోవడమే మేలు.

ఈ విషయంలో జాగ్రత్త పడుతున్నారా?

కెటిల్‌లో నీళ్లు మరుగుతున్నప్పుడు దాని అవుట్‌లెట్‌ నుంచి వేడి వేడి పొగలు బయటికి వస్తుంటాయి. అవి ఏదైనా ఫర్నిచర్‌పై లేదంటే వస్తువుపై పడితే అది డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పొరపాటున స్విచ్‌ బోర్డుపై పడేలా అమర్చినా ప్రమాదమే! కాబట్టి కెటిల్‌ను విశాలంగా ఉన్న ఖాళీ ప్రదేశంలో ఉంచి నీళ్లు వేడి చేసుకోవడం మంచిది. అలాగే చిన్న పిల్లలున్న ఇళ్లలో వారికి అందకుండా దీన్ని అమర్చడం మర్చిపోవద్దు.

శుభ్రం చేయడానికీ పద్ధతుంది!

చాలామంది కెటిల్‌ని కుళాయి నీళ్ల కింద కడుగుతుంటారు. అయితే ఇలా పైపైన కడగడం వల్ల సరిగ్గా శుభ్రపడక దాన్నుంచి దుర్వాసన వచ్చే అవకాశముంది. అందుకే దీన్ని శుభ్రం చేయడానికీ ఓ ప్రత్యేకమైన పద్ధతుందంటున్నారు నిపుణులు. నీళ్లు, వెనిగర్‌ సమపాళ్లలో తీసుకొని.. ఈ మిశ్రమాన్ని కెటిల్‌లో సగం వరకు నింపి మరిగించాలి. ఆపై స్విచాఫ్‌ చేసి అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత  స్క్రబ్బర్‌తో రుద్ది శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. కెటిల్‌ బయటి వైపు కూడా కుళాయి కింద కడగకుండా శుభ్రమైన తడిగుడ్డతో తుడిచేస్తే సరిపోతుంది. లేదంటే కెటిల్‌ కింద ఉన్న మెషీన్‌ భాగంలోకి నీళ్లు చేరి తద్వారా ఈ పరికరం త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది.

ఇంకా వేటి కోసం వాడుతున్నారు?

కెటిల్‌ కొనేటప్పుడే దాన్ని ఏయే పదార్థాలు తయారుచేసుకోవడానికి వాడుకోవచ్చన్న విషయం దాని ప్యాకేజింగ్‌ లేబుల్‌పై స్పష్టంగా రాసి ఉంటుంది. అయితే కొంతమంది వాటిని పక్కన పెట్టి.. పని సులభంగా పూర్తవుతుందన్న ఉద్దేశంతో అన్ని పదార్థాల్ని ఇందులో తయారుచేస్తుంటారు. కెటిల్‌ పనితీరు దెబ్బతినడానికి ఇదీ ఓ కారణమే! కాబట్టి ప్యాకింగ్‌పై ఉన్న పదార్థాల్ని తయారుచేయడానికి మాత్రమే దీన్ని ఉపయోగించడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్