వంటింట్లో ఈ పొరపాట్లు చేస్తున్నారా?

నిజానికి ఇవన్నీ రోజూ మనం కిచెన్‌లో చేసేవే! చెప్పుకోవడానికీ చాలా సిల్లీగా అనిపిస్తాయి కూడా! అయితే ఇలాంటి అలవాట్లన్నీ వంటను కలుషితం చేసి లేనిపోని అనారోగ్యాల్ని తెచ్చిపెడతాయంటున్నారు నిపుణులు. అందుకే ఈ అలవాట్లను మార్చుకోమని....

Published : 10 Nov 2022 21:33 IST

వాడిన నూనెనే పదే పదే వాడడం కొంతమందికి అలవాటు!

కూర పూర్తయ్యాక గరిటెల్ని ప్లాట్‌ఫామ్‌పై పెట్టి అలాగే వదిలేస్తుంటారు మరికొందరు!

వండేటప్పుడు ఉప్పు సరిపోయిందా అని కలిపే గరిటెతోనే రుచి చూడడం ఇంకొందరు చేసే పని!

నిజానికి ఇవన్నీ రోజూ మనం కిచెన్‌లో చేసేవే! చెప్పుకోవడానికీ చాలా సిల్లీగా అనిపిస్తాయి కూడా! అయితే ఇలాంటి అలవాట్లన్నీ వంటను కలుషితం చేసి లేనిపోని అనారోగ్యాల్ని తెచ్చిపెడతాయంటున్నారు నిపుణులు. అందుకే ఈ అలవాట్లను మార్చుకోమని సూచిస్తున్నారు. మరి, మనకు తెలియకుండానే వంటింట్లో దొర్లే పొరపాట్లేంటి? వాటిని ఎలా సరిచేసుకోవాలి? అనే విషయాలు తెలుసుకుంటేనే వంటలోని పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి.

రెండింటికీ ఒకే గరిటా?

కూర చేసేటప్పుడు ఉప్పు/కారం/పులుపు సరిపోయిందా అని రుచి చూడడం మనలో చాలామందికి అలవాటే! అయితే ఈ క్రమంలో కొంతమంది టీస్పూన్ ఉపయోగిస్తే.. మరికొంతమందేమో తినేది మనమే కదా అని.. కూర కలిపే గరిటెతోనే రుచీ చూస్తుంటారు. మళ్లీ తిరిగి అదే గరిటెను కూర కోసం వాడుతుంటారు.. ఇంకొంతమందైతే ఒకే స్పూన్‌ని పదే పదే కూరలో పెడుతూ.. ఇతరులకూ రుచి చూపిస్తుంటారు. దీనివల్ల కూర కలుషితమయ్యే ప్రమాదం ఉందని చెబుతోంది ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ). అందుకే అలాంటి అలవాటు మానుకొని రుచి చూడ్డానికి వేరే స్పూన్‌ ఉపయోగించడం, ఎక్కువ మంది రుచి చూడాలనుకుంటే కొంచెం కూరను వేరే బౌల్‌లోకి తీసుకొని టేస్ట్‌ చేయడం.. వంటి చిట్కాలు పాటించచ్చని చెబుతున్నారు నిపుణులు.

అదే నూనె.. పదే పదే!

పిండి వంటలు చేసే క్రమంలో మిగిలిపోయిన నూనెను పదే పదే వాడడం మనకు కొత్త కాదు. అయినా ఇలా చేస్తే ఏమవుతుందిలే అనుకునే వారూ లేకపోలేదు. కానీ ఇది ప్రమాదకరమని చెబుతోంది భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI). ఎందుకంటే నూనెను పదే పదే వేడి చేయడం వల్ల అందులో ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ (చెడు కొవ్వులు) ఉత్పత్తవుతాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం! అంతేకాదు.. ఈ నూనెలో శరీరానికి హాని చేసే ఫ్రీరాడికల్స్‌, క్యాన్సర్‌కు కారణమయ్యే కార్సినోజెనిక్‌ సమ్మేళనాలు ఉంటాయంటున్నారు నిపుణులు. కాబట్టి కోరి అనారోగ్యాల్ని కొని తెచ్చుకునే బదులు అవసరం ఉన్నంత నూనెను మాత్రమే వాడడం మంచిది.

వాటిని అలాగే వదిలేస్తున్నారా?

కూరలు వండేటప్పుడు లేదంటే ఏవైనా వంటకాలు/పిండి వంటలు చేసేటప్పుడు.. కలిపిన గరిటెల్ని కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌పై పెడుతూ, తిరిగి వాటినే ఉపయోగిస్తుంటారు చాలామంది. ఇంకొందరేమో కూర పూర్తయ్యాక గరిటెలపై మూత పెట్టకపోవడం, పాత్రలపై మూతలు నిండుగా పెట్టకపోవడం.. వంటివి చేస్తుంటారు. ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యమే దీనికి కారణం. కానీ ఈ అలవాటు వల్ల గరిటెలు పెట్టిన కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌పై క్రిములు, బ్యాక్టీరియా చేరి.. ఇతర వంటకాలకూ అవి వ్యాపించే ప్రమాదం ఉంది. దీనివల్ల తీసుకునే ఆహారం కలుషితమవుతుంది. కాబట్టి వంట పూర్తయ్యాక గరిటెలపై ఓ బౌల్‌ బోర్లించడం, పాత్రలపై నిండుగా మూత పెట్టడం.. వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కూర వండే క్రమంలోనూ గరిటెలు పెట్టుకోవడానికి వీలుగా ప్రస్తుతం వివిధ రకాల ‘స్పూన్‌ రెస్ట్‌’లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని తెచ్చుకుంటే కిచెన్‌ నీట్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది.

శుభ్రం చేస్తున్నారా? లేదా?

కిచెన్‌లో తేమ ఎక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా వంట చేసే క్రమంలో ప్లాట్‌ఫామ్‌, ఫ్లోర్‌పై నీళ్లు పడి అక్కడంతా తడితడిగా అనిపిస్తుంటుంది. ఇలాంటి తడిదనానికి వాతావరణంలోని బ్యాక్టీరియా, వైరస్‌లు సులభంగా ఆకర్షితమవుతాయి. వండేటప్పుడు అవి మనకు తెలియకుండానే కూరలు, ఇతర పదార్థాల్లోకి చేరతాయి. తద్వారా మనకే నష్టం. కాబట్టి కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, ఫ్లోర్‌ను రోజూ డిస్‌-ఇన్ఫెక్టంట్‌ ద్రావణాలతో శుభ్రం చేయాలని చెబుతున్నారు నిపుణులు. తద్వారా వంటగది నీట్‌గా ఉండడంతో పాటు సూక్ష్మక్రిముల బెడద ఉండదు.

ఇవి కూడా!

⚛ టైంపాస్ కోసమంటూ వివిధ రకాల ప్యాక్‌డ్ ఫుడ్స్ తెచ్చుకొని వంటింట్లో భద్రపరచుకుంటుంటారు చాలామంది. నిజానికి వీటివల్ల ఆరోగ్యానికి హాని తప్ప మరే ప్రయోజనం ఉండదు. మరో విషయం ఏంటంటే.. ఇలాంటి పదార్థాలు ఇంట్లో ఉంటే పండ్లు, నట్స్‌.. వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తినాలన్న ఆలోచనే రాదంటున్నారు నిపుణులు. అందుకే వాటికి బదులు ఇంట్లోనే ఆరోగ్యకరమైన స్నాక్స్‌ని తయారుచేసుకొని నిల్వ చేసుకోవడం మంచిదంటున్నారు.

⚛ మాంసాహారం, చేపలు.. వంటివి ఫ్రై చేసుకున్న తర్వాత వాటిపై ఓ మూత పెట్టి అలాగే వదిలేస్తుంటారు చాలామంది. అయితే దీనివల్ల వాటిలోని జ్యూసులు ఆవిరైపోయి.. అవి మరింత పొడిగా అయిపోతాయట! తద్వారా రుచీ తగ్గిపోతుంది. కాబట్టి ఫ్రై చేశాక వాటిపై నుంచి సిల్వర్‌ ఫాయిల్‌ పేపర్తో కవర్‌ చేస్తే ఈ సమస్య ఉండదు.

⚛ టైం లేదంటూ బ్రేక్‌ఫాస్ట్‌ బయటే తినేయడం, ఇంటికొచ్చేటప్పుడు డిన్నర్‌ బయటి నుంచి తెచ్చుకోవడం లేదంటే ఆన్‌లైన్‌లో ఆర్డరివ్వడం.. వంటివి చాలామందికి అలవాటు. ఇది అకేషనల్‌గా అయితే పర్లేదు.. అంతేకానీ రోజూ ఇలా తింటే మాత్రం లేనిపోని అనారోగ్యాలు తప్పవంటున్నారు నిపుణులు. కాబట్టి కాస్త వీలు చూసుకొని ఇంట్లోనే వండుకోవడం ఉత్తమం.

వంట చేసే క్రమంలో ఇలాంటివన్నీ దాదాపుగా అందరూ చేసే పొరపాట్లే! కాబట్టి ఇకనుంచైనా ఇవి పునరావృతం కాకుండా చూసుకుందాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్