అందుకే ఏడుస్తున్నారేమో..!

పసి పిల్లలు ఏడిస్తే చాలు.. ఆకలి వేస్తోందేమోనని.. వెంటనే పాలివ్వడం, ఆహారం తినిపించడం.. వంటివి చేస్తుంటారు చాలామంది తల్లులు. కానీ అన్ని సందర్భాలూ ఒకేలా ఉండవు....

Published : 20 May 2024 20:02 IST

పసి పిల్లలు ఏడిస్తే చాలు.. ఆకలి వేస్తోందేమోనని.. వెంటనే పాలివ్వడం, ఆహారం తినిపించడం.. వంటివి చేస్తుంటారు చాలామంది తల్లులు. కానీ అన్ని సందర్భాలూ ఒకేలా ఉండవు. ఒక్కోసారి అసలు వాళ్లు ఎందుకు ఏడుస్తున్నారో అర్ధం కాక కొత్తగా తల్లైన మహిళలు కంగారు పడుతుంటారు. ఈ క్రమంలో సాధారణంగా పిల్లలు ఏడవడానికి గల కొన్ని కారణాలు, ఏడుపు ఆపేందుకు పాటించాల్సిన చిట్కాల గురించి తెలుసుకుందాం రండి..

అసౌకర్యంగా అనిపించి..
కొంతమంది పిల్లలు నిద్రొచ్చి కూడా ఏడుస్తుంటారు. ఎందుకంటే పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ పడుకోబెడితే పడుకోరు. వాళ్లు పడుకునే ప్రదేశం మెత్తగా ఉండాలి. లేదంటే అసౌకర్యంగా ఫీలై ఏడుస్తుంటారు. కాబట్టి వాళ్లు పడుకునే ప్రదేశం మెత్తగా ఉందో లేదో ముందే సరిచూసుకోవడం ముఖ్యం. లేదంటే నిద్రొచ్చినా నిద్ర పట్టకపోవడంతో ఏడుస్తుంటారు.
అలాగే ఏ చిన్న శబ్దమైనా పసి పిల్లలు మధ్యలోనే లేస్తుంటారు. దీంతో నిద్ర సరిపోకపోవడం వల్ల చిరాకుకు గురై ఏడుస్తుంటారు. కాబట్టి పిల్లలు పడుకునే ప్రదేశాలు ప్రశాంతంగా, ఎలాంటి శబ్దాలు లేకుండా వారికి సౌకర్యంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం.

ఆకలి వేయడం..
పెద్దవాళ్లే ఆకలికి తట్టుకోలేరు. ఇక పసి పిల్లల సంగతి చెప్పే పనే లేదు. కాబట్టి వాళ్లకు ఆకలి వేసినప్పుడు కూడా బాగా ఏడుస్తుంటారు. మరి వాళ్ల ఏడుపును ఆపాలన్నా, ఈ కారణం వల్ల ఏడవకుండా ఉండాలన్నా టైం ప్రకారం వాళ్లకు పాలివ్వడం, ఆహారం తినిపించడం చాలా ముఖ్యం. ఇలా సమయానుసారం వాళ్ల కడుపు నింపడం పిల్లల ఆరోగ్యానికీ చాలా మంచిది.

డైపర్ మార్చమని..
పసి పిల్లలు దేన్నీ తట్టుకోలేరు. డైపర్ విషయంలోనూ అంతే! డైపర్ తడిగా అయిందంటే చాలు ఇక ఏడుపు మొదలెడతారు. ఎందుకంటే ఆ తడిదనం వల్ల వాళ్లకు అసౌకర్యంగా అనిపిస్తుంటుంది. ఫలితంగా దాన్ని మార్చమని ఏడుపు రూపంలో చెబుతుంటారు. ఇది కొందరికి అర్థం కాక వాళ్లు ఏడుపు ఆపాలని పిల్లల్ని ఎత్తుకుని అటూ ఇటూ తిప్పుతుంటారు. అయినా వాళ్లు ఏడుపు ఆపరు. కాబట్టి కేవలం ఏడ్చినప్పుడు మాత్రమే కాకుండా.. పిల్లలకు వేసిన డైపర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, మార్చుతూ ఉండాలి. లేదంటే ఆ తడి వల్ల వాళ్లకు ఎలర్జీ, దురద వచ్చే అవకాశం ఉంటుంది.

వాతావరణం కూడా..
తల్లి గర్భం నుంచి బిడ్డ బయటికి రాగానే ఏడుస్తుంది. ఎందుకంటే గర్భం లోపల, బయట వాతావరణానికి చాలా తేడా ఉంటుంది. అప్పటి వరకూ వెచ్చటి వాతావరణానికి అలవాటు పడిన బిడ్డ ఒక్కసారిగా బయటికి రావడంతో దాన్ని తట్టుకోలేక ఏడుస్తుంటుంది. అలాగే పసి పిల్లలు కూడా వాతావరణం మరీ వేడిగా, మరీ చల్లగా ఉన్నా ఓర్చుకోలేరు. అందుకే అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకునేందుకు కావాల్సిన అన్ని సదుపాయాల్ని బేబీకి అందించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్