వీటిని పెరుగుతో కలిపి తీసుకోకూడదట!

పెరుగు తినందే భోజనం పూర్తి కాదు చాలామందికి! అందులోనూ ఈ వేసవిలో చలువ చేస్తుందని కొందరు ప్రతిదాంట్లోనూ పెరుగును వాడుతుంటారు. అయితే కొన్ని రకాల పదార్థాలతో పెరుగును కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు....

Published : 20 May 2024 12:43 IST

పెరుగు తినందే భోజనం పూర్తి కాదు చాలామందికి! అందులోనూ ఈ వేసవిలో చలువ చేస్తుందని కొందరు ప్రతిదాంట్లోనూ పెరుగును వాడుతుంటారు. అయితే కొన్ని రకాల పదార్థాలతో పెరుగును కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల అజీర్తితో పాటు ఇతర సమస్యలూ తలెత్తే ప్రమాదం ఉంటుందంటున్నారు. మరి, పెరుగును వేటితో కలిపి తీసుకోకూడదో తెలుసుకుందాం రండి..

*కొంతమంది రుచి కోసం సలాడ్స్‌లో పెరుగును వాడుతుంటారు. పెరుగును క్రీమీగా చిలికి సలాడ్స్‌పై గార్నిష్‌ చేస్తుంటారు. అయితే కొన్ని రకాల పండ్లతో పెరుగును తీసుకోవడం ఆరోగ్యకరం కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మామిడి, జాక్‌ఫ్రూట్‌, ఆప్రికాట్‌.. వంటి పండ్లు శరీరంలో వేడి పుట్టించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. అదే పెరుగు చలువ చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపు తప్పుతుంది. ఫలితంగా శరీరంలో టాక్సిన్లు విడుదలవడంతో పాటు చర్మం పైనా ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు.
*పెరుగన్నంలో వేపుళ్లు, చిప్స్‌ వంటివి నంజుకొని తినే అలవాటు చాలామందికి ఉంటుంది. అయితే ఇలాంటి నూనె పదార్థాల్ని పెరుగుతో కలిపి తీసుకున్నప్పుడు కడుపుబ్బరం, కడుపునొప్పి, అజీర్తి, గ్యాస్ట్రిక్‌ సమస్యలు వేధిస్తాయంటున్నారు నిపుణులు. ఇందుకు కారణం.. ఈ ఫుడ్‌ కాంబినేషన్‌ జీర్ణక్రియను నెమ్మదించేలా చేయడమే!

*చేపల కూర తిన్నాక పెరుగు తినకూడదంటారు పెద్దలు. ఎందుకంటే ఈ రెండింటినీ ఒకేసారి తీసుకోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఫలితంగా కడుపు పట్టేసినట్లుగా, నొప్పిగా అనిపిస్తుంది. చేపలే కాదు.. చికెన్‌, మటన్‌.. వంటి మాంసాహారం కూడా పెరుగుతో కలిపి తీసుకోకూడదంటున్నారు నిపుణులు. కాబట్టి పొట్ట సంబంధిత సమస్యల్ని తెచ్చిపెట్టే ఈ ఫుడ్‌ కాంబినేషన్‌ని ఎంత దూరం పెడితే ఆరోగ్యానికి అంత మంచిది.
*నిమ్మజాతి పండ్లు, టొమాటో, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌, మసాలాలు దట్టించిన పదార్థాల్లో ఆమ్ల గుణాలు అధికంగా ఉంటాయి. వీటిని పెరుగుతో కలిపి తీసుకున్నప్పుడు పొట్టలో పీహెచ్‌ స్థాయులు అదుపు తప్పుతాయి. తద్వారా అజీర్తి, పొట్టలో ఆమ్లత్వం పెరిగిపోయి అసౌకర్యంగా అనిపించడం.. వంటి సమస్యలొస్తాయి. కాబట్టి ఈ కాంబినేషన్‌కి దూరంగా ఉండడం మంచిది.

*వంకాయ-పెరుగు కాంబినేషన్‌ కూడా ఆరోగ్యకరం కాదంటున్నారు నిపుణులు. వంకాయల్లో ఉండే టానిన్‌ పెరుగుతో కలిసినప్పుడు జీర్ణ సంబంధిత సమస్యలొచ్చే ప్రమాదం ఉందంటున్నారు. అంతేకాదు.. శరీరం గ్రహించే పోషకాల పైనా ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందట!
*ఆకుకూరల్ని పెరుగుతో కలిపినప్పుడు.. ఆకుకూరల్లోని ఆక్సలేట్స్‌, పెరుగులోని క్యాల్షియంను నశింపజేస్తాయి. తద్వారా క్యాల్షియం లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండూ కలిపి తీసుకోవడమూ మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
*పెరుగు, పులియబెట్టిన ఆహార పదార్థాలు/పచ్చళ్లు.. ఈ రెండింటిలోనూ ప్రొబయోటిక్స్‌ ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో ప్రొబయోటిక్‌ స్థాయులు పెరిగిపోయి.. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు.
కాబట్టి ఈ ఫుడ్‌ కాంబినేషన్స్‌కి దూరంగా ఉంటూనే.. పెరుగును ఓట్స్‌, మ్యూజ్లీ, డ్రైఫ్రూట్స్‌.. వంటి పదార్థాలతో కలిపి తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఫలితంగా శరీరానికి శక్తి అందడంతో పాటు అదనపు ఆరోగ్య ప్రయోజనాలూ చేకూరతాయంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్