Kitchen Tips: ఇవి ఎక్కువ కాలం మన్నాలంటే..!
అవెన్, వాషింగ్ మెషీన్, డిష్‌వాషర్.. ఇలా ఇంట్లో ఎన్నో ఖరీదైన వస్తువులు ఉపయోగిస్తుంటాం. అయితే వాటి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉందంటున్నారు....
అవెన్, వాషింగ్ మెషీన్, డిష్‌వాషర్.. ఇలా ఇంట్లో ఎన్నో ఖరీదైన వస్తువులు ఉపయోగిస్తుంటాం. అయితే వాటి విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. మరి, అవి ఎక్కువ కాలం మన్నాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..!
తరచూ శుభ్రం చేయాలి...
కిచెన్‌లో మనం తరచూ ఉపయోగించే అవెన్, టోస్టర్, గ్రిల్.. వంటి వస్తువులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. వాటిలో వండేటప్పుడు నూనె, ఆహార పదార్థాల అవశేషాలు.. వంటివి పాత్ర లోపల అతుక్కుపోతుంటాయి. వీటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే వాటి పనితీరు క్రమంగా దెబ్బతింటుంది. కాబట్టి వంట పూర్తై, ఆయా వస్తువులు చల్లబడిన తర్వాత డిష్ వాషింగ్ లిక్విడ్ లేదా వెనిగర్ కలిపిన నీటిలో ఒక క్లాత్‌ను ముంచి, దాంతో వాటిని శుభ్రం చేయాలి. ఆపై పొడిగా తుడవాలి. ఇలా చేయడం వల్ల అవి ఎక్కువ కాలం మన్నుతాయి.
వాటిని చెక్ చేస్తున్నారా?
కొంతమంది వాషింగ్ మెషీన్‌లో ఎలా ఉన్న బట్టలు అలానే వేస్తుంటారు. అలా వేసిన కొద్దిసేపటికి అందులోంచి శబ్దాలు వస్తుంటాయి. తీరా ఏంటని చూస్తే ప్యాంట్ జేబుల్లోంచి కాయిన్స్ బయట పడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ కాయిన్స్ మెషీన్‌లో ఇరుక్కుపోయి అందులోని డ్రమ్‌ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా రిపేర్‌కి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి రావచ్చు. కాబట్టి వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసే ముందే పాకెట్లన్నీ చెక్ చేయడం, మడతలు విడదీసి వేయడం ఉత్తమం.
అలాగే వాషింగ్ మెషీన్‌లో బట్టలను పరిమితంగానే వేయాలి. కానీ, కొంతమంది ఒక్కసారికే పని అయిపోవాలని లోడ్‌కు మించి వేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మెషీన్‌లో ఉండే డ్రమ్ పనితీరు క్రమంగా తగ్గిపోతుంది. కాబట్టి మెషీన్ సామర్థ్యానికి తగ్గట్లే అందులో బట్టలు వేయాలి.
ఆ పాత్రలు వద్దు...
డిష్‌వాషర్లకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. అయితే ఇందులో వేసే పాత్రల విషయంలో శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా షార్ప్‌గా ఉండే పాత్రలు డిష్‌వాషర్‌లో వేయడం వల్ల అందులోని వినైల్ కోటింగ్ దెబ్బతినే అవకాశం ఎక్కువ. దాంతో తుప్పు సమస్య పొంచి ఉంటుంది. కాబట్టి డిష్ వాషర్‌ని ఉపయోగించేటప్పుడు షార్ప్‌గా ఉండే కత్తులు, ఫోర్క్స్, స్పూన్లు వంటి వాటిని అందులో వేయకపోవడం మంచిది.
తడి గుడ్డతోనే..!
కొంతమంది గ్యాస్ స్టౌ బర్నర్లని శుభ్రం చేయడానికి సబ్బుని ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల బర్నర్ రంధ్రాలు క్రమంగా మూసుకుపోయి మంట సరిగ్గా రాదు. కాబట్టి, వీటిని శుభ్రం చేసేటప్పుడు తడి గుడ్డను మాత్రమే ఉపయోగించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.