రోజూ అవెన్‌లోనే వంట చేస్తున్నారా?

సాధారణంగా అవెన్‌ను కేక్స్‌, పిజ్జా, బర్గర్‌, ఇతర బేకింగ్‌ ఐటమ్స్‌ని తయారుచేయడానికి ఉపయోగిస్తుంటాం. కానీ కొంతమంది వంట పని సులభంగా పూర్తవుతుందన్న ఉద్దేశంతో దీన్ని రోజూ వాడుతుంటారు.

Published : 01 Dec 2023 19:55 IST

సాధారణంగా అవెన్‌ను కేక్స్‌, పిజ్జా, బర్గర్‌, ఇతర బేకింగ్‌ ఐటమ్స్‌ని తయారుచేయడానికి ఉపయోగిస్తుంటాం. కానీ కొంతమంది వంట పని సులభంగా పూర్తవుతుందన్న ఉద్దేశంతో దీన్ని రోజూ వాడుతుంటారు. కాయగూరలు ఉడికించడం దగ్గర్నుంచి కూరలు తయారుచేసే దాకా.. ఇలా ప్రతి పని కోసం దీన్ని ఉపయోగిస్తుంటారు. మీరూ ఇలాగే చేస్తున్నారా? అయితే ఈ అలవాటు మానుకోమంటున్నారు నిపుణులు. ఇలా రోజూ అవెన్‌లో వండిన పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. మరి, రోజూ అవెన్‌లో ఎందుకు వండుకోకూడదో తెలుసుకుందాం రండి..

పోషకాలు నశిస్తాయి!

రోజూ మనం తీసుకునే ఆకుకూరలు, కాయగూరలు, ఇతర పదార్థాల్లో ఎన్నో పోషక విలువలుంటాయి. వంట చేసే క్రమంలో వేడికి కొన్ని పోషకాలు నశిస్తుంటాయి. అందుకే ఈ నష్టం జరగకుండా తక్కువ మంటపై కూరలు తయారుచేసుకుంటాం. కానీ అవెన్‌లో వండుకోవడం వల్ల.. అందులో విద్యుదయస్కాంత తరంగాల నుంచి వెలువడే అధిక ఉష్ణోగ్రతకు ఈ పోషకాలు నశిస్తాయి. ముఖ్యంగా నీటిలో కరిగే విటమిన్లైన ‘సి’, ‘బి’ వంటి పోషకాలు ఆహారం నుంచి పూర్తిగా తొలగిపోతాయి. ఫలితంగా శరీరానికి పోషకాలు అందక.. కొంత కాలానికి పోషకాహార లోపం తలెత్తుతుంది. ఇది వివిధ రకాల అనారోగ్యాలకు కారణమవుతుంది. కాబట్టి అకేషనల్‌గా, అది కూడా బేకింగ్‌ పదార్థాలు తప్ప అవెన్‌లో రోజూ వంట మంచిది కాదంటున్నారు నిపుణులు.

దీర్ఘకాలిక సమస్యలు!

పాలకూర, క్యారట్స్‌, బంగాళాదుంపలు, బ్రకలీ.. వంటి ఆహార పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్‌ని తటస్థీకరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ ఆహార పదార్థాల్ని రోజూ అవెన్‌లో ఉడికించడం, కూరలు తయారుచేసుకోవడం వల్ల.. అందులో నుంచి వెలువడే అధిక వేడికి ఈ యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి. ఫలితంగా ఫ్రీరాడికల్స్‌ పెరిగిపోయి.. గుండె సమస్యలు, క్యాన్సర్‌, వాపు సంబంధిత సమస్యలు.. వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే అవెన్‌ను పక్కన పెట్టి.. వీలైనంత వరకు సంప్రదాయ పద్ధతుల్లోనే వండుకోవడం ఉత్తమం అంటున్నారు.

సరిగ్గా ఉడక్కపోతే..!

మనం స్టౌ ఉపయోగించి వంట చేసే క్రమంలో.. ఆయా పదార్థాల్ని మధ్యమధ్యలో కలుపుతుంటాం. దీనివల్ల అవి పూర్తిగా ఉడుకుతాయి. అదే అవెన్‌లో ఉడికించేటప్పుడు ఈ సౌకర్యం ఉండదు. మధ్యలో ఓసారి బయటికి తీసి కలిపి.. తిరిగి అవెన్‌లో పెట్టినా.. కొన్ని పదార్థాలు సరిగ్గా ఉడకవు. ముఖ్యంగా మాంసం విషయంలో ఇలాంటి సమస్యలొస్తాయి. ఇలా పూర్తిగా ఉడకని ఆహార పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. పైగా ఉడకని చోట ఆహారంపై బ్యాక్టీరియా నశించదు. ఇదీ అనారోగ్యకరమే! కాబట్టి మాంసాహారం కోసమైనా, ఇతర పదార్థాల తయారీ కోసమైనా రోజూ అవెన్‌ను వాడకపోవడం మంచిది. కాస్త సమయం వెచ్చించి సంప్రదాయ పద్ధతుల్లో స్టౌ మీద వండుకోవడమే శ్రేయస్కరం!

ఆ బౌల్స్‌ వాడుతున్నారా?

మైక్రోవేవ్‌ అవెన్‌లో వంట చేసుకోవడానికి ప్రత్యేకమైన బౌల్స్‌, ట్రేస్‌ అందుబాటులో ఉంటాయి. అయితే కొంతమంది కొన్నిసార్లు, ఈ బౌల్స్‌ కాకుండా.. ప్లాస్టిక్‌తో తయారుచేసిన బౌల్స్‌, ఇతర ర్యాపింగ్‌ మెటీరియల్‌ని వాడుతుంటారు. అయితే అవెన్‌లో వెలువడే అధిక వేడికి ఈ ప్లాస్టిక్‌ కరిగి ఆహారంలోకి చేరే ప్రమాదం ఉంది. దీనివల్ల ఆ పదార్థాలు విషతుల్యమవుతాయి. ఇలాంటి పదార్థాల్ని తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో తీవ్రమైన అనారోగ్యాలు తప్పవంటున్నారు నిపుణులు. అందుకే మైక్రోవేవ్‌ని అరుదుగా ఉపయోగించడం, అందుకోసమూ ప్రత్యేకమైన బౌల్స్‌ వాడడమే మంచిదంటున్నారు.

రుచి మారిపోతుంది!

అవెన్‌ని ఉపయోగించడం వరకు బాగానే ఉన్నా.. దాన్ని శుభ్రం చేసే విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఈ క్రమంలో అవెన్‌లో ఆహార పదార్థాల అవశేషాలు ఉండిపోవడం, మరోసారి అవెన్‌ని ఉపయోగించుకున్నప్పుడు.. ఆ అవశేషాలు తాజా ఆహారంపై ప్రతికూల ప్రభావం చూపడం.. వంటి కారణాల వల్ల పదార్థాలు రుచిని కోల్పోతాయి.. వాటి వాసనా మారిపోతుంటుంది. ఇదీ ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి అవెన్‌ను అరుదుగా ఉపయోగించడం, ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం మర్చిపోవద్దు.

రిపేర్లు తప్పనిసరి!

విద్యుదయస్కాంత తరంగాలు/రేడియేషన్‌ ద్వారా అవెన్‌లో అధిక ఉష్ణోగ్రత వెలువడుతుంది. ఈ వేడి వల్లే పదార్థాలు ఉడుకుతాయి. అయితే కొన్నిసార్లు అవెన్‌ పనితీరులో ఏవైనా లోపాలున్నా, డోర్‌ డ్యామేజ్‌ అయినా.. రేడియేషన్‌ లీకయ్యే ప్రమాదాలున్నాయంటున్నారు నిపుణులు. ఫలితంగా ఆహార పదార్థాలపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది.. అలాగే ఆ రేడియేషన్‌ వాతావరణంలోకీ విడుదలై మన ఆరోగ్యానికీ నష్టం వాటిల్లుతుంది. అలా జరగకుండా ఉండాలంటే.. అవెన్‌ని రోజూ వాడకపోవడంతో పాటు అవసరమైతే వెంటనే ఆయా రిపేర్లు చేయించడం కూడా తప్పనిసరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్