అందమైన ముగ్గులు.. క్షణాల్లో సిద్ధమిలా..!

సంక్రాంతి అంటేనే చుక్కల ముగ్గులు! కానీ ప్రస్తుతం ట్రెండు మారుతోంది. రాన్రానూ చుక్కలు కాస్తా ఆకర్షణీయమైన డిజైన్లుగా రూపుదిద్దుకుంటున్నాయి. అతివలు కూడా వివిధ రకాల డిజైన్లను తీర్చిదిద్దుతూ తమ సృజనాత్మకతను చాటుకుంటున్నారు. ఏదేమైనా రంగవల్లికను తీర్చిదిద్దాలంటే దాని డిజైన్‌ను....

Published : 13 Jan 2023 18:37 IST

సంక్రాంతి అంటేనే చుక్కల ముగ్గులు! కానీ ప్రస్తుతం ట్రెండు మారుతోంది. రాన్రానూ చుక్కలు కాస్తా ఆకర్షణీయమైన డిజైన్లుగా రూపుదిద్దుకుంటున్నాయి. అతివలు కూడా వివిధ రకాల డిజైన్లను తీర్చిదిద్దుతూ తమ సృజనాత్మకతను చాటుకుంటున్నారు. ఏదేమైనా రంగవల్లికను తీర్చిదిద్దాలంటే దాని డిజైన్‌ను బట్టి తగిన సమయం కేటాయించాల్సి ఉంటుంది. కానీ కొంతమందికి వివిధ పనుల రీత్యా ఉదయాన్నే ఈ సమయం దొరక్కపోవచ్చు. అలాంటి వారికోసమే ప్రస్తుతం విభిన్న డిజైన్లలో రూపొందించిన ‘రంగోలీ స్టెన్సిల్స్‌’ (ముగ్గు అచ్చులు) అందుబాటులోకొచ్చాయి.

వాడకం ఇలా!

గుండ్రంగా, చతురస్రాకారంగా, దీర్ఘచతురస్రాకారంగా, అర్ధచంద్రాకారంలో.. ఇలా వేర్వేరు ఆకృతుల్లో ఈ స్టెన్సిల్స్‌ లభిస్తున్నాయి. పువ్వులు, ఆకులు, పూలతలు, నెమళ్లు, పొంగలి కుండ.. వంటి విభిన్న డిజైన్లలో రూపొందించిన ఈ షీట్స్‌/స్టెన్సిల్స్‌లో ఆయా డిజైన్‌ను బట్టి రంధ్రాలు లేదా జాలీ లాంటి అమరిక ఉంటుంది. దీన్ని మీరు ముగ్గు వేయాలనుకున్న ప్రదేశంలో అమర్చుకొని.. మీకు కావాల్సిన చోట కావాల్సిన రంగుని నింపుకోవచ్చు.. జాలీ స్టెన్సిల్‌ అయితే.. డిజైన్‌ను బట్టి మీరు ఎంచుకునే కలర్‌ కాంబినేషన్‌ ప్రకారం ఆయా రంగుల్ని స్టెన్సిల్‌పై వేసి నెమ్మదిగా రుద్దితే.. దాని అచ్చు కింద నేలపై పడుతుంది. ఇలా డిజైన్‌ మొత్తం పూర్తయ్యాక స్టెన్సిల్‌ తొలగిస్తే చాలు.. ఆకర్షణీయమైన ముగ్గు నిమిషాల్లో రడీ అయిపోతుంది. కావాలంటే తెల్ల ముగ్గు పిండితో అవుట్‌లైన్‌ వేసుకోవచ్చు.

ముగ్గే అలంకరణ వస్తువైతే..!

కేవలం ఇవే కాదు.. విభిన్న డిజైన్లలో రూపొందించిన రంగోలీ మ్యాట్స్‌ సైతం మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిలో ఉండే గుంతల్లో మీకు కావాల్సిన రంగులు నింపుకొని.. ముంగిట్లో అమర్చుకోవడమే! పని పూర్తయ్యాక శుభ్రం చేసి.. మళ్లీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు.. అంతేకాదు.. ఈ గుంతల్లో చక్కటి కలర్‌ కాంబినేషన్ని ఎంచుకొని ఆయా రంగులతో పెయింట్ చేస్తే.. గోడకు ఫ్రేమ్‌గానూ అలంకరించుకోవచ్చు.

బోర్డర్స్‌.. కార్నర్స్!

ముగ్గొక్కటీ పెడితే సరిపోదు.. దాని చుట్టూ చక్కటి బోర్డర్స్‌తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దితేనే ఆ రంగవల్లికకు అందం.. ఇంటికి పండగ కళ.. రెండూ వస్తాయి. అయితే అలాంటి బోర్డర్స్‌ని సైతం సులభంగా వేయడానికి వీలుగా విభిన్న డిజైన్లతో కూడిన బోర్డర్‌ స్టెన్సిల్స్‌ ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. పువ్వులు, ఆకులు, దీపాలు, స్వస్తిక్‌, ఓం, కలశం, పెద్ద పరిమాణంలో ఉండే దీపపు కుందులు.. ఇలా మీకు కావాల్సినట్లుగా ముగ్గు బోర్డర్‌ని తీర్చిదిద్దుకోవచ్చు. అలాగే వీటితో పూజ గది ముందూ డిజైన్‌ వేసుకోవచ్చు. ఇక గడప ముందు, గది కార్నర్స్‌లోనూ కొంతమంది సృజనాత్మకంగా ముగ్గుల్ని తీర్చిదిద్దుతుంటారు. అలాంటి వారు అర్ధచంద్రాకారంలో ఉండే విభిన్న డిజైనర్‌ స్టెన్సిల్స్‌ని ఉపయోగించుకోవచ్చు.

ఇక వీటితో పాటు ముగ్గు సులభంగా వేయడానికి, అందులో సులభంగా రంగులు నింపుకోవడానికి వీలుగా రంగోలీ ఫిల్లర్స్‌.. వంటివి కూడా దొరుకుతున్నాయి.

ఇలా చిటికెలో మీ ముంగిట్లో కొలువుదీరిన రంగోలీని గొబ్బెమ్మలు, నవధాన్యాలు, పూలు, పూరేకలు, సంక్రాంతి థీమ్‌ ఉట్టిపడేలా వివిధ అలంకరణ వస్తువులతో అలంకరిస్తే.. అందరి చూపూ మీ ముంగిట పైనే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్