దుమ్ము బాధ పోవాలంటే..!

ఈ వేసవిలో పొడి వాతావరణం వల్ల ఇంట్లో దుమ్ము చేరడం సహజం. రోజూ శుభ్రం చేసినప్పటికీ ఆయా వస్తువులపై, ఇంటి మూలల్లో కంటికి కనిపించని దుమ్ము కణాలు ఉండిపోతాయి. అలాగని ప్రతి వస్తువునూ తుడిచే సమయం, ఓపిక రోజూ ఉండకపోవచ్చు.

Published : 15 Mar 2024 18:10 IST

ఈ వేసవిలో పొడి వాతావరణం వల్ల ఇంట్లో దుమ్ము చేరడం సహజం. రోజూ శుభ్రం చేసినప్పటికీ ఆయా వస్తువులపై, ఇంటి మూలల్లో కంటికి కనిపించని దుమ్ము కణాలు ఉండిపోతాయి. అలాగని ప్రతి వస్తువునూ తుడిచే సమయం, ఓపిక రోజూ ఉండకపోవచ్చు. అందుకే కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఈ కాలంలో ఇంట్లో దుమ్ము బెడదను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి...

⚛ ఇంటిని శుభ్రం చేయడానికి చాలామంది చీపురును వాడుతుంటారు. అయితే దీనివల్ల మన కంటికి కనిపించని దుమ్ము కణాలు నేల పైనే ఉండిపోతాయి. అదే వ్యాక్యూమ్‌ క్లీనర్‌ని ఉపయోగిస్తే ఇంటి మూలమూలల నుంచి దుమ్మును తొలగించచ్చు. రోజూ పొడి వ్యాక్యూమ్ క్లీనర్స్‌తో శుభ్రం చేస్తూనే.. వారానికోసారి లేదా రెండుసార్లు తడి వ్యాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్‌ చేస్తే ఫలితం ఉంటుంది.

⚛ చెప్పులు, షూస్‌.. వంటివి బయటి నుంచి ఎక్కువ దుమ్మును మోసుకొస్తాయి. కాబట్టి వాటిని ఇంట్లో దాకా తీసుకురాకుండా.. బయటే వదిలేయాలి. అలాగే ముఖద్వారం లోపలే కాకుండా.. బయట కూడా ఒక మృదువైన ఫ్యాబ్రిక్‌తో తయారుచేసిన డోర్‌మ్యాట్‌ వేస్తే.. మన పాదాలపై ఉన్న కంటికి కనిపించని దుమ్మును అది ఆకర్షిస్తుంది. తద్వారా ఇంట్లోకి దుమ్ము చేరకుండా జాగ్రత్తపడచ్చు.

⚛ కొంతమందికి ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే అలవాటుంటుంది. అయితే వాటిని బయటికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే వాడుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవడమూ ముఖ్యమే.

⚛ ఈ కాలంలో సన్నటి దుమ్ము రేణువులు బెడ్‌షీట్స్‌, సోఫా కవర్స్‌, కర్టెన్లపై చేరుతుంటాయి. అందుకే వాటిని కాస్త గట్టిగా దులిపితే దుమ్ము లేవడం గమనిస్తుంటాం. అందుకే వీటిని వారానికోసారి మార్చి శుభ్రం చేయడం మంచిది.

⚛ బయటి నుంచి వచ్చే దుమ్ము వల్ల కిటికీ గ్రిల్స్‌/బ్లైండ్స్‌ త్వరగా మురికిగా మారతాయి. ఇలాంటప్పుడు డిటర్జెంట్‌ నీళ్లు లేదా నీళ్లలో ముంచి పిండిన సాక్స్‌తో వాటిని శుభ్రం చేస్తే.. ఇంట్లో దుమ్ము బెడద ఉండదు.. ఇల్లు కూడా నీట్‌గా కనిపిస్తుంది. సాక్స్‌కు ప్రత్యామ్నాయంగా విభిన్న లేయర్లతో కూడిన ‘బ్లైండ్‌ క్లీనర్స్‌’ కూడా ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి.

⚛ డోర్‌మ్యాట్స్‌, కార్పెట్స్‌లో కంటికి కనిపించని దుమ్ము ఎక్కువగా చేరుతుంది. వాటిని వ్యాక్యూమ్ క్లీనర్‌తో తరచూ శుభ్రం చేస్తూనే.. వారం లేదా పదిహేను రోజులకోసారి మార్చి శుభ్రం చేయడం మంచిది.

⚛ ఇంట్లో కొన్ని రకాల సామగ్రిపై పేరుకున్న దుమ్మును తొలగించాలంటే పెద్ద పనిలా అనిపిస్తుంటుంది.. శరీరం బద్ధకిస్తుంది. ఇలాంటప్పుడు ‘లింట్‌ రోలర్‌’ ఉపయోగిస్తే పని సులభంగా పూర్తవుతుంది. పేరుకు తగ్గట్లే రోలర్‌లా ఉండే దీంతో ఆయా వస్తువుల ఉపరితలంపై రోల్‌ చేస్తే చాలు.. వాటిపై ఉన్న సన్నటి దుమ్మును కూడా ఇది ఆకర్షించుకొని వాటిని మెరిపిస్తుంది.

⚛ ఇంట్లో షెల్ఫులు/అరల్లో ఎక్కువగా దుమ్ము చేరుతుంటుంది. పైగా ఆ దుమ్ము ఓ పట్టాన వదలదు కూడా! ఇలాంటప్పుడు మృదువుగా ఉండే ‘క్లీనింగ్‌ డస్టర్‌’ని ఉపయోగిస్తే పని సులువవుతుంది.

⚛ పెంపుడు జంతువుల చర్మంపై ఉండే వెంట్రుకల వల్ల కూడా ఇంట్లోకి దుమ్ము చేరుతుంది. అలా జరగకూడదంటే.. వాటికి రోజూ స్నానం చేయించడం, అవి తిరిగే, పడుకునే ప్రదేశాల్ని నీట్‌గా ఉంచడం మంచిది. తద్వారా వాటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

⚛ ఇష్టంతోనో లేదంటే గృహాలంకరణలో భాగంగానో.. ఈ మధ్య చాలామంది ఇంట్లో వివిధ రకాల ఇండోర్‌ మొక్కల్ని ఏర్పాటుచేసుకుంటున్నారు. అయితే వీటిలో కొన్ని దుమ్మును శోషిస్తాయంటున్నారు నిపుణులు. కలబంద, స్నేక్‌ ప్లాంట్‌, బోస్టన్‌ ఫెర్న్‌, పీస్‌ లిల్లీ, రబ్బర్‌ ప్లాంట్‌.. వంటివి అందులో కొన్ని! వీటిని ఇంట్లో ఏర్పాటుచేసుకుంటే ఇటు అలంకరణ వస్తువుగా అందాన్నిస్తుంది.. అటు ఇంట్లో దుమ్ము లేకుండా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్