Mindful Eating: మనసు పెట్టి తింటున్నారా?

మూడు పూటలా తిన్నామా, కడుపు నిండిందా అనుకుంటామే.. కానీ ఏం తింటున్నాం.. అందులో నుంచి శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతున్నాయా? అని ఆలోచించే వారు మాత్రం చాలా తక్కువమంది....

Published : 10 Jun 2024 22:54 IST

మూడు పూటలా తిన్నామా, కడుపు నిండిందా అనుకుంటామే.. కానీ ఏం తింటున్నాం.. అందులో నుంచి శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతున్నాయా? అని ఆలోచించే వారు మాత్రం చాలా తక్కువమంది ఉంటారు. ఈ నిర్లక్ష్యమే వివిధ రకాల అనారోగ్యాలకు కారణమవుతుందంటున్నారు నిపుణులు. అందుకే తినేటప్పుడు ‘మనిషిక్కడ.. మనసెక్కడో’ అన్నట్లుగా కాకుండా.. తీసుకునే ఆహారం పైనే మనసు లగ్నం చేయమంటున్నారు. ‘మైండ్‌ఫుల్‌ ఈటింగ్‌’గా పిలిచే ఈ ఆహారపుటలవాటు వల్ల అటు ఆహారం రుచిని ఆస్వాదించచ్చు.. ఇటు ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

నచ్చిన పని చేసేటప్పుడు మనసును పూర్తిగా దాని పైనే కేంద్రీకరిస్తాం.. ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తపడతాం. అదే తిండి విషయానికొస్తే.. ఓవైపు ఆహారం తీసుకుంటూనే.. మరోవైపు గ్యాడ్జెట్స్‌ వాడడం, ఇతరులతో మాట్లాడడం.. వంటివి చేస్తుంటాం. ఈ అలవాటు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల స్థూలకాయం, గుండె సంబంధిత సమస్యలు, శరీరంలో కొవ్వుల శాతం పెరగడం, టైప్‌-2 మధుమేహం, ఈటింగ్‌ డిజార్డర్స్‌, మానసిక సమస్యలు.. వంటివి తలెత్తే ప్రమాదం పొంచి ఉందని ఓ అధ్యయనంలో తేలింది. అందుకే భోజనం చేసేటప్పుడు మనసును పూర్తిగా ఆహారం పైనే పెట్టి.. ఆస్వాదిస్తూ తినడం మంచిదంటున్నారు నిపుణులు.

ఇదీ వ్యాయామం లాంటిదే!

చేసే పనిపై మనసును లగ్నం చేస్తే.. దానిపై అవగాహన పెరుగుతుంది.. సృజనాత్మక ఆలోచనలొస్తాయి.. ఉత్సాహంగా, ఇంకాస్త బాగా చేయగలుగుతాం.. ఇదేవిధంగా తినేటప్పుడు మనసును పూర్తిగా తిండి పైనే పెడితే.. ఏం తింటున్నామో అర్థమవుతుంది.. అది ఆరోగ్యకరమైనదేనా?, అందులో మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయా/లేదా? అనేదీ గ్రహించవచ్చు.. తినే పదార్థం గురించి అవగాహన కూడా పెరుగుతుంది. ఇంకొన్ని హెల్దీ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం దొరుకుతుంది. ఇవన్నీ ఆరోగ్యాన్ని సొంతం చేసేవే! అయితే ఇలా మనసు పెట్టి తినడం కూడా ఓ వ్యాయామం లాంటిదే అంటున్నారు నిపుణులు. దీనివల్ల ఆందోళన, యాంగ్జైటీ, ఈటింగ్‌ డిజార్డర్స్‌, ఇతర మానసిక సమస్యలు.. వంటివన్నీ దూరమవుతాయంటున్నారు. అంతేకాదు.. మనసు పెట్టి తినడం వల్ల ఇంకా బోలెడన్ని ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చంటున్నారు.


ఎన్నెన్నో ప్రయోజనాలు!

మనసు పెట్టి తినడం వల్ల ఆకలిని గుర్తించగలుగుతాం. తద్వారా అతిగా తినకుండా జాగ్రత్తపడచ్చు. ఎమోషనల్‌ ఈటింగ్‌ (మనసును తృప్తి పరిచే ఆహారం)కు అడ్డుకట్ట వేయచ్చు. ఫలితంగా ఏది పడితే అది తిని అనారోగ్యాల పాలు కాకుండా జాగ్రత్తపడచ్చు.

తీసుకునే ఆహారంపై పూర్తి దృష్టి పెడితే.. మన ప్లేట్లో ఉన్నది హెల్దీనా కాదా అనేది అర్థమవుతుంది. ఫలితంగా ఆరోగ్యకరమైన ఆప్షన్లను ఎంచుకోవచ్చు.. కడుపు నిండుగా కాకుండా.. రెండు ముద్దలు తక్కువ తిని.. బరువూ తగ్గచ్చు.

భోజనం చేసేటప్పుడు మనసును పూర్తిగా లగ్నం చేయడం వల్ల.. శరీరంలో కార్టిసాల్‌ హార్మోన్‌ స్థాయులు తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఫలితంగా ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ వంటివి దూరమవుతాయి.

మనసు పెట్టి తినడం వల్ల ఎక్కువగా తినే అలవాటుకు చెక్‌ పెట్టచ్చు. అలాగే ఏది పడితే అది తినకుండా జాగ్రత్తపడచ్చు.. దీనివల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు. ఫలితంగా గ్యాస్ట్రిక్‌ సమస్యలు, ఆహారం జీర్ణం కాకపోవడం, కడుపుబ్బరం, మలబద్ధకం.. వంటివి రాకుండా ఉంటాయి.

సమయం సర్దుబాటు కాక కొంతమంది అటు తింటూనే, ఇటు వేరే పనులు చేస్తుంటారు. దీనివల్ల ఆహారం రుచిని ఆస్వాదించలేకపోతారు.. తిన్నామన్న సంతృప్తీ దక్కదు.. ఈ అలవాటు చిరుతిండ్ల పైకి మనసు మళ్లేలా చేస్తుందంటున్నారు నిపుణులు. ఫలితంగా లేనిపోని అనారోగ్యాలు కొనితెచ్చుకున్నట్లే అవుతుంది. అందుకే తినే కాసేపైనా.. ఆహారం పైనే మనసు లగ్నం చేయాలి.

నచ్చిన పని చేసినప్పుడు మనసు ఉత్సాహంతో ఉరకలెత్తుతుంది.. అదేవిధంగా నచ్చిన ఆహార పదార్థాల్ని ఆస్వాదిస్తూ తినడం వల్ల మరింత శక్తిమంతంగా, చురుగ్గా మారచ్చంటున్నారు నిపుణులు.


ఇలా తినాలట!

ఆహారం పైనే పూర్తి దృష్టి పెట్టాలన్నా, రుచిని ఆస్వాదించాలన్నా.. భోజనం చేసే క్రమంలో కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు.

తినేటప్పుడు మొబైల్‌, టీవీ.. తదితర గ్యాడ్జెట్స్‌కి దూరంగా ఉండాలి.

పనులున్నాయని గబగబా తినేయడం కాకుండా.. 20-30 నిమిషాల సమయం భోజనానికి కేటాయించాలి.

ఎంత తింటామో, అంతా ఒకేసారి ప్లేట్లో పెట్టుకోవడం కాకుండా.. కొద్దికొద్దిగా ఆహారం ప్లేట్లో వడ్డించుకోవాలి. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారం ప్లేట్లో కనిపిస్తే త్వరగా తినేయాలన్న ఆతృత పెరుగుతుంది. తద్వారా మనసు పెట్టి తినలేం. కాబట్టి తక్కువ మొత్తంలో.. ఓ ముద్ద తగ్గించి తినడం మంచిది.

కొంతమంది ఆహారాన్ని నమలకుండా మింగేస్తుంటారు. దీనివల్ల ఆహారం రుచిని ఆస్వాదించలేకపోతారు. ఇదీ మనసు పెట్టకుండా తిన్నట్లేనట! అందుకే నోట్లో పెట్టుకున్న ముద్దను నెమ్మదిగా నములుతూ.. రుచిని ఆస్వాదిస్తూ తింటే ఆహారంపై ప్రేమ పెరుగుతుంది.

తినే ముందు, మధ్యలో, తిన్నాక.. ఇలా ఎప్పటికప్పుడు ఆకలిని పరిశీలించుకుంటూ తినడం ముఖ్యం. తద్వారా శరీరానికి ఎంత ఆహారం అవసరమో అన్న విషయం అవగతమవుతుంది. ఫలితంగా ఎక్కువ ఆహారం తినకుండా జాగ్రత్తపడచ్చు.

చాలామందికి కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుతూ తినడం అలవాటు! ఈ క్రమంలో ఇతర విషయాలు కాకుండా.. మీరు తినే ఆహారం గురించే మాట్లాడుకోవడం, ఆరోగ్యకరమైన ఆప్షన్ల గురించి పంచుకోవడం, రుచుల్ని ప్రశంసించడం కూడా మైండ్‌ఫుల్‌ ఈటింగ్‌ కిందకే వస్తుంది.

కొంతమందికి డైరీ రాయడం అలవాటు! ఇలాంటి వారు ఫుడ్‌ డైరీ అలవాటు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ఆ రోజు తిన్న ఆహార పదార్థాలు-వాటిలోని పోషకాల గురించి అందులో పొందుపరచుకోవచ్చు.. ఫలితంగా ఆహారంపై ప్రేమ పెరుగుతుంది. హెల్దీ ఆప్షన్లు ఎంచుకోవాలన్న మక్కువా అలవడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్