Summer Diet: అందుకే వేసవిలో వీటిని తీసుకోవాలి!

వేసవిలో వాతావరణంలోని విపరీతమైన వేడి శరీరంలోని నీటినంతటినీ చెమట రూపంలో పీల్చేస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక చెమట అధికంగా పట్టడం వల్ల శరీరంలోని ఎలక్ర్టోలైట్స్‌ స్థాయుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి....

Published : 20 May 2024 12:42 IST

వేసవిలో వాతావరణంలోని విపరీతమైన వేడి శరీరంలోని నీటినంతటినీ చెమట రూపంలో పీల్చేస్తుంది. ఫలితంగా డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక చెమట అధికంగా పట్టడం వల్ల శరీరంలోని ఎలక్ర్టోలైట్స్‌ స్థాయుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. అదేవిధంగా కొన్ని రకాల సీజనల్‌ వ్యాధులు, చర్మం జిడ్డుగా మారిపోవడం, కంది పోవడం, స్కిన్‌ అలర్జీలు, ట్యానింగ్ వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యకరమైన ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుందంటున్నారు పోషకాహార నిపుణులు.

డైట్‌ను మార్చుకోండిలా!
సీజన్‌ను బట్టి మన ఆహారంలోనూ, జీవనశైలిలోనూ కొన్ని మార్పులు చేసుకోక తప్పదు. ప్రత్యేకించి వేసవిలో శరీరానికి చలువ చేసే తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే. దీంతో పాటు మన జీవనశైలిలోనూ కొద్దిపాటి మార్పులు చేసుకుంటే వేసవి సమస్యలను సులభంగా అధిగమించవచ్చంటున్నారు నిపుణులు.

ఇమ్యూనిటీని పెంచుతాయి!
వేసవిలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, సీజనల్‌ వ్యాధులు తరచుగా వేధిస్తుంటాయి. ఆహారంలో విటమిన్‌-సిని చేర్చుకోవడం వల్ల వీటి నుంచి రక్షణ పొందవచ్చు. ప్రత్యేకించి నిమ్మ, బెర్రీస్‌, ద్రాక్ష, జామ లాంటి సిట్రస్‌ పండ్లతో పాటు బాదం పప్పు, పొద్దు తిరుగుడు విత్తనాలు, బచ్చలి లాంటి కూరలకు డైట్‌లో చోటివ్వాలి. వీటితో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఎలాంటి ఇన్ఫెక్షన్లు దరిచేరవు.

కెరోటినాయిడ్స్
యాంటీ ఆక్సిడెంట్‌ సమ్మేళనమైన కెరోటినాయిడ్స్‌ ఎరుపు, పసుపు, ఆకుపచ్చ పండ్లు, కూరగాయల్లో అధికంగా లభ్యమవుతాయి. సూర్యరశ్మి ప్రభావం నుంచి శరీరానికి, చర్మానికి ఇవి రక్షణ కలిగిస్తాయి. బొప్పాయి, పుచ్చకాయ, ద్రాక్ష, క్యారట్లు, బ్రకలి.. మొదలైన వాటిని ఎక్కువగా తీసుకుంటే కెరోటినాయిడ్స్‌ పుష్కలంగా శరీరానికి అందుతాయి. ఇక నిత్యం ఎండల్లో పనిచేసేవారు ఒక గ్లాసు టొమాటో జ్యూస్‌ తీసుకున్నా ఆరోగ్యానికి ఎంతో మంచిది.

విటమిన్‌-డి
సాధారణంగా శీతాకాలంలో ఆస్తమా సమస్య వస్తుంటుంది. అయితే వాతావరణంలోని అధిక వేడి, తేమ కారణంగా కూడా కొంతమంది ఇలాంటి లక్షణాలతో బాధపడుతుంటారు. దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో ఊపిరిత్తుల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో విటమిన్‌-డి సమృద్ధిగా ఉన్న డైట్‌ను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

యాంటీ ఆక్సిడెంట్లు
సాధారణంగా వేసవిలో చర్మ సంరక్షణకు సంబంధించిన సమస్యలు అధికంగా ఎదురవుతుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బ్లూ బెర్రీస్‌, నిమ్మజాతి పండ్లు, బాదం పప్పు, బచ్చలి, బీట్రూట్‌, గుమ్మడి, తర్బుజా.. వంటి పదార్థాల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో ఉండే వివిధ రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు భానుడి ప్రభావం నుంచి చర్మానికి రక్షణ కలిగిస్తాయి. చర్మంపై దద్దుర్లు, ట్యానింగ్ వంటి సమస్యలు రాకుండా కాపాడతాయి.

నీటి స్థాయులు తగ్గకుండా!
ఇక వేసవిలో శరీరంలో నీటి స్థాయులు కోల్పోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడుతుండాలి. అందుకోసం పెరుగు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, స్మూతీలు, ఫ్రూట్, వెజిటబుల్‌ జ్యూస్‌లను అధికంగా డైట్‌లో చేర్చుకోవాలి. తద్వారా డీహైడ్రేషన్‌తో పాటు వేసవిలో ఎదురయ్యే పలు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్