First Period: ఆ విషయంలో మారుతున్నామా..? లేదా?

నెలసరి ప్రారంభమైన రోజు నుంచి ఐదు, తొమ్మిది, పదకొండు.. ఇలా కొన్ని రోజుల పాటు అమ్మాయిల్ని ఎవరికీ కనిపించకుండా ఒక గదిలో ఉంచడం చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది....

Published : 29 May 2024 13:17 IST

ఓవైపు బిడియం, మరోవైపు సిగ్గు, ఇంకోవైపు ఆనందం.. ఇలా ఆడపిల్లలు బాల్యాన్ని వదిలి యవ్వనంలోకి అడుగుపెట్టే ఆ క్షణంలో వారి మనసులో కలిగే భావాలెన్నో! మరి ఈ దశలో వారి మనసులో కలిగే భయాల్ని, అపోహల్ని పోగొట్టి, వారికి ఎన్నో మధురానుభూతుల్ని అందించడానికి రజస్వల వేడుకను పెద్ద పండగలా జరుపుకోవడం మన దగ్గర ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ విషయంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ  కొన్ని మూఢాచారాలు కనిపించడం విచారకరం. ఈ నేపథ్యంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో 'ఫస్ట్ పిరియడ్ ట్రెడిషన్స్' ఎలా ఉంటాయో తెలుసుకుందాం రండి...

చీరకట్టించి.. ఫలహారాలతో ఒడి నింపి..!
నెలసరి ప్రారంభమైన రోజు నుంచి ఐదు, తొమ్మిది, పదకొండు.. ఇలా కొన్ని రోజుల పాటు అమ్మాయిల్ని ఎవరికీ కనిపించకుండా ఒక గదిలో ఉంచడం చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ సమయంలో ఆహారం దగ్గర్నుంచి ప్రతి ఒక్కటీ వారి గదిలోకి తీసుకెళ్లి అందిస్తుంటారు తల్లులు. ఇక ఈ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది కాబట్టి వారు నీరసించకుండా ఉండేందుకు నువ్వులు-బెల్లంతో కలిపి తయారుచేసిన ఉండలు వారి చేత తినిపిస్తారు. ఇక ఐదు, తొమ్మిది, పదకొండు.. ఇలా ఎవరి కుటుంబ పద్ధతులకు తగ్గట్లుగా వారు ఆ అమ్మాయి ఒంటికి పసుపు రాసి ముత్త్తెదువులతో మంగళ స్నానం చేయించి ఇంట్లోకి ఆహ్వానిస్తారు. తమ అమ్మాయి పెద్దమనిషైందన్న విషయాన్ని ఇప్పటిదాకా రహస్యంగా ఉంచిన కుటుంబ సభ్యులు.. ఓ మంచి రోజు చూసి, బంధువులు, స్నేహితులందరినీ పిలిచి పెద్ద ఎత్తున వేడుక నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఆ అమ్మాయి చేత చీర లేదా లంగా- ఓణీ కట్టించడం, పండ్లు-ఫలహారాలతో ఒడి నింపడం.. వంటివి చేస్తుంటారు. ఈ వేడుక ద్వారా తమ అమ్మాయి బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టిందన్న విషయాన్ని అందరికీ తెలియజేయడంతో పాటు పెద్దలందరి ఆశీస్సులు ఆమెకి అందేలా చేస్తారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ఈ తరహా సంప్రదాయం భారత్‌లోని చాలా ప్రాంతాల్లో ఆచరణలో ఉందని చెప్పుకోవచ్చు.

అరటిచెట్టుతో పెళ్లి..!
నెలసరి ప్రారంభమైన అమ్మాయికి నిర్వహించే వేడుకను అస్సామీయులు 'తులోనీ బియా'గా పిలుస్తారు. ఇందులో భాగంగా చిలిపి వయసు పోయి చిగురు వయసులోకి ప్రవేశించిన అమ్మాయికి అరటిచెట్టుతో పెళ్లి చేస్తారు. అయితే ముందుగా నెలసరి ప్రారంభమైన రోజు నుంచి అమ్మాయిని ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచుతారు. ఆ గదిలోకి ఇతర కుటుంబ సభ్యులు ముఖ్యంగా పురుషులు ప్రవేశించడానికి వీల్లేదు. ఈ సమయంలో ఆ అమ్మాయి పండ్లు మాత్రమే తినాల్సి ఉంటుంది. అలాగే నాలుగు వక్కల్ని ఒక ఎరుపు రంగు పేపర్లో చుట్టి ఇరుగుపొరుగు వాళ్లింట్లో ఉంచుతారు. ఇక నాలుగు రోజుల తర్వాత ఏడుగురు ముత్త్తెదువులు ఆ అమ్మాయి ఒంటికి పసుపు రాసి మంగళ స్నానం చేయిస్తారు. ఈ వేడుకను 'మహా హలోదీ'గా పిలుస్తారు. స్నానం పూర్తయ్యాక పట్టుబట్టలు-బంగారు ఆభరణాలతో అమ్మాయిని పెళ్లికూతురిలా ముస్తాబు చేస్తారు. ఆపై ఆమెకు స్నానం చేయించిన ప్రదేశంలో అరటి మొక్క నాటి దాంతో అమ్మాయికి పెళ్లి చేస్తారు.

బెల్లంతో అన్నం..!
ఇక కేరళ సంప్రదాయం ప్రకారం నెలసరి ప్రారంభమైన అమ్మాయిని మూడు రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా ఒక గదిలో రహస్యంగా ఉంచుతారట. ఈ సమయంలో ఆ గదిలో కేవలం నూనె దీపం వెలిగిస్తారట. ఆ దీపం ముందు ఒక రాగి పాత్రలో నీళ్లు నింపి దానిలో కొబ్బరి పువ్వుల్ని వేస్తారు. మూడు రోజుల తర్వాత అమ్మాయి మేనత్తలు ఆ అమ్మాయితో బెల్లమన్నం తయారుచేయిస్తారు. తద్వారా నెలసరి వల్ల కలుషితమైన అమ్మాయి తిరిగి శుద్ధి అవుతుందని వారు నమ్ముతారు. ఇక ఆ తర్వాత కొబ్బరి పూలు ఉంచిన పాత్రను అమ్మాయి చేత పడేయించి, ఆమెను దగ్గర్లోని చెరువుకు తీసుకెళ్లి, ఒంటికి పసుపు రాసి, మంగళస్నానం చేయిస్తారు. ఈ క్రమంలో ఆడవాళ్లు పాటలు పాడడం, చెరువులో సరదాగా ఈతకొట్టడం చేస్తారు. స్నానం పూర్తయ్యాక గ్రామంలోని పూజారి అమ్మాయి వద్దకొచ్చి.. ఆమెను ఆశీర్వదిస్తాడు. అలాగే ఐదో రోజున ఆ పూజారి లేత కొబ్బరి ఆకులతో తయారుచేసిన మాలల్ని అమ్మాయికి అలంకరించి, పాటలు పాడతాడు. అదే సమయంలో అమ్మాయి చేత ఆ పూజారికి డబ్బులు ఇప్పిస్తారు. తద్వారా అమ్మాయి శుద్ధి అవుతుందని కేరళీయులు భావిస్తారు.

ఆటపాటలతో అలరిస్తారు..
నెలసరి ప్రారంభమైన అమ్మాయికి ఇరుగుపొరుగు మహిళలంతా కలిసి హారతివ్వడం కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తుంది. బాల్యాన్ని వదిలి యవ్వనంలోకి అడుగుపెట్టిన అమ్మాయికి నిర్వహించే వేడుకలో ఇరుగు పొరుగు మహిళలు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు.. ఇలా అందరూ భాగమవుతారు. ఈ క్రమంలో ఇరుగుపొరుగు మహిళలు పెద్దమనిషైన అమ్మాయికి మంగళస్నానం చేయించి, పట్టుబట్టలు కట్టించి.. హారతిస్తూ పాటలు పాడతారు. ఆ తర్వాత నువ్వులు-బెల్లం కలిపి తయారుచేసిన 'చిగాలీ ఉండే' (నువ్వుల ఉండలు)లను ఆ అమ్మాయికి తినిపిస్తారు. తద్వారా ఈ సమయంలో ఎక్కువగా బ్లీడింగ్ అయినా.. ఈ నువ్వుల ఉండల వల్ల రక్తహీనత సమస్య తలెత్తకుండా ఉంటుందని వారు భావిస్తారు. ఇక ఈ వేడుకకు వచ్చిన అతిథులకు కొబ్బరి ముక్క, తమలపాకులు, వక్కలు.. వంటి వాటితో వాయనం ఇవ్వడం కర్ణాటక ప్రజలు పాటించే ఆచారం.

మినీ-మ్యారేజ్‌లా..!
మనదేశంలో పసుపును ఎంతో పవిత్రంగా భావించడం తెలిసిందే. అందుకే పెద్దమనిషైనా, పెళ్లి కూతుర్ని చేసే ముందైనా, ప్రసవమయ్యాక 21 రోజుల లోపైనా.. ఇలా ప్రతి వేడుకలోనూ మహిళలకు పసుపు రాసి మంగళ స్నానం చేయించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే పద్ధతిని పెద్దమనిషైన అమ్మాయి విషయంలో పాటిస్తుంటారు తమిళనాడు ప్రజలు. నెలసరి ప్రారంభమైన అమ్మాయిని కొన్ని రోజుల పాటు దూరంగా ఉంచి ఆపై అందరినీ పిలిచి వేడుక నిర్వహిస్తుంటారు. ఆ రోజు ఉదయాన్నే ఆడవాళ్లంతా కలిసి ఆ అమ్మాయికి పసుపు రాసి మంగళ స్నానం చేయిస్తారు. దీన్నే అక్కడి వారు 'మంజల్ నీరట్టు విఝా'గా పిలుస్తారు. ఆపై అమ్మాయికి చీర లేదా లంగా-ఓణీ కట్టించి.. వచ్చిన బంధువులు దీవెనలతో పాటు బహుమతులు కూడా ఆ అమ్మాయికి అందిస్తారు. ఇలా నెలసరి ప్రారంభ వేడుకను ఓ చిన్న మినీ-మ్యారేజ్ అంత ఘనంగా నిర్వహిస్తారు తమిళులు.

అలా చేస్తే శుద్ధి..!
రజస్వల వేడుకల్లో భాగంగా పశ్చిమ బంగలోని 'ఘోటీ బెంగాలీస్' తెగలో వింత సంప్రదాయాన్ని ఆచరిస్తారు. నెలసరి ప్రారంభమైన అమ్మాయిని ఏడు రోజుల పాటు అందరికీ దూరంగా ప్రత్యేకమైన గదిలో ఉంచుతారు. ఇక ఏడో రోజున పూజ నిర్వహించి.. ఆవు పేడ, మూత్రాన్ని పాలల్లో కలిపి.. ఆ అమ్మాయితో తినిపిస్తారట. తద్వారా నెలసరి వల్ల కలుషితమైన ఆ అమ్మాయి శుద్ధి అవుతుందని ఆ తెగ వారి నమ్మకమట. కేవలం ఇదే కాదు.. అక్కడి ఇతర తెగల్లో.. నెలసరి ప్రారంభమైన అమ్మాయి పచ్చళ్లు, పచ్చి అప్పడాల్ని తాకకూడదనే సంప్రదాయం కూడా ఉంది. అంతేకాదు.. ఈ సమయంలో ఆమె వంట ఆమే చేసుకోవడం, ప్రత్యేకమైన గదిలో చాప మీద పడుకోవడం, గుళ్లూ-గోపురాలకు, ఇంట్లో నిర్వహించే పూజలకు అనుమతించకపోవడం.. వంటివి అక్కడే కాదు.. ఇండియాలో చాలా చోట్ల మనం చూడచ్చు.


మూఢాచారాలు వద్దు!

రజస్వల అయినప్పుడు వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారాలు, సంప్రదాయాలు పాటించడం మాములే. అయితే ఈ విషయంలో కూడా.. మహిళలు బాగా చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాల్లో పరిస్థితులు మారుతున్నాయి. నెలసరిని కూడా ఒక సహజమైన ప్రక్రియగానే భావించి.. ఆ సమయంలో ఎలాంటి ఆర్భాటాలు చేయకుండా ఉండడం ఇటీవలి కాలంలో ఎక్కువగానే కనిపిస్తోంది. ఒకరకంగా ఇది ఆహ్వానించాల్సిన పరిణామమే. తొలిసారిగా నెలసరి పలకరించి.. యుక్త వయసులోకి అడుగుపెట్టేటప్పుడు.. అమ్మాయిలకు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి అర్ధమయ్యే రీతిలో వివరించడంలో ఎలాంటి తప్పూ లేదు.. అలా చేయడం తల్లిదండ్రుల బాధ్యత కూడా!
అయితే- ఆచారాలు మూఢాచారాలుగా పరిణమించడం, ఈ సమయంలో నెలసరి పేరిట అమ్మాయిల పట్ల అమానుషంగా ప్రవర్తించడం; సంప్రదాయాల పేరుతో వారి ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే, స్వేచ్ఛకు ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడడం మాత్రం తీవ్రంగా గర్హనీయం. ఇలాంటి అర్ధంపర్ధం లేని ఆచారాలను, సంప్రదాయాలను మాత్రం ప్రతి ఒక్కరూ ఖండించి తీరాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్